'పోలీస్ ఈవెంట్స్‌లో లాంగ్‌జంప్ దూరాన్ని తగ్గించాలి'

by Disha Web Desk 2 |
పోలీస్ ఈవెంట్స్‌లో లాంగ్‌జంప్ దూరాన్ని తగ్గించాలి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎస్ఐ, కానిస్టేబుల్ దేహదారుడ్య పరీక్షలో లాంగ్ జంప్ 3.8 మీటర్లు పరిగణలోకి తీసుకోవాలని, ఎత్తు మాన్యువల్‌గా కొలవాలని, షాట్ పుట్ లైన్ మీద పడినా క్వాలిఫై చేయాలని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 1600/800 మీటర్లు పరిగెత్తిన వారిని ఫైనల్ పరీక్షకు సెలెక్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో లాంగ్ జంప్ 3.8 మీటర్ల నుంచి నాలుగు మీటర్లకు పెంచారని, షాట్ పుట్ 5.6 మీటర్ల నుంచి 6 మీటర్లు పెంచారని దీనివల్ల ఎక్కువ మంది అభ్యర్థులు నష్టపోతున్నారని ఆయన తెలిపారు. దేహదారుడ్య పరీక్షలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. సోమవారం బీఎస్పీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్మీలో కూడా లాంగ్ జంప్ నాలుగు మీటర్లు లేదని, తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే కుట్ర పూరితంగా ఎక్కువ మంది హాజరు కాకూడదని ఇలా చేస్తున్నారని ఆరోపించారు. షాట్ పుట్‌లో ఆరు మీటర్ల లైన్ మీద పడినా, క్వాలిఫై చేయడం లేదని అభ్యర్థులు చెబుతున్నారని పేర్కొన్నారు.

ఎత్తు కొలిచే విధానంలో లోపాలు

అభ్యర్థుల ఎత్తు కొలిచే సందర్భంలో సాంకేతిక లోపం వల్ల చాలామంది నష్టపోతున్నారని, అందుకు మ్యానువల్‌గా కొలవాలని డిమాండ్ చేశారు. ఈసారి పురుషులకు 1600 మీటర్లు, అమ్మాయిలకు 800 మీటర్ల పరుగు పెట్టారని కానీ, గ్రామీణ ప్రాంతాల్లో కనీసం కోచింగ్ ఇచ్చే ప్రయత్నం చేయలేదన్నారు. గ్రామాల్లో ఎక్కడా కనీసం పీఈటీ, గ్రౌండ్ కూడా సరిగా లేదన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాల్లో కనీస వసతులు లేక పశువులు తిరుగుతున్నాయని విమర్శించారు. ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇవ్వకుండా ఎన్నికల సమయంలో ఇచ్చి అభ్యర్థులను ఆందోళనకు గురి చేయొద్దన్నారు. మూడు ఈవెంట్స్ పెట్టి అవి ఖచ్చితంగా క్వాలిఫై కావాలని నిబంధన పెట్టడం, పైగా కమ్యూనికేషన్, ఎక్సైజ్ అభ్యర్థులకు కూడా మూడు ఈవెంట్స్ తప్పనిసరి చేయడం దారుణమన్నారు. ఈ అంశంపై గత పదిహేను రోజులుగా అభ్యర్థులు పోరాడుతున్నా ప్రభుత్వం స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, తమ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే పోలీసులు అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్య మండిపడ్డారు. కావున ప్రభుత్వం వెంటనే స్పందించి అభ్యర్థులకు న్యాయం చేయాలని, లేనిచో బీఎస్పీ అన్యాయానికి గురైన అభ్యర్థుల తరపున నిలబడి నిరుద్యోగుల కోసం పోరాడుతుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో అధికార ప్రతినిధి ఆర్.సాంబశివ గౌడ్ పాల్గొన్నారు.

READ MORE

బీడీఎస్ 'మేనేజ్‌మెంట్' సీట్ల భర్తీకి మాప్ అప్ నోటిఫికేషన్ విడుదల



Next Story

Most Viewed