చంద్రబాబు డైరెక్షన్‌లోనే రేవంత్ పాలన, కాళేశ్వరంపై కుట్రలు: జీవన్ రెడ్డి

by Malleboina Mahesh |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శలు! చంద్రబాబు డైరెక్షన్‌లో పాలన సాగుతోందని, మేడిగడ్డపై కుట్రలు చేస్తున్నారని ఆరోపణ.

చంద్రబాబు డైరెక్షన్‌లోనే రేవంత్ పాలన, కాళేశ్వరంపై కుట్రలు: జీవన్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి, సీనియర్ రాజకీయ నేత జీవన్ రెడ్డి (Jeevan Reddy) బీఆర్ఎస్ పార్టీలో చేరనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ప్రముఖ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ.. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం స్వతంత్రంగా కాకుండా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైరెక్షన్‌లో నడుస్తోందని ఆయన ఆరోపించారు. కేవలం చంద్రబాబు మెప్పు పొందడం కోసమే రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు చేస్తున్నారని, ఇందులో భాగంగానే మేడిగడ్డ బ్యారేజీని ఉద్దేశపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు.

అలాగే మేడిగడ్డ బ్యారేజీకి వెంటనే మరమ్మతులు చేపట్టకుండా రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రజలను వంచిస్తున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు. "మేడిగడ్డ రిపేర్లు చేయకుండా కాలయాపన చేయడం వల్ల రాష్ట్ర ప్రయోజనాలకు గండి పడుతోంది. ఎల్ నినో ప్రభావం పడి, రాష్ట్రంలో కరువు పరిస్థితులు ఏర్పడితే మేడిగడ్డ లేని లోటు ఏంటో ప్రజలకు అప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. ఆ సమయంలో ప్రజలు పడే ఇబ్బందులను చూసి రేవంత్ రెడ్డిని తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదు" అని ఆయన హెచ్చరించారు.

కరువు ముప్పుపై హెచ్చరిక..

కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేయడం వల్ల భవిష్యత్తులో సాగునీరు, తాగునీటి ఎద్దడి తలెత్తే ప్రమాదం ఉందని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర రైతాంగాన్ని బలి చేయొద్దని, వెంటనే మేడిగడ్డ బ్యారేజీ పై స్పష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారని ఈ సందర్భంగా జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Next Story