- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణ vs కేరళ: పినరయి విజయన్‌కు CM రేవంత్ ఘాటు లేఖ
తెలంగాణ, కేరళ ముఖ్యమంత్రుల మధ్య సోషల్ మీడియా వేదికగా సాగుతున్న మాటల యుద్ధం ఇప్పుడు ఒక కీలక మలుపు తిరిగింది.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ, కేరళ ముఖ్యమంత్రుల మధ్య సోషల్ మీడియా వేదికగా సాగుతున్న మాటల యుద్ధం ఇప్పుడు ఒక కీలక మలుపు తిరిగింది. కేరళ సీఎం పినరయి విజయన్ చేసిన ట్వీట్లకు కౌంటర్‌గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా ఆరు పేజీల సుదీర్ఘ లేఖను రాశారు. కేరళ అభివృద్ధి మోడల్‌లోని లోపాలను ఎత్తిచూపుతూనే, తెలంగాణలో గత 28 నెలల్లో సాధించిన ప్రగతిని ఆయన ఈ లేఖలో వివరించారు. పినరయి విజయన్ ఉటంకించిన గణాంకాలన్నీ 2023-24 నాటివని, అవి తెలంగాణలో గత ప్రభుత్వ (BRS) పాలన చివరి దశకు సంబంధించినవని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. "మేము అధికారంలోకి వచ్చి 28 నెలలే అయ్యింది, మీరు 120 నెలలుగా అధికారంలో ఉన్నారు. 70 ఏళ్ల కేరళ ప్రస్థానాన్ని మా 28 నెలల పాలనతో పోల్చడం తగదు" అని ఆయన హితవు పలికారు.
అభివృద్ధి గణాంకాలు..
తెలంగాణ జీఎస్‌డీపీ (GSDP) 10.1% వృద్ధి రేటుతో జాతీయ సగటు (9.9%) కంటే ఎక్కువగా ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దక్షిణాదిలోనే అత్యధిక తలసరి ఆదాయం (₹3.79 లక్షలు) కలిగిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని పేర్కొన్నారు. రైతు భరోసా, ₹2 లక్షల వరకు రుణమాఫీ, ఉచిత విద్యుత్, మరియు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నామని వివరించారు. కేరళలో యువత ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్నారని (Brain Drain), అక్కడ పారిశ్రామికాభివృద్ధి కుంటుపడిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణలో కేవలం 28 నెలల్లోనే 67,763 ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు చేపట్టామని, హైదరాబాద్‌ను గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC) హబ్‌గా మార్చామని తెలిపారు.
అవినీతి ఆరోపణలు, బీజేపీతో సంబంధం..
కేరళలో జరిగిన 'గోల్డ్ స్మగ్లింగ్' కేసును, శబరిమల ఆలయ బంగారం తాపడం విషయంలో జరిగిన అక్రమాలను రేవంత్ రెడ్డి ప్రస్తావించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గాంధీ కుటుంబాన్ని వేధిస్తోందని, కానీ కేరళ సీఎం కార్యాలయంపై వస్తున్న ఆరోపణల విషయంలో సీబీఐ ఎందుకు మౌనంగా ఉందో ప్రజలకే వదిలేస్తున్నానని ఆయన వ్యాఖ్యానించారు. అయితే లేఖ చివరలో రేవంత్ రెడ్డి ఒక ఆసక్తికరమైన ముగింపు ఇచ్చారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన 'నరసింహం' సినిమాలోని ప్రసిద్ధ డైలాగ్ "నీ పో మోనే విజయన్" (నువ్వు వెళ్లు బాబు విజయన్) అని ఉటంకిస్తూ కేరళ సీఎంకు సెటైర్ వేశారు. అలాగే, ఏప్రిల్ 7న తిరువనంతపురం వచ్చి నేరుగా గణాంకాలతో చర్చించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఆహ్వానించారు. తెలంగాణ అభివృద్ధిని విమర్శించే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని రేవంత్ రెడ్డి ఈ లేఖ ద్వారా హితవు పలికారు.






