CMగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం.. తొలి సంతకం ఆ ఫైల్‌పైనే..!

by Disha Web Desk 4 |
CMగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం.. తొలి సంతకం ఆ ఫైల్‌పైనే..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయగానే ఆ హోదాలో ఆయన చేయబోయే తొలి సంతకం ఆరు గ్యారంటీల అమలుపైనే. దానికి తగినట్లుగా అధికారులు సంబంధిత ఫైళ్ళను సిద్ధం చేస్తున్నారు. ఆరు గ్యారంటీలు వివిధ విభాగాలకు చెందినవి కావడంతో ఆయా శాఖలు వాటి అమలుకు సంబంధించిన మార్గదర్శకాల తయారీపై ఆ తర్వాత కసరత్తు మొదలుపెడతాయి.

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయగానే తొలి సంతకం ఈ గ్యారంటీలపైనే చేస్తారని రాహుల్‌గాంధీతో పాటు రేవంత్ కూడా ఎన్నికల ప్రచారం సమయంలో స్పష్టత ఇచ్చారు. దానికి తగినట్లుగానే మొదటి సంతకాన్ని దానికి సంబంధించిన ఫైల్‌పైన పెడతారని కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో వ్యాఖ్యానించారు. రాహుల్‌గాంధీ సైతం ప్రజల పాలన ప్రారంభమవుతుందని సిక్స్ గ్యారంటీస్‌ను అమలు చేయడానికి తొలి ప్రాధాన్యత ఉంటుందన్నారు.

సచివాలయ ఉద్యోగుల్లో సంబురాలు

ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడానికి ఒక రోజు ముందు సచివాలయ ఉద్యోగుల్లో సంబురాలు మొదలయ్యాయి. ఫస్ట్ టైమ్ రోడ్డు మీదకు వచ్చి సంతోషాన్ని పరస్పరం పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం జరిగినప్పుడు గద్దర్ పాడిన పొడుస్తున్న పొద్దు మీద.. అనే పాట పెట్టుకుని డ్యాన్సులు చేశారు. మరికొద్దిసేపు బతుకమ్మ ఆడారు. సొంత రాష్ట్రం ఏర్పడితే పరాయి రాష్ట్రంలోని వివక్షకు స్వస్తి చెప్పవచ్చని భావించి ఉద్యమంలోకి దూకామని, కానీ సొంత రాష్ట్ర పాలనలో మాత్రం పారదర్శకత, స్వేచ్ఛ లేకుండా తొమ్మిదేళ్ళు పైకి చెప్పుకోలేని బాధలను అనుభవించామని ఉద్యోగులు వాపోయారు.

కనీసం ఫోన్ మాట్లాడడానికి కూడా భయపడేవారమని, ఇప్పుడైనా ఇలాంటి భయానక వాతావరణం లేకుండా ప్రజలు కోరుకున్న పాలన వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పనివేళల్లో ఆఫీసుల్లో ఉండాల్సిన ఉద్యోగులు ఒక్కసారిగా రోడ్డు మీదకు వచ్చి వారి మనసులోని సంతోషాన్ని వ్యక్తం చేశారు. రాహుల్, రేవంత్ చెప్పినట్లుగా ప్రజా పాలన వస్తే అంతకంటే సంతోషం ఏముంటుందని ఉద్యోగులు వ్యాఖ్యానించారు.

Also Read...

CMగా రేవంత్ ప్రమాణ స్వీకారం.. మాజీ సీఎం కేసీఆర్‌కు ఆహ్వానం

Next Story

Most Viewed