- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పంట అవశేషాల కాల్చివేతపై రూ.5 వేల జరిమానా: వ్యవసాయ శాఖ
పంట భూముల్లో కోత అనంతరం మిగిలే పంట అవశేషాలను కాల్చివేస్తే భూసారం దెబ్బతినడంతో పాటు పర్యావరణం, ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకులు డా. బి. గోపి తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో : పంట భూముల్లో కోత అనంతరం మిగిలే పంట అవశేషాలను కాల్చివేస్తే భూసారం దెబ్బతినడంతో పాటు పర్యావరణం, ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ సంచాలకులు డా. బి. గోపి తెలిపారు. తాత్కాలిక సౌలభ్యం కోసం పంట వ్యర్థాలను తగులబెట్టడం రైతులకు దీర్ఘకాలంలో ఆర్థిక నష్టాలను కలిగిస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలోని వ్యవసాయ విస్తరణ అధికారులు, వ్యవసాయ అధికారులు పంట అవశేషాల దహనంతో కలిగే నష్టాలపై రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు. శనివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ పంట అవశేషాలను కాల్చడంతో నేలలోని సేంద్రియ కర్బనం, నత్రజని, భాస్వరం, పొటాష్ తో పాటు సూక్ష్మ పోషకాలు నశించి భూమి నిస్సారంగా మారుతుంది. భూమికి మేలు చేసే వానపాములు, మిత్ర పురుగులు నశించడంతో నేల జీవ సత్తువ కోల్పోయి, పంట దిగుబడులు క్రమంగా తగ్గిపోతుందన్నారు. పంట వ్యర్థాల కాల్చడంతో విడుదలయ్యే కార్బన్ మోనాక్సైడ్, మీథేన్ వంటి వాయువులు గాలి కాలుష్యాన్ని పెంచి ఆస్తమా, శ్వాసకోశ సమస్యలకు దారి తీస్తాయి. గర్భిణీలు, చిన్నపిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు.
రోడ్లపై పొగమంచు ఏర్పడి కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశముందన్నారు. ఈసందర్భంగా పలు సూచనలు చేస్తూ యాంత్రికరణ పరికరాలైన రోటావేటర్, శ్రెడర్ వంటి యంత్రల ద్వారా పంట అవశేషాలను భూమిలోనే కలియదున్నాలి.. పంట వ్యర్థాలపై యూరియా, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, డీకంపోజర్ ను వినియోగించడం ద్వారా వాటిని త్వరగా సేంద్రియ ఎరువుగా మార్చవచ్చు.. దీనివల్ల రసాయన ఎరువుల ఖర్చు తగ్గుతుంది.. వ్యర్థాలను కంపోస్ట్, వర్మీ కంపోస్టు తయారీకి, పశుగ్రాసంగా కానీ మల్చింగ్ కోసం వినియోగించి అదనపు ఆదాయం పొందవచ్చని సూచించారు. ప్రతి మంగళవారం నిర్వహించే రైతు నేస్తం కార్యక్రమాల్లో పంట అవశేషాల నిర్వహణపై ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. పర్యావరణ పరిరక్షణ చట్టం ప్రకారం అవశేషాలను బహిరంగంగా కాల్చకుండా రైతులు జాగ్రత్తలు పాటించాలని, పర్యావరణం, భూసారం కాపాడే ఉద్దేశంతో ఇటువంటి ఘటనలపై రూ.5 వేల వరకు పర్యావరణ పరిహారం విధించే నిబంధనలు అమలులో ఉన్నాయని తెలిపారు. రైతులు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని, భూమి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ సుస్థిర వ్యవసాయం దిశగా ముందుకు సాగాలన్నారు.






