భారీ వర్షాలతో దెబ్బతిన్న రహదారులు.. ఏకంగా రూ.1,250 కోట్ల నష్టం

by Kema Shiva Kumar |

ఇటీవల కురిసిన భారీ వర్షాలు రోడ్లు, భవనాల శాఖకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి.

భారీ వర్షాలతో దెబ్బతిన్న రహదారులు.. ఏకంగా రూ.1,250 కోట్ల నష్టం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇటీవల కురిసిన భారీ వర్షాలు రోడ్లు, భవనాల శాఖకు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 960 కిలో మీటర్ల మేర రోడ్లు దెబ్బతిని రూ.1,250 కోట్ల మేరకు నష్టం జరిగిందని ఆ డిపార్ట్‌మెంట్ ఆఫీసర్లు అంచనా వేశారు. ఇప్పటికే దెబ్బతిన్న ప్రాంతాలను గుర్తించారు. వాటికి తాత్కాలిక, శాశ్వత మరమ్మతులు చేపట్టేందుకు నివేదికలు రూపొందించారు. వర్షాలు పూర్తిగా తగ్గిన తర్వాత శాశ్వత మరమ్మతులు చేయాలని నిర్ణయించారు.

960 కి.మీ మేర దెబ్బతిన్న రహదారులు

రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల పది రోజుల పాటు భారీ వర్షాలు కురిశాయి. వరదలకు రాష్ట్ర, జాతీయ రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలు చోట్ల కల్వర్టులు శిథిలావస్థకు చేరాయి. బ్రిడ్జిల దగ్గర రోడ్లు కోతకు గురై ప్రమాదకరంగా మారాయి. సుమారు 788 ప్రాంతాల్లో రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జిలకు భారీ నష్టం వాటిల్లింది. సుమారు 960 కిలోమీటర్ల మేర రహదారులు దెబ్బతిన్నాయి. ఇందులో కొన్ని పాక్షికంగా, మరి కొన్ని శాశ్వతంగా దెబ్బతిన్నాయి. వీటిని పునరుద్ధరించేందుకు రోడ్లు, భవనాల శాఖ ఇంజినీరింగ్ అధికారులు నివేదికలు రూపొందించారు. ఎక్కడెక్కడ రహదారులు దెబ్బతిన్నాయి? ఎన్ని కల్వర్టులు కూలాయి? ఎన్ని చోట్ల సిమెంట్ పనులు కొట్టుకు పోయాయి?.. బ్రిడ్జిలకు ఏ మేరకు నష్టం వాటిల్లిందో అంచనా వేశారు.

పలుచోట్ల పెద్ద పెద్ద గుంతలు

నిజామాబాద్, ఖమ్మం, కామారెడ్డి, ఆదిలాబాద్, సూర్యాపేట, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్ జిల్లాలో అత్యధికంగా రోడ్లు దెబ్బతిన్నాయి. ఇతర జిల్లాలోనూ దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల రోడ్లపై మీటర్ వరకు గుంతలు ఏర్పడ్డాయి. స్టేట్ వైడ్ సుమారు 13 వేల మీటర్ల మేర రోడ్లకు పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయని అధికారులు తెలిపారు. వీటిని పునరుద్ధరించేందుకు ఆ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.. సంబంధిత ఆఫీసర్లతో సమావేశమై సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు.

పనుల పునరుద్ధరణకు రూ.1,250 కోట్లతో అంచనాలు

రోడ్లపై ఏర్పడిన గుంతలు పూడ్చేందుకు, కూలిపోయిన కల్వర్టులను నిర్మించేందుకు, ఆనవాళ్లు లేకుండా కొట్టుకుపోయిన రోడ్లకు బీటీ వేసేందుకు, బ్రిడ్జిలకు మరమ్మతులు చేపట్టేందుకు దాదాపు రూ.1,250 కోట్లు అవసరం ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. రెండు, మూడు రోజుల్లో నిధుల అంచనాలతో కూడిన నివేదికను మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి అందజేయనున్నారు. ఎమర్జెన్సీ కింద మంజూరైన నిధులను ప్రస్తుతం ఉపయోగించుకోవాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. అయినా తాత్కాలిక మరమ్మతులు చేపట్టేందుకు గుత్తేదారులెవరూ ముందుకు రావడం లేదు. చాలా చోట్ల పెండింగ్ బిల్లులు ఇవ్వాల్సి ఉన్నందున సదరు కాంట్రాక్టర్లు ఈ వర్క్స్ చేసేందుకు ససేమిరా అంటున్నారు.

Next Story