దేవుడి సొమ్ము లూటీ! ‘రశీదు పుస్తకం’తో టికెట్ల దందా

by Kema Shiva Kumar |

రాష్ట్రంలోని మెజార్టీ ఆలయాలకు వచ్చే రోజువారి ఆదాయం పక్కదారి పడుతోంది.

దేవుడి సొమ్ము లూటీ! ‘రశీదు పుస్తకం’తో టికెట్ల దందా
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని మెజార్టీ ఆలయాలకు వచ్చే రోజువారి ఆదాయం పక్కదారి పడుతోంది. ఏటా రూ. కోట్లాది సొమ్మును అధికారులు, టెంపుల్ చైర్మన్లు కుమ్మక్కై స్వాహా చేస్తున్నారు. దర్శనం, కల్యాణం, వ్రతాలు, ఇలా పలు రకాల సేవల కోసం నిర్ణీత ఫీజు వసూలు చేసి జేబులో వేసుకుంటున్నారు.

కల్పతరువుగా రశీదు పుస్తకం

రాష్ట్ర వ్యాప్తింగా 704 టెంపుల్స్ ఎండోమెంట్ శాఖ పరిధిలో ఉన్నాయి. యాదాద్రి, భద్రాద్రి, వేములవాడ, బాసర లాంటి ఆలయాలు మినహాయించి, మెజార్టీ టెంపుల్స్‌లో పలు సేవల కోసం రశీదు పుస్తకం ద్వారా టికెట్లు జారీ చేస్తున్నారు. ఆ రశీదు పుస్తకమే ఆలయ అధికారుల అక్రమాలకు కల్పతరువుగా మారింది. టెంపుల్స్‌లో ప్రత్యేక పూజో, లేక అభిషేకమో చేయించుకునేందుకు భక్తుల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు తీసుకుని రశీదు ఇస్తుంటారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లో ఆలయ అధికారులు దొంగ రశీదు పుస్తకాలు తయారు చేసి.. వారికి టోపీ పెడుతున్నారు. ఆడిటింగ్‌ సమయంలో కౌంటర్ రశీదులను మాత్రమే సమర్పిస్తున్నారు.

ఏటా రూ. కోట్ల దోపిడీ

ఆలయ అధికారులు, టెంపుల్ చైర్మన్లు, ఆడిటింగ్ చేసే రాష్ట్రస్థాయి ఆఫీసర్లు, గుళ్లలో పూజారులు కుమ్మక్కై అక్రమాలకు తెరలేపుతున్నారు. నకిలీ రశీదు పుస్తకాల ద్వారా ఏటా రూ. కోట్లాది డబ్బు పక్కదారి పడుతుంది. ఇలాంటి అక్రమాలపై ఎండోమెంట్ మినిస్టర్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. అక్రమాల వెనుక ఎవరి ప్రమేయం ఉంది? ఏటా ఎంత సొమ్మును కాజేస్తున్నారు? అనే డిటేయిల్స్‌ను తెప్పించుకున్నట్టు సమాచారం. భక్తుల విశ్వాసాన్ని సొమ్ము చేసుకుంటున్న ఆఫీసర్లపై వేటు వేయడంతోపాటు అక్రమాలకు చెక్ పెట్టేందుకు మంత్రి కొండా సురేఖ ప్లాన్ చేస్తున్నారు.

ఎలక్ట్రానిక్ టికెట్లతో అక్రమాలకు చెక్

రశీదు పుస్తకాలకు బదులు ఎలక్ర్టానిక్ మిషన్ల ద్వారా టికెట్లు జారీ చేస్తే అక్రమాలకు చెక్ పడుతుందని మంత్రి సురేఖ భావిస్తున్నారు. అన్ని రకాల సేవల కోసం మాన్యువల్ టికెట్స్ కాకుండా ఎలక్ర్టానిక్ మిషన్ల ద్వారా టికెట్లు జారీచేస్తే ఆలయాల్లో పారదర్శకత నెలకొంటుందనే అభిప్రాయంలో ఎండోమెంట్ అధికారులు ఉన్నారు. ఏ రోజు ఏ రకమైన సేవకు ..ఎన్ని టికెట్లు జారీ చేశారో ఈజీగా గుర్తించవచ్చు. అయితే ఒక్కో ఎలక్ట్రానిక్ టికెట్ మిషన్‌కు ఎంత ఖర్చు అవుతుంది? అందుకు ఎన్ని నిధులు అవసరం? తదితర అంశాలపై మంత్రి ఆరా తీస్తున్నారు.

Next Story