మృత్యుపాశాలుగా రహదారులు: మూడేళ్లలో లక్ష మంది దుర్మరణం

by Kema Shiva Kumar |

భారతదేశంలో రహదారి భద్రత గాలిలో దీపంగా మారింది. కేంద్ర గణాంకాల ప్రకారం ప్రతి గంటకు నలుగురు పాదచారులు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు.

మృత్యుపాశాలుగా రహదారులు: మూడేళ్లలో లక్ష మంది దుర్మరణం
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశవ్యాప్తంగా రహదారులు మృత్యుపాశాలుగా మారుతున్నాయి. వాహనాల వేగం ముందు పాదచారుల ప్రాణాలు గాలిలో దీపాలు అవుతున్నాయి. రహదారి భద్రతపై పాలకులు ఎన్ని గంభీరమైన ప్రకటనలు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అత్యంత దారుణంగా ఉంది. దేశంలో ప్రతి 15 నిమిషాలకు ఒక పాదచారి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు వదులుతున్నారనే చేదు నిజాన్ని కేంద్ర గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. రాజ్యసభలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించిన గణాంకాలు పాదచారుల భద్రత దుస్థితికి అద్దం పడుతున్నాయి.

గంటకు నాలుగు మరణాలు..

దేశవ్యాప్తంగా సగటున రోజుకు 95 నుంచి 96 మంది, ప్రతి గంటకు సగటున నలుగురు, ప్రతి 15 నిమిషాలకు ఒకరు చొప్పున పాదచారులు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. రోడ్డు దాటుతుంటే వాహనం ఢీకొని వ్యక్తి మృతి.. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న వారిపైకి కారు దూసుకెళ్లి మృతి.. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీకొని మృత్యువాత... ఇలాంటి వార్తలు తరచూ పత్రికల్లో కనిపిస్తుంటాయి. ఏటికేడు ప్రమాదాల్లో చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. 2022లో 32,825 మంది పాదచారులు రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. 2023లో ఆ సంఖ్య 35,221కు చేరుకుంది. 2024లో 36,526 మంది పాదచారులు చనిపోయారని కేంద్రం వెల్లడించింది. మూడేళ్లలో 1,04,572 మంది పాదచారులు చనిపోవడం పరిస్థితి తీవ్రతను స్పష్టం చేస్తున్నది.

తెలంగాణలో రోజుకు నలుగురు..

తెలుగు రాష్ట్రాల్లోనూ పాదచారుల పరిస్థితి ఏటికేడు దిగజారుతోంది. తెలంగాణలో 2022లో 1,458 మంది పాదచారులు ప్రమాదాల్లో మరణించగా, 2023లో ఆ సంఖ్య 1,554కు చేరింది. ఇక 2024 (ప్రొవిజనల్) గణాంకాల ప్రకారం.. తెలంగాణలో 1,586 మంది మరణించారు. అంటే రాష్ట్రంలో సగటున రోజుకు నలుగురికి పైగా పాదచారులు రోడ్లపై ప్రాణాలు వదులుతున్నారు. మరణాల జాబితాలో దేశంలో తెలంగాణ 11వ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఏపీలో 2024లో 1,739 మంది పాదచారులు మృతి చెందారు. తమిళనాడులో మూడేళ్లలో అత్యధికంగా 13,716 మంది చనిపోయారు. బిహార్ పాదచారుల మరణాల్లో (10,956) రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత 9,348 మరణాలతో మహారాష్ట్ర ఉంది. అయితే అత్యల్ప మరణాలతో కొన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి. లక్షద్వీప్‌లో మూడేళ్లలో ఒక్క ప్రమాదం కూడా జరగలేదు. ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్, లడఖ్‌లో 9మంది చొప్పున మాత్రమే పాదచారుల మరణాలు సంభవించాయి.

దక్షిణాదిలో తమిళనాడు టాప్...

దక్షిణాది రాష్ట్రాలను పరిశీలిస్తే.. పాదచారుల మరణాల్లో తమిళనాడు దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. అక్కడ 2024లో ఏకంగా 4,712 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలో 2,752 మంది మరణించగా, కేరళలో ఈ సంఖ్య 1,228గా ఉంది. ఉత్తరాది రాష్ట్రాల్లో ముఖ్యంగా బిహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. 2024లో ఒక్క బిహార్‌లోనే 4,149 మంది పాదచారులు మరణించారు. ఉత్తరప్రదేశ్‌లో ఈ సంఖ్య 3,253గా నమోదైంది. జనాభా సాంద్రత ఎక్కువగా ఉండటం, జాతీయ రహదారుల వెంబడి సరైన క్రాసింగ్ సౌకర్యాలు లేకపోవడం వల్ల ఇక్కడ పాదచారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లో కూడా 2024లో 2,514 మంది మృతి చెందారు.

కాగితాలపైనే భద్రత..

పాదచారుల భద్రత కోసం జాతీయ రహదారులపై ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు కేంద్రం తెలిపింది. ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్సీ) మార్గదర్శకాల ప్రకారం.. ఫుట్‌పాత్‌లు, అండర్‌పాస్‌లు, ఫుట్ఓవర్ బ్రిడ్జీల నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నది. అలాగే ప్రమాదాలను తగ్గించేందుకు రంబుల్ స్ట్రిప్స్, స్పీడ్ బ్రేకర్లు, జాతీయ రహదారుల వెంబడి తగిన లైటింగ్ సౌకర్యాలను కల్పిస్తున్నట్లు కేంద్రం చెబుతోంది. రోడ్డు సేఫ్టీ ఆడిట్ ద్వారా లోపాలను గుర్తించి సరిదిద్దుతున్నామని పేర్కొంటోంది. కానీ, పెరుగుతున్న మరణాల సంఖ్యను చూస్తుంటే ఈ చర్యలన్నీ నామమాత్రంగా సాగుతున్నాయని స్పష్టమవుతోంది. ఈ క్రమంలోనే పాదచారుల ప్రాణాలకు విలువ లేని రహదారి మౌలిక సదుపాయాలు ఎవరి కోసం అనే ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

Next Story