- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ పనులు మొదలు పెట్టబోతున్నాం.. మంత్రి ఉత్తమ్ ప్రకటన
అర్ధంతరంగా నిలిచిపోయిన ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్ట్ పనుల పునరుద్ధరణకు కార్యాచరణను సిద్ధం చేసినట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: అర్ధంతరంగా నిలిచిపోయిన ఎస్ఎల్‌బీసీ ప్రాజెక్ట్ పనుల పునరుద్ధరణకు కార్యాచరణను సిద్ధం చేసినట్లు రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందని వెల్లడించారు. శుక్రవారం సెక్రెటేరియట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎస్ఎల్‌బీసీ పనులను పునఃప్రారంభించేందుకు ఇప్పటికే ప్రణాళికలు రూపొంచినట్లు ఆయన తెలిపారు. అందుకు అవసరమైన నిధులను సమకూర్చుకోవడంతోపాటు పాలనా పరమైన అనుమతులు పొందేందుకు త్వరలోనే సీఎం, డిప్యూటీ సీఎంలతో సమావేశం కానున్నట్లు తెలిపారు. దురదృష్టవశాత్తు జరిగిన టన్నెల్ ప్రమాదం అనంతరం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ నివేదికను, సూచనలను అనుసరించి పునరుద్ధరణ ప్రక్రియ మొదలు పెట్టబోతున్నట్లు ఆయన తెలిపారు.
ఆటంకంగా టన్నెల్ పనులు..
శ్రీశైలం దిగువ భాగం నుంచి వచ్చే వరద కాలువ మిగిలిన 9 కిలోమీటర్ల టన్నెల్ తవ్వకానికి ఆటంకంగా మారిందని మంత్రి ఉత్తమ్ వెల్లడించారు. అత్యంత వెనుకబడిన ప్రాంతాలకు సాగు నీరు, ఫ్లోరోసిస్ రహిత సాగు నీటిని అందించేందుకు ఈ ప్రాజెక్ట్ మరో తొమ్మిది కిలోమీటర్లు సొరంగ మార్గం పూర్తయ్యే సమయంలో జరిగిన ప్రమాదం దురదృష్టకరమన్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఆధునిక పరిజ్ఞానంతో ప్రాజెక్టు పనులను పునరుద్ధరించి పూర్తి చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పమన్నారు. అందులో భాగంగా నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్(ఎన్‌జీఆర్ఐ) ఆధ్వర్యంలో హెలికాప్టర్ ద్వారా ఎలక్ట్రోమాగ్నటిక్ సర్వే నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. పర్వత భూ భాగంలో ఉన్నందున హెలికాప్టర్ సర్వే తప్పని సరైందన్నారు. ప్రాజెక్టు పునరుద్ధరణ పనుల ప్రారంభానికి ఈ సర్వే దోహద పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ)ని కూడా ఈ పనుల్లో భాగస్వామ్యం చేస్తామన్నారు. పునరుద్ధరణ పనులు ప్రణాళికాబద్ధంగా నిర్వహించేందుకు లాడార్ సర్వేను సైతం నిర్వహించబోతునట్లు స్పష్టం చేశారు. అదే సమయంలో రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం పొందిన అంచనా వ్యయాన్ని మించనీయకుండా నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
మూడు దశాబ్దాల తరువాత పదోన్నతులు
మూడు దశాబ్దాల సుదీర్ఘ విరామం అనంతరం నీటిపారుదల శాఖలో పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేశామని ఉత్తమ్ స్పష్టం చేశారు. అదీ కూడా పారదర్శకంగా నిర్వహించామని, ఏఈఈల నుండి సీఈల వరకు 47 మంది అసిస్టెంట్ ఇంజినీర్ల నుండి డిప్యూటీ ఇంజినీర్ల వరకు 127 మంది, ఎస్ఈల నుండి సీఈల వరకు 13 మంది ఉన్నారన్నారు. అన్ని విభాగాల సిబ్బందికి 33 ఏళ్ల తరువాత స్కేల్‌తోపాటు పదోన్నతులను క్రమబద్ధీకరించామన్నారు. ఇందుకు ప్రతిభ, సీనియారిటీలను ప్రాతిపదికను తీసుకున్నామన్నారు. ఇక నుండి నీటిపారుదల శాఖ సిబ్బంది తమ బాధ్యతలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించాలని ఉద్బోధించారు. పెండింగులో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టులను పూర్తి చేసే పనులలో నిమగ్నం కావాలని సిబ్బందిని ఆయన ఆదేశించారు.
సింగూర్ డ్యామ్‌కు కట్టుదిట్టమైన చర్యలు
సింగూర్ డ్యామ్‌ను పరిశీలించి అత్యవసర భద్రతా చర్యలు చేపట్టాలని ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడంలో ఉపేక్షిస్తే సహించేది లేదన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డ్యామ్‌లు, రిజర్వాయర్లతోపాటు ఇతర జలాశయాలను నిత్యం పర్యవేక్షించాలని సూచించారు. సమ్మక్క బ్యారేజ్‌తోపాటు ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుల బ్యాక్ వాటర్‌తో ఛత్తీస్‌గఢ్‌పై చూపే ప్రభావాలపై ఐఐటీ ఖరగ్‌పూర్ జరిపిన అధ్యయనం నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి చేరిందని తెలిపారు. ఈ బ్యారేజ్ నిర్మాణంతో ఛత్తీస్‌గఢ్‌లో సుమారు 40 హెక్టార్లు ముంపునకు గురవుతున్నదని ఐఐటీ ఖరగ్‌పూర్ ఇచ్చిన నివేదికలో పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. దీని ప్రభావం ఛత్తీస్‌గఢ్‌లోని కోటూర్, తార్లగూడ, గంగారాం, కంబల్‌పేటలలో 10.9 చ.కి.మీ భూభాగం ముంపునకు గురవుతుందని అధ్యయనంలో తేలిందన్నారు. అదే సమయంలో ఈ బ్యారేజ్‌ని పూర్తి చేసేందుకు ఛత్తీస్‌గఢ్‌తో సంప్రదించి అవసరమైన అనుమతులు తీసుకుంటామన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 16.40 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. 2017లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ నిర్మాణం 2022లో పూర్తికావల్సి ఉండగా వివిధ కారణాలతో జాప్యం జరిగిందన్నారు. అన్ని సంప్రదింపులు జరిపి త్వరితగతిన పూర్తిచేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సన్నద్ధంగా ఉందని మంత్రి స్పష్టం చేశారు.






