Kavitha: కులగణన విషంలో బీజేపీ దేశ ప్రజలకు మోసం: కవిత

by Prasad Jukanti |

బీజేపీ తెచ్చిన సెన్సస్ డాక్యుమెంట్ చాలా గందరగోళంగా ఉందని కవిత ఆరోపించారు.

Kavitha:  కులగణన విషంలో  బీజేపీ దేశ ప్రజలకు మోసం: కవిత
X

దిశ, డైనమిక్ బ్యూరో: కులగణన విషయంలో కేంద్రంలోని బీజేపీ దేశ ప్రజలను మోసం చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. త్వరలో జరగబోయే సెన్సస్ డాక్యుమెంట్‍లో గతంలో ఉన్న మాదిరిగానే ఎస్సీ, ఎస్టీ కేటగిరి పెట్టి ఓబీసీ, ఇతర కులాలను ఇతరులు అని పేర్కొంటున్నారని విమర్శించారు. దీని వల్ల కులం దాని కింద ఉండే ఉప కులాల ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. ఇవాళ హైదరాబాద్‍లో జాతీయ జన గణనలో కులగణన పై రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. భారతదేశంలో కుల వ్యవస్థ ఎంత కన్ఫ్యూజన్ గా ఉంటుందో మనందరికి తెలుసని ఓ కమ్యూనిటీ ఒక రాష్ట్రంలో ఒక కేటగిరిలో ఉంటే మరో రాష్ట్రంలో ఇంకో కేటగిరిలో ఉంటోందన్నారు. అలాంటిది ఇక 56 శాతం ఉన్న ఓబీసీ కమ్యూనిటీ విషయంలో ఎంత కన్ఫ్యూజన్ ఉంటుందో ఆలోచించాలని ప్రశ్నించారు.

కులంతో క్లారిటీ రాదు:

బీజేపీ అధికారంలోకి వచ్చాక అగ్రవర్ణాల్లోని పేదలకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు ఇస్తున్నారని వీళ్లు ఏ కేటగిరిలోకి వస్తారో అనేది ఈ కులం అనే కాలమ్ తో క్లారిటీ రాదన్నారు. బీజేపీ తెచ్చిన సెన్సస్ డాక్యుమెంట్ చాలా గందరగోళంగా ఉందని ఇదంతో ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని తెలంగాణలోనూ చర్చ జరిగి మన రాష్ట్ర అభిప్రాయాలను కేంద్రానికి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశామన్నారు.

కేంద్రానికి డేటా పంపుతాం:

తెలంగాణలో ఉన్న కులాలు వాటి కింద ఉన్న ఉపకులాల డేటాను తెలంగాణ జాగృతి తరఫున సేకరించి కేంద్రానికి పంపబోతున్నామని వెల్లడించారు. ఇందుకు అందరి మద్దతు కావాలని కోరారు. నిజానికి ఈ పని రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేయాలి కానీ అలా చేయడం లేదన్నారు. ఈ విషయంలో రాజకీయ పార్టీల పాత్ర చాలా కీలకంగా ఉంటుందని కానీ సెన్సస్ డాక్యుమెంట్ మీద బీఆర్ఎస్, కాంగ్రెస్, ఏమీ మాట్లాడటం లేదన్నారు. ఈ పార్టీలన్నీ ఈ విషయంలో తమ వైఖరి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Next Story