రేవంత్ పొలిటికల్ మాస్టర్ ప్లాన్: ‘విద్యుత్’ అస్త్రంతో ఒకే దెబ్బకు రెండు పిట్టలు!

by Kema Shiva Kumar |

విద్యుత్ అక్రమాలపై విచారణను సీబీఐకి అప్పగిస్తూ రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసున్న విషయం తెలిసిందే.

రేవంత్ పొలిటికల్ మాస్టర్ ప్లాన్: ‘విద్యుత్’ అస్త్రంతో ఒకే దెబ్బకు రెండు పిట్టలు!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్టుగా.. ఒకేసారి అటు బీఆర్ఎస్‌, ఇటు బీజేపీని ఇరుకున పెట్టేలా సీఎం రేవంత్ ప్లాన్ చేశారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ హయాంలో విద్యుత్ ఒప్పందాలు, ప్లాంట్ల నిర్మాణాల్లో జరిగిన అక్రమాలపై విచారణ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సీబీఐకి బాధ్యతలు అప్పగించారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలపై విచారణ చేయాలంటూ 6 నెలల క్రితం సీబీఐకి సర్కారు లేఖ రాసింది. కానీ, ఇంతవరకు దర్యాప్తు సంస్థకు చెందిన అధికారుల్లో ఎలాంటి కదలికా లేదు. తాజాగా విద్యుత్ అక్రమాల కేసుపై సీబీఐ ఏ విధంగా స్పందిస్తుందోననే విషయం ఆసక్తిగా మారింది.

ప్రభుత్వంపై విమర్శలు రాకుండా..

బీఆర్ఎస్ హయాంలో ఛత్తీస్‌గఢ్‌తో జరిగిన విద్యుత్ ఒప్పందాలు, యాదాద్రి, భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయంటూ నాడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేసింది. రాష్ట్రంలో హస్తం పార్టీ అధికారంలోకి వచ్చాక విద్యుత్ అంశాలపై విచారణ జరపాలంటూ జస్టిస్ లోకూర్ కమిషన్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. పలు కోణాల్లో ఎంక్వయిరీ చేసిన కమిషన్.. నివేదికను సర్కారుకు అందజేసింది. ఒకవేళ ఆ నివేదిక ఆధారంగా దర్యాప్తు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని దర్యాప్తు సంస్థలకు బాధ్యతలు అప్పగిస్తే.. ఇదంతా రాజకీయ కుట్ర అని బీఆర్ఎస్ విమర్శలు చేసే అవకాశం ఉంటుంది. అందుకే విచారణ బాధ్యత సీబీఐకి అప్పగించాలని సీఎం నిర్ణయం తీసుకున్నట్టు చర్చ జరుగుతున్నది.

ఇరకాటంలో బీఆర్ఎస్, బీజేపీ..

కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ బాధ్యతలను సీబీఐకి అప్పగించడంతో అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ ఇరకాటంలో పడ్డాయనే చర్చ జరుగుతున్నది. సీబీఐ రంగంలోకి దిగితే గులాబీ నేతలు విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుంది. లేదంటే బీజేపీ నేతలు బీఆర్ఎస్ పార్టీని, నాయకులను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారని, అందుకే సీబీఐ విచారణ చేపట్టడం లేదని ఎటాక్ చేసేందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే గులాబీ, కమలం పార్టీల మధ్య రహస్య స్నేహం కొనసాగుతున్నదని, వచ్చే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ఆరోపణలు చేస్తున్నారు. ఈనెల 10న ప్రధాని మోడీ హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సీబీఐతో విచారణ చేయాలంటూ తమ ప్రభుత్వం రాసిన లేఖలపై కేంద్రం సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.

కాళేశ్వరంపై సీబీఐ మౌనం?

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ బీజేపీ నేతలు సైతం ఆరోపణలు చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కానీ, ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్రం సంస్థల ప్రమేయం ఉన్నదని, అందుకే సీబీఐతో దర్యాప్తు చేయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆ మేరకు సుమారు 8 నెలల క్రితం సీబీఐకి రాష్ట్ర సర్కారు లేఖ రాసింది. కానీ, ఇంతవరకు దర్యాప్తు సంస్థ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. ఇదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు సైతం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై విచారణ జరపాలంటూ లేఖ రాసినా సీబీఐ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నిస్తున్నారు.

Next Story