- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: అంగన్ వాడీ కేంద్రాల్లో కుళ్లిన గుడ్లు.. ఇదేంటని ప్రశ్నించిన టీచర్లకు వేధింపులు
చిన్నారులకు, గర్భిణులకు పౌష్టికాహారంతో పాటు పూర్వ ప్రాథమిక విద్య అందించే అంగన్ వాడీ కేంద్రాల్లో కుళ్లిన కోడిగుడ్లు దర్శనమిస్తున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: చిన్నారులకు, గర్భిణులకు పౌష్టికాహారంతో పాటు పూర్వ ప్రాథమిక విద్య అందించే అంగన్ వాడీ కేంద్రాల్లో కుళ్లిన కోడిగుడ్లు దర్శనమిస్తున్నాయి. శిశు, ప్రసూతి మరణాలు తగ్గించడంలో బలవర్ధకమైన పోషకాహారం అందజేయడం అత్యంత ముఖ్యమైనది. అందులో భాగంగానే ప్రభుత్వం బాలింతలు, గర్భిణులు, చిన్నారులకు అంగన్వాడీల ద్వారా పోషకాహారం అందిస్తూ వస్తోంది. అయితే ఏ లక్ష్యంతో ప్రభుత్వం అంగన్‌వాడీలను ఏర్పాటు చేసిందో అది పూర్తిస్థాయిలో నెరవేరడం లేదు. అంగన్‌వాడీల ద్వారా అందిస్తున్న పోషకాహర పదార్థాల్లో నాణ్యత లోపం ఉన్నట్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 35,700 అంగన్వాడి కేంద్రాలు ఉండగా వాటి ద్వారా నిత్యం చిన్నారులు,బాలింతలు, గర్భిణులకు పాలు, గుడ్లు, అన్నం, పప్పులు వంటి పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్ మండలానికి చెందిన ఒక అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందజేయగా అవి కుళ్లిపోయి ఉండడంతో వారు షాక్ అయ్యారు. ఇలాంటివి పిల్లలు, గర్భిణులు తింటే వారి ఆరోగ్యం ఏమవుతుందో అని వారు ఆందోళనకు గురయ్యారు. దీనిపై సీడీపీఓలను వివరణ కోరగా విచారణ చేపడతామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 35,700 అంగన్ వాడీ కేంద్రాల్లో ఏటా దాదాపుగా 36 కోట్లకుపైగా కోడిగుడ్లు సరఫరా అవుతున్నాయి.
గుడ్ల నాణ్యతపై ఫిర్యాదులు..
గత కొన్ని నెలలుగా అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్న కోడిగుడ్లు కుళ్లిపోయి దుర్వాసన వస్తోందనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కొన్నిచోట్ల కోడిగుడ్లు పంపిణీ చేసిన వెంటనే పిల్లలు వాటిని తినడానికి నిరాకరించడం, లేదా తిన్నవారికి వాంతులు, విరేచనాలు వంటి అనారోగ్య సమస్యలు తలెత్తినట్లు అధికారులు గుర్తించారు. కాంట్రాక్టర్లు సరఫరా చేయబడిన కోడిగుడ్లలో సుమారు 15 నుంచి 20 శాతం కోడిగుడ్లు పాడైపోయి లేదా కుళ్లిపోయి ఉన్నట్లు అంగన్వాడీ కార్యకర్తలు, తల్లిదండ్రులు ఫిర్యాదు చేస్తున్నారు. వాస్తవానికి ఒక్కోటి 45గ్రాముల నుంచి 50 గ్రాముల బరువు ఉండాలి. ఒక ట్రేలో 30కోడిగుడ్లు ఉంటే 1350 గ్రాముల నుండి కిలోన్నర బరువు ఉండాలి, కానీ సగటున ఒక్కో గుడ్డు 40 గ్రాములు ఉండగా ట్రే బరువు 1200 గ్రాములు దాటడం లేదని తెలుస్తోంది.
అధికారుల అలసత్వం
అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసి సమస్యలను గుర్తించాల్సిన మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులైన డీడబ్లూఓలు, సీడీపీవోల పర్యవేక్షణ లోపం కూడా ఈ సమస్యకు ప్రధాన కారణంగా చెప్పవచ్చు. కాంట్రాక్టర్లతో చేసుకున్న ఒప్పందాలను సరిగా అమలు చేయకపోవడం, నాణ్యత తనిఖీలను పటిష్టం చేయకపోవడం వంటివి ఇలాంటి పరిస్థితులకు దారితీస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. కొంతమంది అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై నాసిరకం గుడ్లు సరఫరా చేయడం ద్వారా ఆర్థిక ప్రయోజనాలు పొందుతున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. దీనికి కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న అధికారులే సూత్రధారులని తెలుస్తోంది.
అంగన్ వాడీ టీచర్లపై వేధింపులు
కోడిగుడ్లు దాదాపు 15 రోజుల కంటే ఎక్కువ నిలువ ఉండవు. కానీ కాంట్రాక్టర్ గుడ్లను ఒక దగ్గరికి సమకూర్చుకొని వాటిని స్టాంపింగ్ చేయడానికి ఒక వారం రోజులు పడుతుంది. వాటిని ఐసీడీఎస్ కేంద్రాలకు సరఫరా చేయడానికి ఓ నాలుగైదు రోజులు పడుతుంది. అంటే మొత్తంగా పది రోజులు కాంట్రాక్టర్ దగ్గరే కోడిగుడ్లు ఉంటాయి. కేవలం మూడు నాలుగు రోజులు మాత్రమే అంగన్వాడీ కేంద్రంలో ఉంటాయి. తర్వాత సరఫరా చేస్తే అవి కుళ్లిపోతున్నాయి. ఇలా అవి వచ్చిన సందర్భంలో కాంట్రాక్టర్లను ప్రశ్నించాల్సిన ఐసీడీఎస్ అధికారులు అంగన్‌వాడీ టీచర్లను బెదిరించిన సందర్భాలు ఉన్నాయి. కాంట్రాక్టర్లను పల్లెత్తు మాట కూడా అనడం లేదని తెలిసింది. చెక్ చేసుకోకుండా ఎందుకు తీసుకున్నారని అధికారులు టీచర్లను మందలిస్తున్నట్లు తెలిసింది. టీచర్లు ఒకవేళ అధికారులను ప్రశ్నిస్తే వాళ్లపై పెద్ద ఎత్తున వేధింపులు ఉంటాయని తెలిసింది.






