ఆర్టీసీ బస్సుల ఫిట్ నెస్ తనిఖీ చేయాలి : రోడ్డు భద్రత కమిటీ చైర్మన్ సప్రే

by Ramesh Naini |

ఆర్టీసీ బస్సులు ఫిట్ నెస్ మరొక సారి తనిఖీ చేయాలని సుప్రీంకోర్టు రోడ్డు భద్రత కమిటీ చైర్మన్ అభయ్ మనోహర్ సప్రే రవాణా శాఖ అధికారులను ఆదేశించారు.

ఆర్టీసీ బస్సుల ఫిట్ నెస్ తనిఖీ చేయాలి : రోడ్డు భద్రత కమిటీ చైర్మన్ సప్రే
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టీసీ బస్సులు (RTC buses) ఫిట్ నెస్ మరొక సారి తనిఖీ చేయాలని సుప్రీంకోర్టు రోడ్డు భద్రత కమిటీ చైర్మన్ అభయ్ మనోహర్ సప్రే రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర బస్సులు, కమర్షియల్ వాహనాలను తనిఖీ చేసి ఫిట్నెస్ లేని వాహనాలు సీజ్ చేయాలన్నారు. చేవెళ్ల రోడ్డు ప్రమాద ఘటనపై సుప్రీంకోర్టు రోడ్డు భద్రత కమిటీ గురువారం హైదరాబాద్ హోటల్ తాజ్ కృష్ణాలో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష జరిపింది. చేవెళ్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్న పరిస్థితులపై కమిటీ సంబంధిత అధికారులను కారణాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా.. ప్రతి వాహనం ఇన్సూరెన్స్ పర్మిట్ ఫిట్నెస్ కలిగి ఉండేలా చర్యలు తీసుకోవాలని రవాణాశాఖ అధికారులను చైర్మన్ అభయ్ మనోహర్ సప్రే ఆదేశించారు.

జాతీయ రహదారి విస్తరణ పనులను తొందరగా చేపట్టిన పూర్తి చేయాలని ఎన్‌హెచ్ఏఐ అధికారులకు ఆదేశాలిచ్చారు. మైనింగ్ క్వారీ నుండి పరిమితికి మించిన లోడ్ వెళ్లకుండా చూడాలని మైనింగ్ రవాణా శాఖ అధికారులకు ఆదేశించారు. రోడ్డు భద్రత నిధిని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని సూచించారు. సైబరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అవినాష్ మహంతి ప్రమాదం జరగడానికి గల కారణాలను కమిటీకి వివరించారు. ఈ సమావేశంలో సుప్రీంకోర్టు రోడ్డు భద్రత కమిటీ సభ్యులు సంజయ్ బందోపాధ్యాయ, రవాణా కమిషనర్ ఇలంబరితి, అడిషనల్ డీజీ మహేష్ భగవత్, సైబరాబాద్ సిపి అవినాష్ మహంతి, మైనింగ్ డైరెక్టర్ భవేశ్ మిశ్రా ఆర్టీసీ అధికారులు, ఎన్‌హెచ్ఏఐ అధికారులు పాల్గొన్నారు.

Next Story