‘సుప్రీం’ ఆదేశాలతో కదిలిన రెవెన్యూ యంత్రాంగం.. త్వరలో నిషేధిత భూముల కొత్త లిస్టు!

by Kema Shiva Kumar |

రాష్ట్రంలో నిషేధిత భూములకు సంబంధించి కొత్త జాబితాను ప్రభుత్వం సిద్ధం చేస్తున్నది.

‘సుప్రీం’ ఆదేశాలతో కదిలిన రెవెన్యూ యంత్రాంగం.. త్వరలో నిషేధిత భూముల కొత్త లిస్టు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో నిషేధిత భూములకు సంబంధించి కొత్త జాబితాను ప్రభుత్వం సిద్ధం చేస్తున్నది. ప్రభుత్వ, అసైన్డ్, వక్ఫ్, దేవాదాయ, సీలింగ్ భూముల లెక్క తేలుస్తున్నది. వివాదాస్పద పట్టా భూములు, ఐటీ, ఏసీబీ, సీబీఐ సీజ్ చేసిన ఆస్తులను కూడా లెక్కిస్తున్నది. సుప్రీం కోర్టు ఆదేశాలతో కొంతకాలంగా తహశీల్దార్లు ఈ ప్రక్రియను స్పీడప్ చేయగా.. మరో మూడు వారాల్లో ఈ రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా సిద్ధం కానున్నట్లు తెలిసింది. త్వరలోనే ఈ లిస్టులను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయనున్నట్లు సీసీఎల్ఏ వర్గాలు తెలిపాయి. అయితే వీటిపై ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారా? ప్రతి ఊరిలోనూ ఈ లిస్టులను అందుబాటులో ఉంచుతారా? లేదా? అన్న విషయంలో క్లారిటీ లేదు. ఏడు దశాబ్దాలుగా లక్షలాది భూములు సెటిల్ అయ్యాయి. కొన్నేమో తప్పుగా నమోదయ్యాయి. ఇంకొన్నేమో అరవై ఏండ్ల నుంచి పట్టాగా కొనసాగుతున్నాయి. వాటన్నింటినీ పరిశీలించకుండా.. సేత్వార్, ఖాస్రా పహానీని ప్రామాణికంగా తీసుకొని ప్రభుత్వ భూములను గుర్తించే ప్రక్రియ చేపడితే లక్షలాది మందిపై ప్రభావం పడుతుంది. బీఆర్ఎస్ హయాంలో ధరణి అమలులోకి వచ్చాక అనేక భూ సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఐదారు దశాబ్దాలుగా పట్టాగా ఉన్న వాటిని ఖాస్రా పహానీ ప్రకారమంటూ ప్రభుత్వ భూములుగా రికార్డుల్లో చేశారు. ఇలాంటి చాలా కేసుల్లో బాధితులకు ఇప్పటికీ న్యాయం జరగలేదు. ప్రస్తుతం ఉన్న పీఓబీ జాబితాపై అనేక అనుమానాలు ఉండగా.. కొత్త నిషేధిత జాబితా ఏ రీతిన ఉంటుందోననే ఆందోళన నెలకొన్నది.

