- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘నాకు ఏం జరిగినా రేవంత్ రెడ్డిదే బాధ్యత’.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తనపై కక్షగట్టి వేధిస్తోందని ఆయన ఆరోపించారు. శనివారం మీడియా ముఖంగా ఆయన మాట్లాడిన పలు వ్యాఖ్యలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ప్రజా సమస్యలపై నిరంతరం గొంతెత్తుతూ, విపక్ష నేతగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే తనను అధికార పక్షం టార్గెట్ చేసిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. ప్రజల పక్షాన నిలబడటమే తాను చేసిన తప్పా అని ఆయన ప్రశ్నించారు. తనకు కనీస ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ప్రభుత్వం భద్రతను (సెక్యూరిటీ) తొలగించిందని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మాజీ ఉన్నతాధికారిగా, ప్రజా ప్రతినిధిగా ఉన్న తనకు రక్షణ లేకుండా చేయడం వెనుక ఉన్న అంతరార్థం ఏంటని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఆయన సీఎం రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేస్తూ.... "నాకు భవిష్యత్తులో ఏం జరిగినా, నా ప్రాణానికి ఏ హాని తలపెట్టినా దానికి ముమ్మాటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే పూర్తి బాధ్యత" అని స్పష్టం చేశారు.
అంతా ప్రజల కోసమే: ఆర్ఎస్పీ
తాను చేస్తున్న పోరాటాల వెనుక ఎటువంటి వ్యక్తిగత స్వార్థం లేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తేల్చి చెప్పారు. "నేను ఏం చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా అది కేవలం ప్రజల కోసమే. నాకంటూ ఎలాంటి సొంత ఎజెండాలు లేవు" అని ఆయన పేర్కొన్నారు. భద్రతను తొలగించినంత మాత్రాన భయపడేది లేదని, ప్రజల తరపున తన గొంతుక మరింత బలంగా వినబడుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ శ్రేణులు సైతం అసంతృప్తి వ్యక్తం చేస్తుండటంతో, ఈ సెక్యూరిటీ ఉపసంహరణ వ్యవహారం రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ మలుపులు తీసుకుంటుందో చూడాలి.






