వికసిత భారత్ సాధించడంలో జియోసైన్సెస్ పాత్ర కీలకం : కేంద్రమంత్రి కిషన్​రెడ్డి

by Muthe.Rajitha |

ఖనిజ అన్వేషణలో శాస్త్ర, సుస్థిరత, సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషించే కొత్త శకంలోకి భారత్ ప్రవేశిస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

వికసిత భారత్ సాధించడంలో జియోసైన్సెస్ పాత్ర కీలకం : కేంద్రమంత్రి కిషన్​రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : ఖనిజ అన్వేషణలో శాస్త్ర, సుస్థిరత, సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషించే కొత్త శకంలోకి భారత్ ప్రవేశిస్తోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, పట్టణీకరణ, విపత్తుల నివారణ వంటి సవాళ్లను ఎదుర్కోవడానికి వినూత్న సాధనాలను అందించడం ద్వారా వికసిత భారత్ లక్ష్యాలను సాధించడంలో భూభౌతికశాస్త్రం పాత్ర కీలకమని వెల్లడించారు. సోమవారం బండ్లగూడ-నాగోల్ లోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ లో నెక్ట్స్ జనరేషన్ జియోఫిజిక్స్, అన్ లాక్ ఎర్త్ హిడెన్ ట్రెజర్స్ సదస్సు ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ సహజ వనరుల శాస్త్రీయ అన్వేషణలో భారత్ దీర్ఘకాలిక నిబద్ధతకు ఈ మైలురాయిని నిలిచిందన్నారు.

కొండచరియలు విరిగిపడడాన్ని ముందుగా సూచించే జాతీయ కేంద్రం ఏర్పాటు, విపత్తు సంసిద్ధతను మెరుగుపరచడానికి ఇటలీతో ఇటీవలి అవగాహన ఒప్పందం సహా భారత్ సాధించిన ప్రధాన పురోగతి వివరించారు. పర్యవేక్షణ వ్యవస్థలను విస్తరించాలని, ముందస్తు హెచ్చరికలకు సంబంధించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసరించాలని పిలుపునిచ్చారు. ప్రపంచ విద్య, పరిశోధనల్లో పెరుగుతున్న భారత్ ప్రాబల్యం పెరిగిందని, క్యూఎస్ వరల్డ్ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ 2025 లో భారతీయ సంస్థల పెరుగుదల 318 శాతం ఉన్నట్టు పేర్కొన్నారు. ఐఐటీ సీట్లను రెట్టింపు చేయడం, అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ను ఏర్పాటు చేయడం సైన్స్ అభివృద్ధి పట్ల ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శమన్నారు.

భూకంప కచ్చితత్వం కోసం సైంటిస్టులు సాంకేతికత అందుకోవాలి :

నిక్షిప్త ఖనిజ వనరులను అంచనా వేయడం, భూకంప సమాచారం మరింత కచ్చితత్వంతో వివరించడం సహా మెరుగైన అన్వేషణ కోసం కృత్రిమ మేధ (ఏఐ), క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని జియో సైంటిస్టులను కోరారు. రూ.10,300 కోట్లతో చేపట్టిన ఇండియా ఏఐ మిషన్, రూ.6 వేల కోట్లతో చేపట్టిన నేషనల్ క్వాంటమ్ మిషన్ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాల గురించి వివరించారు. కృత్రిమ మేధ ఆధారిత, శుభ్రమైన, సమర్థవంతమైన అన్వేషణ పద్ధతుల ద్వారా లిథియం, కోబాల్ట్ వంటి కీలక ఖనిజాల దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడాన్ని బట్టి భారత ఆర్థిక భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు.

ప్రభుత్వం, విద్యాసంస్థలు , పరిశ్రమల మధ్య బలమైన భాగస్వామ్యాల కోసం సహకారం, సుస్థిరతతో పాటు నూతన ఆవిష్కరణల ఆవశ్యకతను స్పష్టం చేశారు. ఇందుకోసం మినరల్ ఎక్స్ ప్లోరేషన్ హ్యాకథాన్ ను ఒక విజయవంతమైన నమూనాగా ఉదహరించారు. అలాగే స్థానిక సముదాయాలకు లాభదాయకంగా ఉండేలా, పర్యావరణాన్ని పరిరక్షించేలా బాధ్యతాయుతమైన గనుల తవ్వకం విధానాల ప్రాముఖ్యతను స్పష్టం చేశారు.

జియో సైన్సు మార్పు దశలోకి ప్రవేశం: ఎంపీ ఈటెల

జియోసైన్స్ ఒక మార్పు దశలోకి ప్రవేశిస్తోంది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో కలిసి వనరుల అన్వేషణలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి, భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న వికసిత భారత్ నిర్మాణానికి దోహదం చేస్తాయన్నారు. ఖనిజ భద్రత, పర్యావరణ సుస్థిరత, ప్రకృతి వైపరీత్యాల సన్నద్ధతకు సంబంధించిన సవాళ్లను పరిష్కరించడంలో జియోసైంటిఫిక్ పరిశోధన కీలక పాత్రను వివరించారు. భూ ప్రమాదాల అంచనాలు, ఖనిజ అన్వేషణలో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కృత్రిమ మేధను, మెషీన్ లెర్నింగ్ ను వినియోగం ఎంతో ఉందని , డేటా ఆధారిత అన్వేషణ, సుస్థిర వనరుల నిర్వహణలో భారత్ ప్రపంచ అగ్రగామి కాగలదనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

ఈ సదస్సులో భారత్ తో పాటు ఆస్ట్రేలియా, కెనడా, రష్యా, అమెరికా, పోలాండ్, మలేషియా, సింగపూర్ దేశాలకు చెందిన ప్రముఖ జియో సైంటిస్టులు, పరిశోధకులు, పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొన్నారు. జీఎస్ఐటీఐ మిషన్-5 (ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్) డిప్యూటీ డైరెక్టర్ జనరల్​ఎస్.రవి, అసిత్ సాహా, ఎస్.డి.పట్భాజే, సీనియర్ అధికారులు హాజరయ్యారు.

Next Story