CM Revanth Reddy: ఇకపై వారిని పెళ్లి చేసుకుంటే రూ.2 లక్షలు..సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

by Prasad Jukanti |

పోటీ ప్రపంచంలో తాము వెనకబడ్డామన్న ఆలోచన లేకుండా అన్ని రంగాల్లో దివ్యాంగులకు అవకాశాలు కల్పిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

CM Revanth Reddy: ఇకపై వారిని పెళ్లి చేసుకుంటే రూ.2 లక్షలు..సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు మానవీయ కోణంలో సహకారం అందిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దివ్యాంగులను ఈ ప్రభుత్వం సొంత కుటుంబ సభ్యులుగా భావిస్తోందని అందుకే దివ్యాంగులు సమాజంలో ఆత్మగౌరవంతో నిలబడేలా మా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. రూ. 50 కోట్లతో వారికి సహాయ ఉపకరణాలు పంపిణీ చేస్తున్నామన్నారు. ఇవాళ ప్రజాభవన్‍లో దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ, ప్రణామ్ వయోవృద్ధుల డే కేర్ సెంటర్లు, బాల భరోసా పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. దివ్యాంగులను దివ్యాంగులు వివాహం చేసుకుంటే రూ.2 లక్ష ఆర్థిక సాయం అందించేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. దివ్యాంగులను ఇతరులు పెళ్లి చేసుకున్నా ఆర్థిక సయం అందిస్తామని వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో దివ్యాంగులకు సముచిత స్థానం ఇస్తామన్నారు. విద్యా, ఉద్యోగాలు, క్రీడల్లో రాణించిన దివ్యాంగులు ఏమాత్రం రాణించిన వారిని ప్రోత్సహించేలా మా ప్రభుత్వం పని చేస్తోందని దివ్యాంగులు ఏ మాత్రం ఆత్మస్థైర్యం కోల్పోవద్దన్నారు. క్రీడల్లో దివ్యాంగులను ప్రోత్సహించాలని పారాలింపిక్స్ లో విజయం సాధించిన అమ్మాయికి ఉద్యోగం ఇచ్చామన్నారు. ప్రభుత్వం కల్పించే అవకాశాలను ఉపయోగించుకుని దివ్యాంగులు ఎదగాలన్నారు. ఈ ప్రాంతంలో దివ్యాంగులకు సూదిని జైపాల్ రెడ్డి స్ఫూర్తి అన్నారు. వైకల్యం ఉందనే ఆలోచనలను కూడా జైపాల్ రెడ్డి రానివ్వకుండా ఉత్తమ పార్లమెంటెరియన్ గా ఎదిగారన్నారు.

Next Story