- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెవెన్యూ అధికారుల ఇష్టారాజ్యం..! ‘నాలా’ భూములకు పాస్ బుక్కులు
రాష్ట్రంలోని సూర్యాపేట, వనపర్తి, నల్లగొండ జిల్లాల్లో రెవెన్యూ అధికారుల తీరు హాట్ టాపిక్‌గా మారింది. ‘నాలా’ కన్వర్షన్ అయిన భూములకు సైతం వ్యవసాయ పాసు బుక్కులు, వివాదాస్పద భూములకు రిజిస్ట్రేషన్లు చేయడం సంచలనంగా మారింది.

దిశ, తెలంగాణ బ్యూరో: భూ సమస్యల పరిష్కారంలో రెవెన్యూ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కొందరు వివాదాలను పరిష్కరించకుండా దాటవేత ధోరణి అవలంభిస్తుండగా.. మరికొందరేమో వివాదాలున్న భూములను సైతం రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త మార్కెట్ యార్డ్ పక్కనే సర్వే నం.71లో లావాదేవీలను పరిశీలిస్తే విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పద్దెనిమిదేండ్ల క్రితం ల్యాండ్ కన్వర్షన్ చేసిన భూములకు భూభారతిలో వ్యవసాయ భూమిగా నమోదు చేసి పాసు పుస్తకాలు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. భూమి నాలా కన్వర్షన్ అయ్యిందని.. పాసు పుస్తకాల జారీని నిలిపివేసి, అప్పటి వరకు ప్రొహిబిటెడ్ లిస్టులో నమోదు చేయాలని విన్నవించినా అధికారులు పట్టించుకోలేదు. భూ భారతి రికార్డుల్లో ఉందన్న నెపంతో రిజిస్ట్రేషన్ చేశారు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తయిన వాటికి కూడా పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేయడం గమనార్హం.
కేసు క్లోజ్ చేయకుండానే..
సూర్యాపేట సర్వే నంబర్ 71లో కోదాడి ఆండాళమ్మ, సీతారామారావు పేరిట ఉన్న 2.34 ఎకరాలను 1984లో సాదాబైనామా కింద చెన్నుపాటి లక్ష్మి కొనుగోలు చేసి 1998లో ఆర్వోఆర్ ద్వారా పట్టా పొందారు. ఆమె నుంచి 5.38 ఎకరాలను కేఆర్ఏకే ప్రసాద్ కొని పట్టాదారు పాసు పుస్తకం పొందారు. 2007 లో నాలా కన్వర్షన్ చేయించారు. 2008లో కేఆర్కే ప్రసాద్ నుంచి బొలిశెట్టి శ్రీరాములు, కొరివి వీరన్న, డి.బిక్షంనాయక్, కె.వెంకట్ రెడ్డిలు కలిసి కొనుగోలు చేశారు. జాయింట్ వెంచర్ చేసి 40 మందికి ప్లాట్లు విక్రయించారు. అయితే ఆ తర్వాత కోదాటి ఆండాళమ్మ తన భూమిని చెన్నుపాటి లక్ష్మికి విక్రయించలేదని, తన సంతకం ఫోర్జరీ చేశారంటూ ఆర్డీవోకు అప్పీల్ చేశారు. అప్పటికే నాలా కన్వర్షన్ పూర్తయిన ల్యాండ్ పై వివాదం మొదలైంది. అనేక కేసులు దాఖలయ్యాయి. ఈ క్రమంలోనే కేసు వాపస్ తీసుకుంటున్నట్లు వాంగ్మూలం ఇచ్చారు. 2011లో విత్ డ్రా చేసుకున్నట్లు మెమో కూడా ఉంది. కానీ ఆర్డీవో కేసు క్లోజ్ చేయకుండా పెండింగులో పెట్టడంతో మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఆండాళమ్మ మరణించడంతో వారసులు హైకోర్టుకు వెళ్లారు. ఇదంతా జరుగుతుండగానే వ్యవసాయ భూమిగా డిక్లేర్ చేసి భూ భారతి పోర్టల్ లో క్రయ విక్రయాలు చేస్తుండడంతో ప్లాట్లు కొనుగోలు చేసిన యజమానులు తమకు న్యాయం చేయాలంటూ సీసీఎల్ఏకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సూర్యాపేట తహశీల్దార్, ఆర్డీవో, కలెక్టర్లు చేసిన ఇల్లీగల్ వ్యవహారంపై దర్యాప్తు చేయించాలని తాజాగా వారు మొర పెట్టుకున్నారు.
