వేములవాడ ఆలయ అభివృద్ధికి రూ.693.25 కోట్లు.. తొలి విడతలో రూ.108.25 కోట్లు మంజూరు

by Kema Shiva Kumar |

వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి మాహర్ధశ పట్టనుంది. ఆలయ అభివృద్ధితో పాటు ఆలయానికి వచ్చే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

వేములవాడ ఆలయ అభివృద్ధికి రూ.693.25 కోట్లు.. తొలి విడతలో రూ.108.25 కోట్లు మంజూరు
X

దిశ, తెలంగాణ బ్యూరో: వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి మాహర్ధశ పట్టనుంది. ఆలయ అభివృద్ధితో పాటు ఆలయానికి వచ్చే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. యాదాద్రి లక్ష్మినరసింహ్మ స్వామి ఆలయం మాదిరిగా వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వెలసిన ఈ ఆలయంలో శివుడు, సతీసమేతంగా లింగం రూపంలో దర్శనమిస్తాడు. ఈ ఆలయాన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని పశ్చిమ చాళుక్యుల కాలంలో క్రీస్తు శకం 750 నుంచి 973 మధ్య కాలంలో నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.693.25 కోట్లు కేటాయించింది. దీనిలో మొదటి విడతలో మంజూరు చేసిన రూ.108.25 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నారు. రెండో విడతలో రూ.285 కోట్లు, మూడో విడతలో రూ.100 కోట్లు, 2027-28లో నాలుగో విడతలో రూ.250 కోట్ల నిధులు మంజూరు చేయనున్నారు. ఈ నిధులతో 20 ఎకరాల విస్తీర్ణంలో ఆలయానికి వచ్చే భక్తుల వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ స్థలాన్ని, భక్తుల సౌకర్యాలకు సంబంధించిన వివిధ అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. అంతే కాకుండా పరిసర ప్రాంతాల్లోని ఆలయాలను పునరుద్దరించనున్నారు. స్వామి వారి ప్రాంగణ సమీపంలోని దుకాణాలు, ఇతర వ్యాపారాలు నిర్వహించే వారికి ప్రత్యేక షెడ్లు, షాపింగ్ కాంప్లెక్స్ లను నిర్మించనున్నారు.

ఆలయ స్థల పురాణం ఇలా..

ఈ దేవాలయానికి సుదూర ప్రాంతాల నుంచి యాత్రికులు వస్తుంటారు. దేవాలయంలో ఈ క్షేత్రం గురించి భవిష్యోత్తర పురాణంలోని రాజేశ్వరఖండంలో పేర్కొన్నారు. అర్జునుడి మునిమనవడైన నరేంద్రుడు.. ఒక ఋషిని చంపటం కారణంగా కలిగిన బ్రహ్మహత్యాపాతకాన్ని వదిలించుకునేందుకు దేశాటన చేస్తూ ఇక్కడికి చేరుకున్నాడట. ఇక్కడి ధర్మగుండంలో స్నానం చేసి, జపం చేస్తున్న నరేంద్రుడికి కొలనులో శివలింగం దొరికిందట. కొలను సమీపంలో శివలింగాన్ని ప్రతిష్ఠించి, పూజించిన నరేంద్రుడికి శివుడు ప్రత్యక్షమై బ్రహ్మహత్యాపాతకం నుంచి విముక్తి కలిగించాడట. ఆ శివలింగమే ఇప్పుడున్న మూలవిరాట్టని స్థలపురాణంలో చెబుతారు. మూలవిరాట్టుకు కుడి పక్కన శ్రీ రాజ రాజేశ్వరీ దేవి, ఎడమ పక్కన శ్రీ లక్ష్మీ సహిత సిద్ధి వినాయక విగ్రహాలు ఉంటాయి. ఇక్కడికి వచ్చే భక్తులు చేసే పూజల్లో ప్రముఖమైంది కోడె మొక్కు. భక్తులు గిత్తను తీసుకువచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయించి ప్రాంగణంలో ఒకచోట కట్టివేస్తారు. దీనివలన భక్తుల పాపాలు తొలగిపోయి, సంతాన ప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు. శివరాత్రి రోజున మూడు లక్షలకు పైగా భక్తులు రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఆ రోజున రాత్రివేళ దీపాలంకరణలతో దేవాలయం దేదీప్యమానంగా వెలిగిపోతుంటుంది.

Next Story