- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BRS: స్థానిక ఎన్నికల వేళ బీఆర్ఎస్ లో తిరుగుబాటు కలకలం.. కేసీఆర్ సన్నిహితుడిపై తీవ్ర విమర్శలు
స్థానిక సంస్థల ఎన్నికల వేళ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేపై సొంత క్యాడర్ తిరుగుబాటు కలకలం రేపుతోంది.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల అంశం పొలిటికల్ హీట్ పెంచుతోంది. త్వరలోనే ఈ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు ఊపందుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ (BRS) లో లుకలుకలు ఆ పార్టీలో చర్చనీయాంశం అవుతున్నది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసు, ఫార్ములా ఈ కార్ రేసు కేసు, కాళేశ్వరం కమిషన్ విచారణతో సతమతం అవుతున్న గులాబీ పార్టీలో పార్టీ ఇన్ చార్జీలపై స్థానిక నేతల తిరుగుబాటు సంచలనం రేపుతోంది. తాజాగా ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై (Armour Jeevan Reddy) సొంత నేతలు తీవ్రఆరోపణలు గుప్పిస్తున్నారు. కేసీఆర్ (KCR) సీఎంగా ఉన్న సమయంలో జీవన్ రెడ్డి చేయని అరాచకం లేదని, బెదిరింపులు, భకబ్జాలు, అక్రమ కేసులు బనాయించారని సొంత పార్టీ నేతలను సైతం ఇబ్బందులకు గురి చేశారని ఆరోపించారు. జీవన్ రెడ్డిని పార్టీ ఇన్ చార్జీ బాధ్యతల నుంచి తప్పించాలని లేకుంటే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి ఓటమితప్పదని హెచ్చరించారు. కేసీఆర్ ఫ్యామిలికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న జీవన్ రెడ్డిపై ఇప్పుడు సొంత పార్టీలో తిరుగుబాటు రావడం గులాబీ పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల (local body elections) వేళ ఈ పరిణామం ఎలాంటి పరిస్థితులకు దారి తీయబోతున్నదనేది ఆసక్తి రేపుతోంది.
కవిత ఎపిసోడ్ తో క్యాడర్ కన్ఫ్యూజన్:
జీవన్ రెడ్డి పై తిరుగుబాటు ఇలా ఉంటే మిగతా చోట్ల కూడా బీఆర్ఎస్ లో అంతర్గత లుకలుకలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో పదవులు అనుభవించిన వారి వైఖరి వల్లే పార్టీ ఘోరంగా నష్టపోయిందని ఇంత జరిగినా స్థానిక నేతల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవడం వారికి ప్రయార్టీ ఇవ్వడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి నాయకులకు పార్టీలో ప్రయార్టీ ఇవ్వకుండా నిజమైన కార్యకర్తలకు అవకాశాలు, పార్టీలో భాధ్యతలు ఇవ్వాలనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇటీవల కవిత ఎపిసోడ్ తో పార్టీలో తీవ్ర అలజడి రేగింది. ఆమె పార్టీ నాయకత్వంపై చేసిన వ్యాఖ్యలు, బీఆర్ఎస్ ను కాకుండా జాగృతి పేరుతో చేస్తున్న కార్యక్రమాలతో క్యాడర్ పూర్తిగా కన్ఫ్యూజన్ లో పడిందనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా సెకండ్ ర్యాంక్ లీడర్లు బీఆర్ఎస్ తో ఉండాలా కవిత వెంట నడవాలా అనే విషయంలో ఎటు తేల్చుకోలేకపోతున్నారనే చర్చ జరుగుతోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే స్థానిక సంస్థల్లో పార్టీ దెబ్బతినడం ఖాయం అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో మాజీ ఎమ్మెల్యే తీరుపై సొంత పార్టీ నేతలు తిరుగుబాటు, తాజా పరిణామాలు గులాబీ పార్టీని మరింత టెన్షన్ పెట్టబోతున్నట్టు చర్చ జరుగుతోంది. ఈ పరిస్థితులను పార్టీ హై కమాండ్ ఎలా పరిష్కరిస్తుంది, క్యాడర్ కు ఎలాంటి సిగ్నల్స్ పంపబోతున్నది అనేది ఆసక్తిగా మారింది.






