బీఆర్ఎస్‌లో చేరిన పొన్నాల ఎక్కడున్నారో తెలుసా?.. జీవన్ రెడ్డి కామెంట్స్‌పై CM రేవంత్ రియాక్షన్

by Gantepaka Srikanth |

మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు.

బీఆర్ఎస్‌లో చేరిన పొన్నాల ఎక్కడున్నారో తెలుసా?.. జీవన్ రెడ్డి కామెంట్స్‌పై CM రేవంత్ రియాక్షన్
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. కాంగ్రెస్‌లో సీనియర్లకు అన్యాయం జరుగుతోందన్న విమర్శలను కొట్టిపారేస్తూనే, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీనియర్ నేతలకు ఎదురైన పరిస్థితులను ఆయన గుర్తుచేశారు. ఢిల్లీ వేదికగా జరిగిన చిట్‌చాట్‌లో సీఎం ఈ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జీవన్ రెడ్డి తనపై చేసిన వ్యక్తిగత విమర్శలకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. "జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై నేను ప్రత్యేకంగా స్పందించను" అని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో సీనియర్లకు అవమానం జరుగుతోందని అంటున్న వారు, బీఆర్ఎస్ (గతంలో టీఆర్ఎస్) నుండి సీనియర్ నేతలు ఎందుకు బయటకు వచ్చారో చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

"ఒకప్పుడు పార్టీ కోసం పనిచేసిన ఆళ్ల నరేంద్ర, విజయశాంతి, ఈటల రాజేందర్ వంటి నేతలు బీఆర్ఎస్‌ను ఎందుకు వీడాల్సి వచ్చింది? అక్కడ వారికి జరిగిన అవమానం ఏంటో అందరికీ తెలుసు" అని సీఎం అన్నారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఇప్పుడు ఎక్కడున్నారో, ఆయనకు బీఆర్ఎస్‌లో దక్కిన గౌరవం ఎంతో కనిపిస్తూనే ఉందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయాంలో సీనియర్లకు జరిగిన అవమానాలు గుర్తులేవా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎప్పుడూ తన నేతలను గౌరవిస్తుందని, కానీ కొందరు కావాలని చేస్తున్న విమర్శలకు కాలమే సమాధానం చెబుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Next Story