సింగరేణిలో రూ.1,600 కోట్ల బొగ్గు స్కామ్? కేంద్రం-రాష్ట్రం సమాధానం చెప్పాలన్న కేటీఆర్

by Ramesh Naini |

‘గతంలో మల్కాజ్‌గిరి ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి.. సీఎం అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌ను బాంబులు పెట్టి పేల్చేసినా తప్పు లేదు అన్నప్పుడు ఆయన శిక్షార్హుడు కాదా? హైదరాబాద్ పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్న ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై ఎందుకు చర్యలు లేవు? బాల్క సుమన్‌పై పెట్టిన సెక్షన్లు ఆయనకు వర్తించవా?’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.

సింగరేణిలో రూ.1,600 కోట్ల బొగ్గు స్కామ్? కేంద్రం-రాష్ట్రం సమాధానం చెప్పాలన్న కేటీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘గతంలో మల్కాజ్‌గిరి ఎంపీగా, పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి.. సీఎం అధికారిక నివాసమైన ప్రగతి భవన్‌ను బాంబులు పెట్టి పేల్చేసినా తప్పు లేదు అన్నప్పుడు ఆయన శిక్షార్హుడు కాదా? హైదరాబాద్ పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామన్న ప్రస్తుత కేంద్ర మంత్రి బండి సంజయ్‌పై ఎందుకు చర్యలు లేవు? బాల్క సుమన్‌పై పెట్టిన సెక్షన్లు ఆయనకు వర్తించవా?’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. చంచల్‌గూడ జైలులో ఉన్న బాల్క సుమన్‌ను బీఆర్ఎస్ నేతలు తలసాని శ్రీనివాస్‌యాదవ్, సుధీర్‌రెడ్డి, హర్షవర్ధన్‌రెడ్డితో కలిసి కేటీఆర్ గురువారం ములాకత్ అయ్యారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడారు. సిద్దిపేటలో హరీశ్‌రావు క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేసి పెట్రోల్ పోసి తగలబెడతా అన్న కాంగ్రెస్ నేత మైనంపల్లి హన్మంతరావుపై.. అలాగే ఒక కంపెనీని తగలబెడతానన్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డిపై చట్టం ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, సింగరేణి సంస్థలో జరుగుతున్న వేల కోట్ల రూపాయల బొగ్గు కుంభకోణాల నుంచి ప్రజల దృష్టి నుంచి మళ్లించేందుకే బాల్క సుమన్‌ను అక్రమ కేసులతో జైలులో పెట్టారని మండిపడ్డారు.

ప్రభుత్వ అక్రమాలకు, జైలు శిక్షలకు బీఆర్ఎస్ భయపడే ప్రసక్తే లేదని, సింగరేణి కార్మికుల పొట్టగొడుతున్న కాంగ్రెస్ సర్కార్‌ను గల్లా పట్టి నిలదీస్తామని హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి బావమరిది సృజన్‌రెడ్డి కనుసన్నల్లో సైట్ విజిటేషన్ సర్టిఫికేట్ పేరిట జరిగిన రూ.15,000 కోట్ల కుంభకోణాన్ని బీఆర్ఎస్ బహిర్గతం చేసిందన్నారు. అలాగే.. సోలార్ టెండర్లలో జరిగిన వందల కోట్ల అక్రమాలను బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు బయటపెట్టారని గుర్తుచేశారు. నైనీ బొగ్గు టెండర్ వ్యవహారంలో మంత్రులకు, ముఖ్యమంత్రికి మధ్య వాటాలు కుదరక, చివరకు మీడియా ప్రతినిధులను అరెస్ట్ చేసే వరకు వెళ్లారని, ఆ తర్వాత సదరు టెండర్‌ను రద్దు చేయాల్సి వచ్చిందని వివరించారు.

సింగరేణి కార్మికుల పొట్టగొడుతున్న సర్కార్

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) సమావేశంలో సింగరేణి సంస్థలో జరుగుతున్న అన్యాయాలపై బాల్క సుమన్ కార్మికుల పక్షాన నిలబడి గళమెత్తారని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో మెడికల్ ఇన్వాలిడేషన్ బోర్డు ద్వారా 19 వేల వారసత్వ ఉద్యోగాలు ఇస్తే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 11 నెలలుగా బోర్డు మీటింగులు పెట్టకుండా వేలాది మంది కార్మిక బిడ్డలకు అన్యాయం చేస్తున్నదని ధ్వజమెత్తారు. పైగా గతంలో ఇచ్చిన 19 వేల ఉద్యోగాలపై విజిలెన్స్ ఎంక్వైరీ జరిపిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రకటించి కార్మికుల్లో కలవరం రేపారని మండిపడ్డారు. కార్మికుల ఆక్రోశాన్ని చూసి చలించిపోయిన బాల్క సుమన్ మాట్లాడిన మాటలను వక్రీకరించి, సింగరేణిలో జరుగుతున్న అసలు దోపిడీని కప్పిపుచ్చడానికే ఆయనపై అక్రమంగా పీడీపీపీ యాక్ట్ కింద కేసులు పెట్టి జైలుకు పంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల అత్యుత్సాహాన్ని కోర్టు కూడా మందలించి, సదరు సెక్షన్లను తొలగించిందని గుర్తుచేశారు.

సింగరేణిలో బడా బాబుల ఆధ్వర్యంలో మైనింగ్ చేయని బొగ్గును చేసినట్టుగా రికార్డులు సృష్టించి రూ.1,600 కోట్ల మేర గోల్‌మాల్ చేశారని, 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయమైందని కేటీఆర్ ఆరోపించారు. సింగరేణిలో 49 శాతం వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నదని ప్రశ్నించారు. ఈ భారీ స్కామ్‌పై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డికి సమగ్రమైన లేఖ రాస్తానని వెల్లడించారు. ఇంత పెద్ద కుంభకోణం జరుగుతుంటే సీఎం ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.

Next Story