- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అలుగు వర్షిణి పై చర్యలు తీసుకోవాలి.. గురుకుల విద్యార్థుల తల్లిదండ్రులతో ఆర్ఎస్పీ
టాయిలెట్లు విద్యార్థులు కడగాలని ఆదేశాలు ఇచ్చిన రాష్ట్ర ఎస్సీ గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిణి పై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: టాయిలెట్లు విద్యార్థులు కడగాలని ఆదేశాలు ఇచ్చిన (TGSWREIS) రాష్ట్ర ఎస్సీ గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిణి పై చర్యలు తీసుకోవాలని, వెంటనే సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇవాళ (శనివారం) ఎస్సీ సంక్షేమ గురుకులాల విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్ రెడ్డి పాలనలో గురుకులాలు అధ:పాతాళానికి వెళ్తున్నాయని, పేద పిల్లలు రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. విద్యార్థులు వాళ్ళ టాయిలెట్స్ వాళ్ళు కడుక్కుంటే తప్పు ఏంటి అని ఐఏఎస్ అధికారి అంటున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇంట్లో టాయిలెట్ రేవంత్ రెడ్డి కడుగుతున్నారా? అని ఫైర్ అయ్యారు. మీ పిల్లల స్కూల్లో టాయిలెట్స్ మీ పిల్లలు కడుగుతున్నారా? అని నిలదీశారు. ఎస్సీ వర్గాల పట్ల ఐఏఎస్ అలుగు వర్షిణి వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. అందరికంటే పెద్ద మాదిగ, పెద్ద మాల నేనే అని రేవంత్ రెడ్డి అంటారని, కానీ పేద పిల్లలు టాయిలెట్స్ వాళ్లే కడుక్కోవాలని ఐఏఎస్ అధికారితో ఎట్లా చెప్పిస్తారని అన్నారు.
దళిత వర్గాలు గత కొన్ని వందల ఏళ్లుగా టాయిలెట్స్ కడుగుతున్నారని, ఎవరి టాయిలెట్స్ వాళ్లు కడుక్కోవాలని రాష్ట్రవ్యాప్తంగా జీవో ఇవ్వాలని సూచించారు. ఎస్సీలు ఇంజనీర్లు, డాక్టర్లు కావాలని కేసీఆర్ గురుకులాలు పెట్టారని గుర్తుకు చేశారు. గురుకుల విద్యార్థిని ఆగసార నందినికి గోల్డ్ మెడల్ వస్తే రేవంత్ రెడ్డి ఎందుకు నగదు ప్రోత్సాహం ఇవ్వరని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా 30 గురుకుల మహిళా డిగ్రీ కాలేజీలు కేసీఆర్ (KCR) పెట్టారని, ఈ రోజుకి డిగ్రీ కాలేజీల్లో ఒక్క అడ్మిషన్ కాలేదన్నారు. గురుకుల మహిళా డిగ్రీ కాలేజీలు మూతపడే విధంగా రేవంత్ రెడ్డి, అలుగు వర్షిణి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో రేవంత్ రెడ్డి స్కామ్ చేస్తున్నారని అన్నారు. గురుకుల ఇంటర్ కాలేజీల్లో విద్యార్థులు ఫెయిల్ అయితే ప్రభుత్వం సప్లిమెంటరీ ఫీజు కట్టలేదని, గురుకులాల విద్యార్థులు రాష్ట్ర మంత్రి దామోదర రాజనర్సింహ దగ్గరకు వెళ్తే ఆయన ఏం చేయలేకపోయారని ఆరోపించారు. అలుగు వర్షిణి లాంటి అధికారులను సీఎంఓ ఆఫీసులో పెట్టుకోవాలని సూచించారు. గురుకులాలు రాష్ట్రంలో ప్రమాదంలో ఉన్నాయని, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం రాష్ట్రంలో ఉందని తెలిపారు.






