KTR : బీజేపీ నేతలతో రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందాలు : కేటీఆర్

by Muthe.Rajitha |

బీజేపీకి కాంగ్రెస్ కి మధ్య చీకటి ఒప్పందం ఉందని మరోసారి ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)

KTR : బీజేపీ నేతలతో రేవంత్ రెడ్డి చీకటి ఒప్పందాలు : కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : బీజేపీకి కాంగ్రెస్ కి మధ్య చీకటి ఒప్పందం ఉందని మరోసారి ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR). బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్(BJP MLA RajaSingh) తమ పార్టీ నేతలతో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రహస్య సమావేశం అయ్యారని మండిపడిన విషయాన్ని కేటీఆర్ ప్రస్తావిస్తూ.. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అధికారిక సమావేశాలు నిర్వహించాలి కానీ ఈ చీకటి మీటింగులు పెట్టడమేంటని మండిపడ్డారు. ఇలాంటి దిక్కుమాలిన చిల్లర రాజకీయం తెలంగాణ నేలపై ఇంతవరకు ఎప్పుడూ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు బయటకు బీజేపీ నేతలతో కుస్తీపడుతున్నట్టు ఫోజులు కొట్టి, దొంగచాటుగా దోస్తీ చేసే ఈ నీచ సంస్కృతికి తెరలేపడం అత్యంత దుర్మార్గమని కేటీఆర్ ఆరోపించారు.

ఏం గూడుపుఠాణి చేయడానికి ఈ తెరచాటు సమావేశాలు నిర్వహిస్తున్నారో ముఖ్యమంత్రికి దమ్ముంటే బయటపెట్టాలన్నారు. పంటలు ఎండిపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా, గురుకులాల్లో విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నా ఒక్క సమీక్ష నిర్వహించే సమయం లేని సీఎంకు, ఈ రహస్య సమావేశాలకు మాత్రం టైమ్ దొరకడం క్షమించలేని ద్రోహం అన్నారు. కాంగ్రెస్ లో బీజేపీ కోవర్టులున్నారని రంకెలు వేసే రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి, BJP ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యలతో దొరికిపోయిన రేవంత్ రెడ్డిపై చర్య తీసుకునే ధైర్యం ఉన్నదా అని కాంగ్రెస్ అధిష్టానాన్ని నిలదీశారు.

అట్టర్ ఫ్లాప్ ముఖ్యమంత్రిగా ముద్రపడి, ఇక ఏ క్షణంలోనైనా తన సీఎం కుర్చీ చేజారే సూచనలు కనిపించడం వల్లే చీప్ మినిస్టర్ బీజేపీతో ఈ చీకటి ఒప్పందాలు చేసుకుంటున్నట్టు స్పష్టమవుతోందని తెలిపారు. ఏడాదిన్నరలోనే రాష్ట్రాన్ని ఆగంచేసి, డర్టీ పాలిటిక్స్ చేస్తున్న ఈ రాబందు రాజకీయాలను తెలంగాణ సమాజం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించదని, రెండు ఢిల్లీపార్టీలకు కర్రుగాల్చి వాతపెడ్తదని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.

Next Story