- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రవాణా శాఖలో విప్లవాత్మక మార్పులు.. రహవీర్ తొలి అవార్డును అందచేసిన మంత్రి పొన్నం
ప్రజా పాలన ప్రభుత్వంలో రవాణా శాఖను బలోపేతం చేస్తూ, వాహనదారులకు పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రజా పాలన ప్రభుత్వంలో రవాణా శాఖను బలోపేతం చేస్తూ, వాహనదారులకు పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో రవాణా శాఖ అధికారులతో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. శాఖాపరమైన ఆదాయాన్ని పెంచడంతో పాటు ప్రజలకు ఎక్కడా ఇబ్బందులు కలగకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ను కఠినతరం చేయాలని ఆదేశించారు. రవాణా శాఖలో ప్రవేశపెట్టిన 'సారథి' వ్యవస్థ కేవలం 8 నెలల్లోనే దేశంలోనే తెలంగాణను ప్రథమ స్థానంలో నిలబెట్టడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ. 6,910.90 కోట్ల ఆదాయం సమకూరగా, 2025-26లో అది రూ. 7,097.38 కోట్లకు చేరిందని మంత్రి వెల్లడించారు. ఈవీ పాలసీ వల్ల కొంత మేర ఆదాయం తగ్గినప్పటికీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ బలోపేతం ద్వారా ఆ లోటును భర్తీ చేయాలని సూచించారు. లక్ష్యాలను చేరుకున్న అధికారులను అభినందించిన మంత్రి, పనితీరు మెరుగుపరుచుకోని అధికారులను తీవ్రంగా హెచ్చరించారు. ముఖ్యంగా సరిహద్దు జిల్లాలైన నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ అధికారులు ఇతర రాష్ట్రాల వాహనాల పన్ను చెల్లింపుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ ప్రారంభం
రాష్ట్రంలో 37 ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్లు మంజూరయ్యాయని, జూన్ 1వ తేదీ నాటికి తొలి స్టేషన్‌ను ప్రారంభించేలా పనులు వేగవంతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వాహన్ పోర్టల్ డేటాను పూర్తి చేసి సాంకేతిక సమస్యలు లేకుండా చూడాలని, ఆర్టీవో కార్యాలయాల్లో పెండింగ్ లైసెన్సులు, ఆర్సీ కార్డుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని స్పష్టం చేశారు. ఏఎంవీఐలకు ఇచ్చిన తరహాలోనే ఇతర అధికారులకు కూడా విడతల వారీగా శిక్షణ ఇవ్వాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు ఈ నెల 13 నుంచి 18 వరకు నిర్వహించనున్న అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని పోలీస్, రవాణా శాఖల సమన్వయంతో విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 15 నుంచి 18వ తేదీ మధ్య ఉమ్మడి జిల్లాల వారీగా స్వయంగా తను, ఆర్టీసీ ఎండీ, డీజీపీ కలిసి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటామని తెలిపారు. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, హెల్మెట్ లేకపోవడం వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు.
రూ. 25 వేల రహవీర్ పురస్కారం
రోడ్డు ప్రమాద బాధితులను గోల్డెన్ అవర్ లో ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడే వారికి కేంద్ర ప్రభుత్వ రహవీర్ స్కీమ్ కింద రూ. 25 వేల నగదు బహుమతి అందజేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా తొలి అవార్డును నల్గొండకు చెందిన గణపతి వెంకన్నకు రూ. 25 వేల చెక్కు రూపంలో అందజేశారు. అలాగే పీఎం రహత్ కింద ప్రమాద బాధితులకు రూ. 1.50 లక్షల వరకు ఉచిత చికిత్స అందుతుందని, దీనిపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో రవాణా శాఖ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, కమిషనర్ ఇలాంబర్తి, జాయింట్ కమిషనర్లు చంద్రశేఖర్ గౌడ్, శివ లింగయ్య, రమేష్ సహా రాష్ట్రవ్యాప్త రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.






