- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్‌ను బొంద పెట్టిండు : కేటీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.

దిశ, చేవెళ్ల: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో రియల్ ఎస్టేట్ గురించి గొప్పలు చెప్పుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నేడు ఆ రంగాన్ని పూర్తిగా దెబ్బతీశారని విమర్శించారు. చేవెళ్ల నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. “ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి తనను తాను రియల్ ఎస్టేట్ నిపుణుడిగా చెప్పుకున్నారు. కానీ రెండున్నరేళ్ల పాలనలో లక్షలాది మంది ఉపాధి ఆధారమైన రియల్ ఎస్టేట్ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టారు. ఎన్నికలకు ముందు కోటి రూపాయలు పలికిన ఎకరం భూమి నేడు రూ.50-60 లక్షలకు కూడా కొనుగోలు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు” అని అన్నారు.
కేసీఆర్ హయాంలో పరిశ్రమలు – భూముల విలువ పెరిగింది
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేవెళ్ల ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చామని కేటీఆర్ పేర్కొన్నారు. షాబాద్ పరిసర ప్రాంతాలైన చందన్‌వెల్లి, సీతారాంపూర్‌లలో పారిశ్రామిక పార్కులు ఏర్పాటు చేసి, మైక్రోసాఫ్ట్, అమెజాన్, వెల్స్‌పన్ వంటి అంతర్జాతీయ సంస్థలను తీసుకువచ్చామని చెప్పారు. “ఒకప్పుడు ఎకరం రూ.30 లక్షలు ఉన్న భూమి, పరిశ్రమల అభివృద్ధి వల్ల రూ.3 కోట్లకు పైగా చేరింది. కానీ కాంగ్రెస్ పాలనలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది” అని వ్యాఖ్యానించారు.
ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు కాలేదు
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సగం పాలన పూర్తయినా, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఒక్కదాన్ని కూడా పూర్తిగా అమలు చేయలేదని కేటీఆర్ ఆరోపించారు. రైతు బంధు, దళిత బంధు, ఇందిరమ్మ ఇళ్లు, అసైన్డ్ భూముల పట్టాలు వంటి అంశాల్లో ప్రజలను మోసం చేశారని విమర్శించారు. రైతు బంధు పథకాన్ని నిలిపివేసి రైతులను ఇబ్బందులకు గురిచేశారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు.
కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు
రాష్ట్రంలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని ఆరోపించిన కేటీఆర్, గత ప్రభుత్వంపై అప్పుల పేరుతో విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నేతలు తమ పాలనలో చేసిన అప్పుల వివరాలను ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. “గత ప్రభుత్వం చేసిన అప్పులన్నీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసమే ఖర్చయ్యాయి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన లక్షల కోట్ల అప్పులు ఎక్కడ ఖర్చయ్యాయో ప్రజలకు సమాధానం చెప్పాలి” అని అన్నారు.
తెలంగాణ అభివృద్ధి కోసం మళ్లీ కేసీఆర్ అవసరం
కొత్త రాష్ట్రంగా తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలవాలని బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేసిందని కేటీఆర్ పేర్కొన్నారు. పరిపాలనపై ఎక్కువ దృష్టి పెట్టడంతో పార్టీ బలోపేతంపై అంతగా దృష్టి పెట్టలేకపోయామని, అయితే ఇకపై కార్యకర్తల సంక్షేమం, పార్టీ బలోపేతం రెండింటిపైనా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని చెప్పారు. “2028లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే ప్రతి కార్యకర్త పార్టీ సభ్యత్వ నమోదు, ఎస్‌ఐఆర్ కార్యక్రమాలను విజయవంతం చేయాలి” అని పిలుపునిచ్చారు.
కేటీఆర్‌కు ఘన స్వాగతం
చేవెళ్లలో నిర్వహించిన సమావేశానికి పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కేటీఆర్‌కు గజమాలలతో సత్కారం చేసి ఘన స్వాగతం పలికారు. బాణాసంచా కాలుస్తూ ర్యాలీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, పట్లోళ్ల కార్తీక్ రెడ్డి, షాబాద్ మాజీ జడ్పీటీసీ పట్నం అవినాష్ రెడ్డి, సభ్యత్వ నమోదు ఇన్‌చార్జ్ రాంబాబు యాదవ్, నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.






