- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మృత్యుపాశంగా మారిన సీతారామ కెనాల్ బ్రిడ్జి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని అంజనాపురం–జింకలగూడెం ప్రధాన రహదారిపై ఉన్న సీతారామ ప్రాజెక్టు కెనాల్ బ్రిడ్జి ప్రమాదకర స్థితికి చేరుకుంది.

దిశ, బూర్గంపాడు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలోని అంజనాపురం–జింకలగూడెం ప్రధాన రహదారిపై ఉన్న సీతారామ ప్రాజెక్టు కెనాల్ బ్రిడ్జి ప్రమాదకర స్థితికి చేరుకుంది. ప్రతిరోజూ వేలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ జాతీయ రహదారిపై బ్రిడ్జి పూర్తిగా దెబ్బతినడంతో వాహనదారులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ప్రయాణించాల్సిన పరిస్థితి నెలకొంది.
బయటపడ్డ ఇనుప రాడ్లు.. ప్రమాదకరంగా మారిన రహదారి..
భారీ వాహనాల రాకపోకల కారణంగా బ్రిడ్జిపై కాంక్రీట్ పూర్తిగా దెబ్బతిని, పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి. దీంతో లోపలి ఇనుప రాడ్లు బయటకు తేలి ప్రమాదకరంగా మారాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో గోతులు కనిపించక ద్విచక్ర వాహనదారులు అదుపుతప్పి కిందపడుతున్నారని, ఇప్పటికే పలుమార్లు ప్రమాదాలు చోటుచేసుకున్నాయని స్థానికులు తెలిపారు.
అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం..
ఈ రహదారి గుండా ప్రతిరోజూ ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు ప్రయాణిస్తున్నప్పటికీ బ్రిడ్జి దుస్థితిని పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యను పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తున్నారు.
తక్షణమే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్..
ఏదైనా పెద్ద ప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవించకముందే సంబంధిత అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. నేషనల్ హైవే, సీతారామ ప్రాజెక్టు, రోడ్లు–భవనాల శాఖ అధికారులు వెంటనే బ్రిడ్జిని పరిశీలించి, దెబ్బతిన్న భాగాలకు అత్యవసర మరమ్మతులు చేపట్టి ప్రజలకు సురక్షితమైన ప్రయాణ సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.






