ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి మకాం.. స్థానిక ఎన్నికలపై రేవంత్ నయా ప్లాన్?

by Prasad Jukanti |   (  Updated:2025-08-07 07:23:36  IST  )

సీఎం రేవంత్ రెడ్డి నేడు కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారు.

ఢిల్లీలోనే సీఎం రేవంత్ రెడ్డి మకాం.. స్థానిక ఎన్నికలపై  రేవంత్ నయా ప్లాన్?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అంశంపై రాజకీయం ఆసక్తి రేపుతోంది. రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన పంపిన బీసీ బిల్లులను (BC Reservation Bill) కేంద్రం ఆమోదించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ ఢిల్లీ బాట పట్టి మూడు రోజులవుతోంది. బీసీ రిజర్వేషన్ల పెంపు అమలు కోసం ముఖ్యమంత్రి రేంత్ రెడ్డి (CM Revanth Reddy), పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సహా రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఢిల్లీలోనే మకాం వేశారు. బిల్లుల ఆమోదం కోరుతూ ఇవాళ రాష్ట్రపతిని కలవాలని కాంగ్రెస్ నిర్ణయించుకున్నారు. అయితే ఇప్పటి వరకు ప్రెసిడెంట్ అపాయింట్మెంట్ లభించలేదు. ఈ నేపథ్యంలో టీ కాంగ్రెస్ ఏం చేయబోతున్నదనేది ఉత్కంఠగా మారింది.

ఏఐసీసీ పెద్దలతో భేటీ:

రాష్ట్రపతి అపాయింట్మెంట్ (Rashtrapati Appointment) దొరకకపోవడంతో కాంగ్రెస్ అధిష్టానం (AICC) పెద్దలతో భేటీ అయ్యేందుకు టీ కాంగ్రెస్ నేతలు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. రిజర్వేషన్ల విషయంలో బిల్లులను కేంద్రానికి పంపించడంతో పాటు ఢిల్లీకి వెళ్లి ప్రయత్నించినా కేంద్రం సహకరించడం లేదని, రాష్ట్రపతి అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకపోవడంతో ఇక ఈ విషయాన్ని రాష్ట్రంలోనే ఉండి సాధించుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో రిజర్వేషన్ల విషయంలో తదిపరి పరిణామాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ:

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకువచ్చిన బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉండటం, ప్రభుత్వం పంపిన ఆర్డినెస్స్ కు క్లియరెన్స్ రాకపోవడంతో రిజర్వేషన్ల విషయంలో రేవంత్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నది అనేది సస్పెన్స్ గా మారింది. బీసీ రిజర్వేషన్లు అమలు చేసే స్థానిక సంస్థలకు వెళ్తామని కాంగ్రెస్ ఇప్పటికే స్పష్టం చేసింది. కానీ బీసీ బిల్లుల విషయంలో పరిస్థితులు మరోలా ఉండటంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతోంది. బీసీ రిజర్వేషన్ల విషయాన్ని కాంగ్రెస్ పార్టీ చాలెంజ్ గా తీసుకుంది. చట్టప్రకారం సాధ్యం కాని పక్షంలో పార్టీ పరంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని అధికార పక్షం స్పష్టం చేసింది. మరో వైపు రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్, బీజేపీలు కాంగ్రెస్ ను కార్నర్ చేస్తున్న నేపథ్యంలో ఈ అంశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎలాంటి వ్యూహంతో ముందడుగు వేయబోతున్నారు అనేది స్టేట్ పాలిటిక్స్ లో ఆసక్తిని రేపుతోంది. తాము ఢిల్లీకి వెళ్లి చేయాల్సిన ప్రయత్నాలు చేసినా బీజేపీ సహకరించకపోగా బీజేపీకి బీఆర్ఎస్ వంతపాడుతోందనే సంకేతాలను నిన్న రేవంత్ రెడ్డి తన స్పీచ్ లో స్పష్టం చేశారు. దీంతో ఒక వేళ ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి పార్టీ పెద్దలతో భేటీ అయితే వారు ఎలాంటి సూచనలు చేయబోతున్నారు? ముఖ్యమంత్రి ఎలాంటి వ్యూహాలను పార్టీ పెద్దలకు చెప్పబోతున్నారు అనేది వేచిచూడాలి.

Next Story