రోడ్డు వేయండి మహాప్రభో.. శంకుస్థాపనలకే పనులు పరిమితం

by Bhanu |

గంగాధర మండల పరిధిలోని చెర్లపల్లి (ఆర్) గ్రామ ప్రజలు రహదారి లేక తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రోడ్డు వేయండి మహాప్రభో.. శంకుస్థాపనలకే పనులు పరిమితం
X

దిశ, గంగాధర: గంగాధర మండల పరిధిలోని చెర్లపల్లి (ఆర్) గ్రామ ప్రజలు రహదారి లేక తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నో ఏళ్లుగా మట్టి రహదారిపైనే జీవితం గడుపుతున్న వారు అభివృద్ధిని ఎప్పటికైనా చూడాలనుకుంటున్నారు. ‘మా ఊరికి రోడ్డు వేయండి మహాప్రభో!’ అంటూ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు గ్రామస్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రతి వర్షాకాలం మొదలైతే చెర్లపల్లి (ఆర్) గ్రామ రహదారి నరకప్రాయంగా మారుతోంది. అడుగడుగునా గుంతలు, దారులన్నీ కరకటాలుగా మారిపోవడం వల్ల ప్రయాణం అసాధ్యంగా మారుతోంది. కుర్మపల్లి-చెర్లపల్లి మధ్య ఉన్న పెద్ద ఒర్రెపై ఉన్న చిన్న వంతెన పూర్తిగా ధ్వంసం కావడంతో వర్షాకాలంలో పొలాల నీరు రోడ్డుపైకి చేరి రాకపోకలు నిలిచిపోతున్నాయి. స్కూల్ బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలపై ప్రయాణించడం ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మాటిచ్చినా అమలు శూన్యం

చొప్పదండి నియోజకవర్గానికి చెందిన గత ఎమ్మెల్యే సాన మారుతి, ప్రస్తుత ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇద్దరూ ఎన్నికల సమయంలో చెర్లపల్లి గ్రామానికి రోడ్డు వేస్తామంటూ హామీ ఇచ్చినా, గెలిచిన తరువాత ఒక్కసారి కూడా గ్రామాన్ని చూడలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఓట్లు వేసుకున్నాక మమ్మల్ని మరిచిపోతారా? అంటూ మండిపడుతున్నారు.

శిలాఫలకాలకే పనులు పరిమితం

2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ర్యాలపల్లి పంచాయతీ పరిధిలోని కుర్మపల్లి – చెర్లపల్లి – మల్యాల మండలం బల్వంతాపూర్, చెర్లపల్లి (ఆర్) – కొడిమ్యాల మండలం నర్సింహులపల్లి వరకు సెంట్రల్ రోడ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఆర్ఆర్​) నిధుల కింద రూ.2 కోట్లు మంజూరయ్యాయి. అప్పటి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ శంకుస్థాపన చేసినా, పనులు శిలాఫలకానికే పరిమితమయ్యాయి.

ఇప్పటికైనా స్పందించాలి

విద్యార్థులు పాఠశాలకు వెళ్లే మార్గం లేక ఇబ్బందులు పడుతున్నారు. పెద్దలూ, వృద్ధులు అత్యవసర సేవలకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతోంది. కనీసం ఇప్పటికైనా ప్రస్తుత ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్పందించి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. “రహదారి లేదంటే అభివృద్ధి ఊహించలేం... మాకు బీటీ రోడ్డు కావాలి,” అంటూ ప్రభుత్వాన్ని ప్రజా ప్రతినిధులను వేడుకుంటున్నారు.

పట్టించుకున్న వారే లేరు

మా ఊరుకు వచ్చే రోడ్డు నా చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉంది.దేశం అభివృద్ధి చెందిందని చెబుతారు. కానీ మాఊరు మాత్రం అదే మట్టి రహదారిపై ముందుకెళ్తోంది . ఎన్నికల సమయంలోనే నాయకులు తమ గ్రామానికి వస్తారు. ఓట్ల కోసం ముచ్చట్లాడి మూడునెలల్లోపు డాంబర్ రోడ్డు వేస్తామని హామీ ఇచ్చి ఓట్లు పొందిన తరువాత మొహం చూపకుండా వెళ్లిపోతున్నారు. ఇప్పటికైనా ప్రస్తుత ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్పందించి, మా గ్రామానికి రహదారి వేయించాలని కోరుతున్నాం.

వేల్పుల రాములు చెర్లపల్లి (ఆర్) గ్రామస్తుడు

హామీలను నిలబెట్టుకోవాలి

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంపై చెర్లపల్లి (ఆర్) గ్రామ ప్రజలు నమ్మకం పెట్టుకున్నప్పటికీ ఆయన ఇచ్చిన హామీ ఇప్పటివరకు అమలులోకి రాకపోవడం పట్ల స్థానికులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మాఊరికి వచ్చినప్పుడు మా ప్రధాన సమస్య రోడ్డు అని ఎమ్మెల్యే సత్యం సారుకు వివరించాము. ఆయన గెలిస్తే మూడు నెలల్లో బీటీ రోడ్డు వేయిస్తానని మాటిచ్చారు. కానీ గెలిచిన అనంతరం ఇచ్చిన హామీని మరచిపోయారు.ఇప్పటికైనా మా గ్రామానికి బీటీ రోడ్డు నిర్మించి, మాట నిలబెట్టుకుంటారని మేము ఆశిస్తున్నాం.

చర్లపల్లి (ఆర్) గ్రామస్తుడు నేరళ్ల ఐలయ్య

Next Story