ఒక్క రోజులోనే సక్సెషన్?
సూర్యాపేట సర్వే 71లో వివాదాస్పద నాలా కన్వర్షన్ చేసిన ల్యాండ్ పై తమకు పౌతీ (సక్సెషన్) చేయాలని కొందరు దరఖాస్తు చేసుకున్నారు. అయితే అదే రోజే నోటీసుల జారీ, విచారణ, పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. సక్సెషన్ చేయడానికి కనీసం 15 రోజుల సమయం తీసుకుంటారు. నోటీసులు జారీ చేసి, విచారణ జరిపి, అభ్యంతరాలు లేకుంటేనే సక్సెషన్ పూర్తి చేస్తారు. కానీ ఒక్క రోజులో ఆర్ఐ నివేదిక, తహశీల్దార్ ఆమోదం పూర్తి చేయడం వెనుక ఆంతర్యమేమిటన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ సర్వే నం.71లో ఈ ఏడాది జనవరి నుంచి నేటి వరకు పూర్తి చేసిన సక్సెషన్ కి సంబంధించిన అప్లికేషన్లు వచ్చిన తేదీ, పట్టాదారు పాసు పుస్తకాలు జారీ చేసిన తేదీలను పరిశీలిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని బాధితులు చెబుతున్నారు.
తప్పుగా నమోదు చేసి..
సూర్యాపేట జిల్లా నాగారం రెవెన్యూ సర్వే నం.518లో కొందరు అక్రమంగా పట్టా చేయించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అసలైన హక్కుదారులం తాము అంటూ ఏండ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా తమ సమస్యను పరిష్కరించడం లేదంటూ కొసనం వెంకట్ రెడ్డి అనే రైతు ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని డాక్యుమెంట్లు పరిశీలించి న్యాయం చేయాలని కోరినా, ఖాతరు చేయడం లేదని ఆరోపించారు. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం పాలెం సర్వే నం.423, 424 లోనూ ఒకరి భూమిని ఇల్లీగల్ గా మరొకరి పేరిట రాశారు. తమదే తప్పు అంటూ రెవెన్యూ అధికారులు లిఖితపూర్వకంగా రాసిచ్చారు. కానీ సరి చేసేందుకు మూడేండ్లుగా తిప్పించుకుంటున్నారు. ధరణి ఉన్నప్పుడు భూ భారతి రావాలన్నారు. భూ భారతి రాగానే రూల్స్ లేవంటూ వాళ్లే చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి హక్కుదారుడిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. ఇలాంటివి రాష్ట్ర వ్యాప్తంగా అనేకం రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా పెండింగులో ఉంచుతున్నారు.
ఒకరికి న్యాయం.. మరొకరికి అన్యాయం
నల్లగొండ జిల్లాలోని ఓ ఊరిలో సర్వే నంబరులోని 16 ఎకరాలు నోషనల్ ఖాతాలో నమోదైంది. అది ఇద్దరు అన్నదమ్ములకు సంబంధించినది. వారంతా ఏనాడో హైదరాబాద్ లో సెటిలయ్యారు. అయితే ఇందులో ఒకరు అప్లయ్ చేయగానే రిపోర్ట్ ఇచ్చి పట్టా చేశారు. వాళ్లు కొంత అమ్మేసుకున్నారు. రెండో వాళ్లు కూడా అప్లయ్ చేయగా.. రెండేండ్ల క్రితం వీళ్లది కూడా పట్టా భూమి అని రిపోర్ట్ ఇచ్చారు. అయితే ఆ ఫైల్ సీసీఎల్ఏలో ఏండ్లుగా పెండింగులో ఉంచి, ఆ తర్వాత అన్ని ఫైల్స్ తిప్పి పంపారు. ఆ తర్వాత అధికారులు ఏ కారణం చెప్పకుండా దాన్ని రిజెక్ట్ చేశారు. వాళ్లు మళ్లీ అప్లయ్ చేయగా.. ఇప్పుడేమో అది వారి భూమి కాదంటూ రిపోర్ట్ ఇచ్చారు. ఒక్కరే తహశీల్దార్ రెండు రకాల రిపోర్టులు ఇచ్చారు. ఇది చూసి అదనపు కలెక్టర్ కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ఒకే సర్వే నంబరులో రెండు రకాల రిపోర్టుల వెనుక ఆంతర్యేమిటో అర్థం కావడం లేదన్నారు.






