టీఎస్ పీఎస్సీ చైర్మన్ పై ఆర్ఎస్పీ ఆసక్తికర ట్వీట్

by Disha Web |
టీఎస్ పీఎస్సీ చైర్మన్ పై ఆర్ఎస్పీ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో టీఎస్ పీఎస్సీ చైర్మన్ బి.జనార్ధన్ రెడ్డి వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ప్రతిష్టాత్మక సంస్థకు చైర్మన్ గా ఉన్న ఆయన తన పరిధిలో ఇంత తతంగం జరుగుతున్నా పసిగట్టలేకపోవడం పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చైర్మన్ పదవి నుంచి వైదొలగాలని డిమాండ్లు వ్యక్తం అవుతున్న తరుణంలో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తాజాగా ఆసక్తికర ట్వీట్ చేశారు. టీఎస్ పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డితో నాకు వ్యక్తిగత వైరం ఏమీ లేదని, యూనివర్సిటీలో ఆయన నాకు సూపర్ సీనియర్ అని చెప్పారు.

గురుకుల సెక్రటరీగా తాను ఉన్న సమయంలో ఉద్యోగరీత్యా అనేక సార్లు వారిని కలిశానన్నారు. కానీ టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ అంశం లక్షలాది మంది నిరుద్యోగుల భవిష్యత్ ను అంధకారంలోకి నెట్టివేసిందని అందువల్ల దయచేసి చైర్మన్ పదవి నుంచి దిగిపోండి సర్ అంటూ ట్వీట్ చేశారు. ప్రశ్నపత్రాలకు ఆమోదం తెలపడం ప్రింటింగ్‌కు పంపడం వంటి విధులు చైర్మన్ పరిధిలోనే ఉంటాయని టీఎస్ పీఎస్సీ బోర్డులో చైర్మన్ పాత్ర ఏంటో తెలిపే వివరాలను ఈ సందర్భంగా ఆర్ఎస్పీ షేర్ చేశారు.
Next Story