జాబితా.. తప్పుల తడక

ఎప్పుడో తయారు చేసిన ప్రొహిబిషన్ ఆర్డర్ బుక్‌నే నేటికీ పరిగణనలోకి తీసుకుంటున్నారు. రిజిస్ట్రేషన్ చట్టం-1908 సెక్షన్ 22 ఏ ప్రకారం 1999 లో జారీ చేసిన గెజిట్ నం.23 ద్వారా పేర్కొన్న ఆస్తులపై పేచీ నడుస్తున్నది. 19/2007 ప్రకారం రూపొందించిన జాబితాలోనూ చాలా తప్పులు ఉన్నాయని, పట్టాభూములను ప్రభుత్వ జాబితాలో చేర్చారన్న అనుమానాలు ఉన్నాయి. కొంత మంది అధికారులు డ్రాఫ్ట్ నోటిఫికేషన్ తోనే సరిపుచ్చి, ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేయలేదు. దాంతో తప్పులతో కూడిన జాబితాలనే వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ జాబితాలోని భూములను రిజిస్ట్రేషన్ చేయకుండా తిరస్కరిస్తున్నారు. కలెక్టర్ల నుంచి ఎన్వోసీ తీసుకురావాలని చెప్పడంతో.. బాధితులు అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 19/2007 జాబితాను సవాలు చేస్తూ అనేక రిట్ పిటిషన్లు దాఖలు కాగా, దానిపై హైకోర్టు ఆరుగురు సింగిల్ జడ్జిలు తీర్పునిచ్చారు. అందులో అనేక సూచనలు చేశారు. 1958 కంటే ముందు జరిగిన అసైన్మెంట్లను పరిగణనలోకి తీసుకొని, వాటికి పీఓటీ చట్టం వర్తించకుండా చేయాలన్నారు. వాటిని నిషేధిత జాబితాలో పేర్కొనవద్దని స్పష్టమైన తీర్పు చెప్పారు. ఈ తీర్పులో స్పష్టత లేదని డబ్ల్యూఏ నం.34319/15 కేసులోనూ ప్రభుత్వానికి హైకోర్టు పలు సూచనలు చేసింది. జాబితాను ప్రభుత్వం నోటిఫై చేస్తూ వాటిపై అభ్యంతరాలను స్వీకరించాలని, ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని చెప్పింది. పీవోబీ రూపకల్పన కోసం మెమో నం.7797/రిజిస్ట్రేషన్-ఐ-ఎ/2016-17, తేదీ.27.5.2017న మార్గదర్శకాల ప్రొఫార్మాను తయారు చేశారు. అయితే హైకోర్టు తీర్పు ప్రకారం 2015 డిసెంబరు నుంచి నాలుగు నెలల్లో రూపొందించాల్సి ఉండగా.. ఇప్పటికీ తయారు చేయలేదు. 2007 లో తయారు చేసినదే అమలు చేస్తున్నారు.

ఇప్పటికీ 2007 జాబితే ప్రామాణికం

ఇప్పటికీ 2007లో పంపిన జాబితాలనే రిజిస్ట్రేషన్ అధికారులు పరిగణనలోకి తీసుకుంటున్నారు. వాటిలో చాలా లోపాలు ఉన్నందున ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 1958 కు ముందు జారీ చేసిన అసైన్మెంట్స్ లో అలైనేషన్ చేయొద్దన్న షరతులు లేవు. అందుకే పీఓటీ (ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ ఫర్) యాక్టు నిబంధనలు వర్తించవు. ఆ భూములను నిషేధిత జాబితాలో చేర్చొద్దు. వాటిపై సమీక్షించాలి. అలాగే స్వాతంత్ర్య సమరయోధులకు, మాజీ సైనికులకు ఇచ్చిన ప్రభుత్వ భూములను పది సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చు. వాటిని కూడా నిషేధిత జాబితాలో పేర్కొన్నారు. జీఓ నం.1745, తేదీ.28.8.1959 ప్రకారం ఈ నిర్ణయాన్ని వ్యక్తీకరించారు. ప్రభుత్వ భూముల వివరాల కోసం సేత్వార్ ఆధారంగా చేసుకొని జాబితాను రూపొందించారు. కానీ ఖాస్రా పహానీ (1954-55)లో కొన్నింటికి ఖాతాదారుల పేర్లు ఉన్నాయి. ఖాస్రా పహానీకి ఉన్న చట్టబద్ధత ప్రకారం వాటిని ప్రభుత్వ భూములుగా పరిగణించొద్దు. కానీ వాటిని కూడా పీఓబీ జాబితాలో పెట్టారు. ఖాస్రా పహానీ విశిష్టత, చట్ట బద్ధత గురించి సుప్రీం కోర్టు, హైకోర్టులు పలు సార్లు చెప్పాయి. సుప్రీం కోర్టు కేసు నం.సీఎ నం.325-326/2015, తేదీ.13.1.2015 న వెలువరించిన తీర్పులో ఖాస్రా పహానీ రెవెన్యూ హక్కులకు ఆధారిత రికార్డుగా ప్రకటించింది. ఖాస్రా పహానీ ఆధారంగా నిషేధం కొనసాగించడంతో పలు ప్రాంతాల్లో వివాదాలు ఉన్నాయి. అనేక కేసులు నడుస్తున్నాయి. ప్రభుత్వం కేటాయించిన లేదా అసైన్ చేసిన భూములను అమ్ముకోవచ్చు అన్నప్పుడు రికార్డులో కూడా నేచర్ ఆఫ్ ల్యాండ్ కూడా మార్చాలి. కానీ హైకోర్టు ఆదేశించినా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయని కారణంగా అధికారులు యథాతథ స్థితిని కొనసాగిస్తున్నారు. దీని ద్వారా తెలంగాణలో సుమారు 10 లక్షల ఎకరాల భూమి నిషేధిత జాబితాలోనే నిక్షిప్తమైంది. హైకోర్టు జస్టిస్ నాగార్జున్ రెడ్డి కూడా తెలంగాణలో 1958, ఆంధ్రప్రదేశ్ లో 1954 కు ముందు కేటాయించిన అసైన్ భూములపై స్పష్టత ఇస్తూ ఇచ్చిన తీర్పులు ఉన్నట్లు రెవెన్యూ చట్టాల నిపుణులు చెబుతున్నారు.

