కబ్జాకు గురైన భూములపై దేవాదాయ శాఖ ఫోకస్.. లీగల్ ఫైట్‌కు సిద్ధం

by Kema Shiva Kumar |

ఆక్రమణకు గురైన భూములపై దేవాదాయశాఖ ఫోకస్ పెట్టింది.

కబ్జాకు గురైన భూములపై దేవాదాయ శాఖ ఫోకస్.. లీగల్ ఫైట్‌కు సిద్ధం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఆక్రమణకు గురైన భూములపై దేవాదాయశాఖ ఫోకస్ పెట్టింది. లీగల్ ఫైట్ చేయడానికీ సిద్ధమవుతున్నది. రాష్ట్రంలో దేవాదాయశాఖ పరిధిలో మొత్తం 91,827 ఎకరా భూములు ఉన్నాయి. అందులో ఆరు వేల ఎకరాలు ఇతర రాష్ట్రాల పరిధిలో ఉండగా.. సుమారు 25 వేల ఎకరాలు కబ్జాకు గురయ్యాయని భావిస్తున్నారు. ఉన్నవాటిని కాపాడుకోవడంతోపాటు ఆక్రమణకు గురైన భూముల గురించి ఏం చేద్దామనే దానిపై కసరత్తు ప్రారంభించింది. మార్కెట్ వాల్యూ ప్రకారం భూములకు ధర నిర్ణయించి వసూలు చేద్దామా? లేకుంటే లీజు వసూలు చేద్దామా? అనే అంశాలపై ఇప్పటికే అధికారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్నట్లు సమాచారం.

కార్యనిర్వహణాధికారులకు బాధ్యతలు

దేవాదాయాలకు కార్యనిర్వహణాధికారులను ప్రభుత్వం నియమించింది. వారికి ఆలయ భూముల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించింది. రాష్ట్రంలో 704 టెంపుల్స్ కు 233 మంది ఈవోలుండాలి. కానీ ప్రస్తుతం 164 మందే పనిచేస్తున్నారు. ఇంకా 69 మందిని నియమించాల్సి ఉంటుంది. ఒక్కో ఈఓకు అదనంగా ఆలయాల బాధ్యతను అప్పగించింది. అయితే గతంలో ఆలయ భూములపై పర్యవేక్షణ కొరవడి కబ్జా గురయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. ఆలయాల పరిధిలో 91,827.35 ఎకరాలు ఉండగా, 25,066.69 ఎకరాలు కబ్జాకు గురైంది. వాటిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆక్రమణదారులు కోర్టులకు వెళ్లడంతో ఏళ్లతరబడి ఈ ప్రాసెస్ నడుస్తున్నది. అయితే చివరకు స్వాధీనం చేసుకుంటారా? లేదా? అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

ఏం చేద్దాం?

ఆక్రమణకు గురైన భూములను ఏం చేద్దామనేదానిపై ప్రభుత్వం తీవ్ర కసరత్తును ప్రారంభించింది. అధికారులతో పలుమార్లు సమావేశమై సూచనలు, సలహాలు తీసుకుంది. అయితే ఎక్కువ మంది అధికారులు ఆ భూములకు మార్కెట్ రేటు ప్రకారం ఆక్రమణ దారుల నుంచి వసూలు చేస్తే ఆదాయం వస్తుందని, కోర్టుల చుట్టూ తిరుగకుండా ఉంటుందని, వచ్చే ఆదాయంతో ఆలయాలను అభివృద్ధి చేసుకోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఆలయాల్లో దూపదీపం నైవేద్యంకోసం భూములను కేటాయించారు. భూముల్లో 25 వేల ఎకరాలు కబ్జాకు గురికావడంతో కొన్ని ఆలయాల్లో నిత్యం పూజల కంకైర్యం చేపట్టడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో ఆలయ భూములకు కబ్జాకు గురై నివాసాలు ఏర్పాటు చేసుకోగా, కొంతమంది సాగు చేసుకుంటున్నట్లు సమాచారం.

