- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖమ్మం జిల్లాలో రూ.వెయ్యి కోట్ల స్కామ్.. రంగంలోకి స్పెషల్ టీమ్
ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన రూ.1,000 కోట్లకు పైగా సైబర్ మోసాల కేసుల దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో.. ఈ కేసులను సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు బదిలీ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ఖమ్మం జిల్లాలో సంచలనం సృష్టించిన రూ.1,000 కోట్లకు పైగా సైబర్ మోసాల కేసుల దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో.. ఈ కేసులను సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు బదిలీ చేశారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాలో నమోదైన రెండు కేసుల ఆధారంగా, సైబర్ సెక్యూరిటీ బ్యూరో కొత్తగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. వీ.ఎం.బంజర ఠాణాలో నమోదైన కేసుతో పాటు సత్తుపల్లిలో ఫైల్ అయిన మరో కేసును సైబర్ సెక్యూరిటీ బ్యూరో టేకప్ చేసింది. ఈ వ్యవహారంలో సాంకేతిక ఆధారాలు, బ్యాంకు లావాదేవీలు, మనీలాండరింగ్ కోణాలపై లోతైన విచారణ చేపట్టనున్నారు. డీఎస్పీ కె.వి.మురళీధర ప్రసాద్ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందానికి విచారణ బాధ్యతలు అప్పగించారు. ప్రతీవారం దర్యాప్తు పురోగతి నివేదికను సమర్పించాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.
నిరుద్యోగులను నమ్మించి..
ఉద్యోగాలు, వ్యాపార అవకాశాల పేరుతో నిరుద్యోగులను నమ్మించి, వారి పేర్లపై బ్యాంకు ఖాతాలు తెరిపించి, ఆ అకౌంట్ల పూర్తి నియంత్రణను తమ చేతుల్లోకి తీసుకుని దేశవ్యాప్తంగా జరిగిన సైబర్ మోసాల సొమ్మును బదిలీ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఖాతాల ద్వారా దాదాపు రూ.1,000 కోట్లకు పైగా లావాదేవీలు జరిగినట్లు దర్యాప్తు సంస్థలు అనుమానిస్తున్నాయి. ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురు నిందితులు అరెస్టు కాగా, మిగిలిన నిందితులు, వారికి సహకరించిన వ్యక్తులు, కంపెనీలు, బ్యాంకు ఖాతాల నెట్‌వర్క్‌పై సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రత్యేకంగా దృష్టి సారించింది. దర్యాప్తు వేగవంతం కావడంతో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రధాన నిందితుడు పోత్రు ప్రవీణ్, ఇతర నిందితులు పొత్రు కళ్యాణ్, మోరంపూడి చెన్నకేశవ రావు, జన్జునూరి శివకృష్ణ, ఉడుతనేని వికాస్ ఈ భారీ చీటింగ్‌లో నిందితులుగా ఉన్నారు. అధికార పార్టీకి చెందిన మంత్రి స్థాయి అనుచరులుగా ఇందులో కొందరికి ముద్ర ఉందనే టాక్ వినిపిస్తోంది.