ఏది.. ఎక్కడో తెలియదు

ఏ సర్వే నంబరులో ఎంత భూమి, ఏ వైపున తమ శాఖ భూమి ఉన్నదో చెప్పే స్థితిలో దేవాదాయ, వక్ఫ్ డిపార్ట్ మెంట్లు లేవు. ఉదాహారణకు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న మెహిదీపట్నం బాలాజీ దేవాలయానికి నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం వడ్డెపల్లిలో 354 ఎకరాల భూమి ఉన్నది. 50 ఏండ్ల నుంచి టైటిల్ వివాదం కొనసాగుతూనే ఉన్నది. ఫౌండర్ ట్రస్టీలమంటూ కొందరు పేచీ పెడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో సదరు భూమిని సాగు చేసుకుంటూ వందలాది మంది పేదలు బతుకుతున్నారు. చాలా ఆలయాల భూములపై ఓఆర్సీ తీసుకొని ఫౌండర్ ట్రస్టీలు అమ్మేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఓ సర్వే నంబర్ లో 100 ఎకరాలు ఉంటే అందులో 20 ఎకరాలు వక్ఫ్ అంటూ వక్ఫ్ బోర్డు గెజిట్ జారీ చేస్తోంది. దాంతో ఆ సర్వే నంబరు మొత్తాన్ని పీఓబీలో ఉంచుతున్నారు. దీంతో మిగిలిన 80 ఎకరాల పట్టాదార్లు ఇబ్బందులు పడుతున్నారు. అదే విధంగా భూదాన్ బోర్డు గెజిట్ కూడా అసమగ్రంగా ఉండడం వల్ల పట్టాదార్ల సర్వే నంబర్లు కూడా ఉన్నాయి. ఉదాహారణకు హైదరాబాద్ శివారులోని అల్మాస్ గూడలో భూదాన్ భూమి అంటూ 100 ఎకరాల వరకు ఉంది. కానీ ఇప్పుడది కాలనీలతో నిండిపోయింది.

నిబంధనలు ఇలా..

సెక్షన్ 22 ఏ (1), బీ ప్రకారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన స్థిరాస్తి జాబితాలను కలెక్టర్లు రిజిస్ట్రేషన్ అధికారులకు పంపాలి.సెక్షన్ 22 ఏ (1), సీ ప్రకారం దేవాదాయ, వక్ఫ్ ఆస్తుల జాబితాలను సంబంధిత అధికారులు పంపాలి. సెక్షన్ 22 ఏ (ఐ), (డీడి) ప్రకారం పట్టణ భూ పరిమితి చట్టం-1976లో స్వాధీనం చేసుకున్న భూముల వివరాలను, వ్యవసాయ భూ గరిష్ఠ పరిమితి చట్టం 1975 ప్రకారం స్వాధీనం చేసుకున్న భూముల వివరాలను కలెక్టర్లు ద్వారా రిజిస్ట్రేషన్ అధికారులకు పంపాలి. సెక్షన్ 22 ఏ (ఐ), (ఆర్) ప్రకారం కేంద్ర, రాష్ట్ర, స్థానిక సంస్థల వివరాలను, కోర్టుల ద్వారా, ఆదాయపు పన్ను శాఖ అధికార్ల ద్వారా, ఇతర ప్రభుత్వ విభాగాల ద్వారా జప్తు చేసిన ఆస్తుల రిజిస్ట్రేషన్లను నిషేధిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయాలి.

Next Story