- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇరుకైన రోడ్లతో ట్రాఫిక్ తిప్పలు
నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీగా 2018 లో ఏర్పడి 8 ఏళ్లు గడుస్తున్నా ఖానాపూర్ పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

దిశ, ఖానాపూర్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీగా 2018 లో ఏర్పడి 8 ఏళ్లు గడుస్తున్నా ఖానాపూర్ పట్టణంలో రోడ్డు విస్తరణ పనులు పూర్తి కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇరుకైన రోడ్లు, ఆగిపోయిన పనులు, పెరుగుతున్న ప్రమాదాల పై సోమవారం పట్టణ యువకులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని ప్రజావాణిలో వినతిపత్రం అందచేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సాయిబాబా మందిరం నుంచి పోలీస్ స్టేషన్ వరకు రోడ్డు విస్తరణ, డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనుల కోసం నిధులు మంజూరు చేసింది. కానీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో పనులు నత్తనడకన సాగాయి. సాయిబాబా మందిరం నుంచి జూనియర్ కాలేజ్ వరకు మాత్రమే కొంత పని జరగగా, జూనియర్ కాలేజ్ నుంచి తెలంగాణ చౌరస్తా మీదుగా పోలీస్ స్టేషన్ వరకు విస్తరణ, డివైడర్, లైటింగ్ పనులు పూర్తిగా ఆగిపోయాయి. ఎన్నికల ముందు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకులు అధికారంలోకి వచ్చిన వెంటనే పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వం మారినా పరిస్థితిలో మార్పు లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రోజూ ప్రమాదాలు.. ట్రాఫిక్ జామ్..
ఖానాపూర్ మీదుగా మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, నిర్మల్ జిల్లాలకు నిత్యం భారీ వాహనాలు వెళ్తుంటాయి. తెలంగాణ చౌరస్తా నుంచి కాలేజ్ వరకు రోడ్డు ఇరుకుగా ఉండటంతో రోజూ ట్రాఫిక్ జామ్, చిన్న చిన్న ప్రమాదాలు జరుగుతునేవున్నాయి . రోడ్డు మధ్యలో ఉన్న సెంటర్ లైటింగ్ స్తంభాల కారణంగా ఇటీవల ఒక ప్రజాప్రతినిధి కారును ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. భారీ వాహనం స్తంభాన్ని ఢీ కొట్టడంతో పట్టణంలో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇరుకైన రోడ్లపైనే చిరువ్యాపారులు వ్యాపారం చేయడం, రోడ్డు పక్కన వాహనాలు పార్కింగ్ చేయడంతో వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ చౌరస్తా, వివేకానంద చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తాల వద్ద ప్రతిరోజూ ట్రాఫిక్ సమస్యలు తప్పడం లేదు.
ప్రజావాణి కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు..
ఈ నేపథ్యంలో ఖానాపూర్ పట్టణ యువకులు రాపెల్లి రాజు యాదవ్, కోరెండ్ల సుధీర్, గాంధారి నరేంద్రనాథ్, సుర శ్రీనివాస్, ముజీబ్ తదితర యువకులు సోమవారం ప్రజావాణి జిల్లా కలెక్టర్ వినతిపత్రం అందజేశారు. రోడ్డు విస్తరణకు అడ్డంగా ఉన్న విద్యుత్ స్తంభాల తొలగింపునకు నిధులు విడుదల చేసి, పనులను వేగవంతం చేయాలని వారు కోరారు. ప్రభుత్వం స్పందించాలి, ఆగిపోయిన రోడ్డు విస్తరణ, డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనుల కోసం వెంటనే నిధులు మంజూరు చేసి పట్టణాన్ని అభివృద్ధి చేయాలని వారు కోరారు.