దీంతో ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఉదాహరణకు అత్తాపూర్లోని పద్మనాభస్వామి ఆలయానికి 4 ఎకరాల భూములు ఉండగా.. చుట్టూ కబ్జా చేసి భవనాలు నిర్మించినట్లు అధికారులు గుర్తించారు. అదే విధంగా దేవరయాంజల్ లో దేవాదాయశాఖకు 1500 ఎకరాల భూమి ఉంటే అందులో 800 ఎకరాలపైగా కబ్జాకు గురైందని సమాచారం. అదికూడా ప్రస్తుతం లేదని 10 నుంచి 15 ఎకరాలు మాత్రమే ఉందని తెలిసింది. మాదాపూర్ లో గోరక్షణ ట్రస్టుకు చెందిన భూమి కూడా కబ్జాకు గురైందని.. అందులో ప్రముఖులు ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. భూమిని తిరిగి స్వాధీనం చేసుకుందామంటే కాస్రా పహానీ లేదని, భూమి ఎంత ఉందో చెప్పడం కష్టమవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఈ నేపథ్యంలో కబ్జాకు గురైన భూములను మార్కెట్ రేట్ నిర్ణయించి వారికే అప్పగిస్తే ఎలా ఉంటుందని దేవాదాయశాఖ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఉన్నతాధికారుల దృష్టికి సైతం ఈ అంశాన్ని తీసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. దేవరయాంజల్ భూములపై కమిటీ వేసినా ఇప్పటివరకు భూముల ఆక్రమణపై తేల్చలేదని సమాచారం. మరోవైపు 22 ఇ-1(సీ) బుక్, గెజిట్ లో ఇన్ క్లూడ్ ఉన్నా.. కొందరు అక్రమంగా రిజిస్ర్టేషన్ చేసుకుంటున్నట్లు దేవాదాయశాఖ గుర్తించినట్లు తెలిసింది. ఆ భూమిని స్వాధీనం చేసుకునేందుకు వెళ్తే ఆక్రమణ దారులు కోర్టులకు వెళ్తున్నారని దీనికి తోడు దేవాదాయశాఖకు టాస్క్ ఫోర్స్ లాంటిది లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనా ఆలయ భూములకు మార్కెట్ రేటు ప్రకారం ధర నిర్ణయించి ఆక్రమణదారుల నుంచి వసూలు చేస్తే ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

కాంప్లెక్స్‌లు నిర్మిస్తే..

మరోవైపు ఆలయాలకు ఉన్న భూమి ఆక్రమణకు గురికాకుండా ఆలయాల వద్దే కాంప్లెక్స్ నిర్మాణం చేస్తే అద్దెలతో ఆదాయం వచ్చే అవకాశం ఉంది. టూరిజం శాఖ ఏవిధంగానైతే హరిత ప్లాజాలు నిర్మిస్తుందో అదే విధంగా దేవాదాయశాఖ సైతం అలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని అధికారులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇదే అంశాన్ని దేవాదాయశాఖ మంత్రి, ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు కబ్జా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటే, తీర్పులు సైతం త్వరగా వెల్లడిస్తే భూములను స్వాధీనం చేసుకోవచ్చని, అందుకోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటే బాగుంటుందని ప్రజలు సైతం అభిప్రాయపడుతున్నారు. లీగల్ టీంను సైతం పటిష్టం చేయాలని, మరికొంతమంది న్యాయవాదులను నియమించుకుని సత్వర పరిష్కారం అయ్యేలా ప్రభుత్వం చొరవ తీసుకుంటే బాగుంటుందని పలువురు పేర్కొంటున్నారు. అదే విధంగా సర్వేయర్, పోలీసు సిబ్బంది, టాస్క్ ఫోర్స్ టీమ్ లను సైతం ఏర్పాటు చేస్తే ఆక్రమణకు గురైన భూములను స్వాధీనం చేసుకొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది వేచి చూడాలి.

Next Story