గ్లోబల్ సమ్మిట్‌లో తెలంగాణ పోలీస్.. ఫోరెన్సిక్స్ యుగానికి దారితీసే విప్లవాత్మక రోడ్‌మ్యాప్

by Ramesh Naini |

రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికలో కీలకం కానున్న 'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ 2047లో రాష్ట్ర పోలీస్ శాఖ చేపడుతున్న కార్యక్రమాలను ప్రదర్శించేందుకు సన్నాహాలు చేపట్టారు.

గ్లోబల్ సమ్మిట్‌లో తెలంగాణ పోలీస్.. ఫోరెన్సిక్స్ యుగానికి దారితీసే విప్లవాత్మక రోడ్‌మ్యాప్
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర భవిష్యత్తు ప్రణాళికలో కీలకం కానున్న 'తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ 2047లో రాష్ట్ర పోలీస్ శాఖ చేపడుతున్న కార్యక్రమాలను ప్రదర్శించేందుకు సన్నాహాలు చేపట్టారు. సమ్మిట్‌లో ఫోరెన్సిక్ ఎవిడెన్స్ యాక్ట్‌‌ను ప్రతిపాదించేందుకు డీజీపీ ఆధ్వర్యంలో ఉన్నాధికారులు సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో ప్రపంచ ఫోరెన్సిక్స్ కాన్ఫరెన్స్‌ ప్రతిపాదనకు పోలీస్ శాఖ సన్నధ్దం అవుతున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలుపుతున్నారు. ఈ సమ్మిట్‌లో రాష్ట్ర పోలీసుల సాంకేతిక సామర్థ్యాలు, వినూత్న కార్యక్రమాలు, ప్రజల కేంద్రంగా పనిచేసే వ్యవస్థలను సమర్థవంతంగా ప్రదర్శించడం ద్వారా భద్రత, రక్షణపై ప్రజల్లో విశ్వాసాన్ని మరింత పటిష్టం చేయాలని అధికారులకు డీజీపీ స్పష్టం చేశారు.

సైబర్‌, ఫోరెన్సిక్ సామర్థ్యాలలో అంతర్జాతీయ స్థాయికి రోడ్ మ్యాప్

సైబర్‌, ఫోరెన్సిక్‌‌ విభాగాలలో రాష్ట్ర ప్రభుత్వ సామర్థ్యాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి రూపొందించిన రోడ్‌మ్యాప్‌ను వివరించనున్నారు. ఆర్థిక సైబర్ క్రైమ్ ఫిర్యాదుల కోసం పూర్తిగా ఏఐ-ఆధారిత 'డయల్ 1930' వ్యవస్థను అమలు చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా సైబర్ ఫోరెన్సిక్ హబ్‌లను విస్తరించడం ముఖ్య లక్ష్యాలుగా పేర్కొన్నారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, టెలికాం ఆపరేటర్లను అనుసంధానిస్తూ 'సైబర్ కమాండ్ అండ్ ఫ్యూజన్ గ్రిప్' ప్లాట్‌ఫారమ్‌ను సృష్టించడం, పిల్లల రక్షణ యూనిట్‌ను, రియల్ టైమ్‌లో మోసాలను గుర్తించే అటానమస్ ఫ్రాడ్ హంటింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయడం వంటివి ప్రతిపాదించారు. వీటితో తెలంగాణలో ప్రపంచ ఫోరెన్సిక్స్ కాన్ఫరెన్స్‌ను నిర్వహించాలనే ప్రతిపాదనను ప్రవేశ పెట్టేందుకు సన్నాహాలు చేపట్టారు.

ఈగల్ ఫోర్స్ డైరెక్టర్‌, ఫ్యూచరిస్టిక్‌ పోలీసింగ్ కార్యక్రమాలను తెలియజేస్తూ, లాగరిథమ్స్, ఆల్గోరిథమ్స్, రోబోటిక్స్, ఏఐ-ఆధారిత వ్యవస్థలపై దృష్టి సారించే ప్రత్యేక 'పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్' యూనిట్లు, 'పోలీస్ రోబోటిక్స్ ఆర్గనైజేషన్‌'ను స్థాపనపై వివరించనున్నారు. 'డయల్ 112' సేవలపై, డార్క్‌-వెబ్, క్రిప్టో కార్యకలాపాలను పర్యవేక్షణపై డెమో ఇవ్వనున్నారు. పోలీస్ అకాడమీలో మినీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పాటు చేయడంపై వివరణ ఇవ్వనున్నారు. జస్టిస్ ఇండియా రిపోర్ట్ లో తెలంగాణ పోలీస్ మొదటి స్థానంలో నిలిచిన అంశాలను వివరించనున్నారు. సైబర్ క్రైమ్ లో రిఫండ్‌లో దేశంలో అత్యుత్తమ ఘనాంకాలు నమోదు చేసిన అంశాలను ప్రదర్శించనున్నారు. సీఐఈఆర్ పోర్టల్ ద్వారా 1లక్ష మొబైల్ ఫోన్‌లు రికవరీ చేసిన రాష్ట్రంగా నిలిచిన అంశాలను వివరించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

పోలీస్ వ్యవస్థదే కీలక పాత్ర

తెలంగాణ రాష్ట్రం 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యాన్ని చేరుకోవడంలో పోలీస్ వ్యవస్థదే కీలక పాత్ర అని రాష్ట్ర పోలీస్ శాఖ అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. శాంతిభద్రతల పరిరక్షణ ద్వారానే దేశీయ, విదేశీ పెట్టుబడులకు భద్రతా భావం కలిగి, పరిశ్రమలు, ఐటీ రంగం వంటి కీలక రంగాలు వృద్ధి చెందుతాయని పేర్కొంది. నేటి డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలను అరికట్టడం, మౌలిక సదుపాయాల భద్రతను పర్యవేక్షించడం పోలీసుల ప్రధాన బాధ్యతగా ఉంటుందని పేర్కొంది. మైత్రీ పూర్వక పోలీసింగ్' విధానాన్ని అమలు చేయడం ద్వారా ప్రజల సహకారాన్ని పెంచుకుని, భవిష్యత్ కార్యాచరణకు పటిష్టమైన పునాది వేయడంలో పోలీస్ శాఖ కీలకంగా వ్యవహరిస్తుందని వెల్లడించింది.

Next Story