తన వైఫల్యం నుంచి దృష్టి మళ్లించడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారింది: హరీష్ రావు

by Malleboina Mahesh |   (  Updated:2025-03-04 12:17:24  IST  )

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి.. తన వైఫల్యం నుంచి దృష్టి మళ్లించడం ఒక అలవాటుగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు.

తన వైఫల్యం నుంచి దృష్టి మళ్లించడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారింది: హరీష్ రావు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి.. తన వైఫల్యం నుంచి దృష్టి మళ్లించడం ఒక అలవాటుగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు (Former minister Harish Rao) ట్వీట్ చేశారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సీఎం రేవంత్ ఆధివారం సందర్శించారు. అనంతరం అక్కడే మీడియాతో మాట్లాడుతూ..గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. వారి నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని.. కావాలనే ఇప్పుడు రాజకీయం చేస్తున్నారని సీఎం ఫైర్ అయ్యారు. అలాగే హరీష్ రావు దుబాయ్ వెళ్లడంపై కూడా విమర్శలు చేశారు. కాగా టన్నెల్ వద్ద సీఎం చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్ రావు స్పందిస్తూ.. ఇలా ట్వీట్ చేశారు.

"మోకాలికి బోడి గుండుకు ముడివేసి మోసగించడం, తన వైఫల్యం నుంచి దృష్టి మళ్లించడం రేవంత్ రెడ్డికి అలవాటుగా మారింది. కర్తవ్యం మరిచి ఎన్నికల్లో రాజకీయాలలో మునిగితేలిన ముఖ్యమంత్రి. నేను నా సన్నిహిత మిత్రుడు దుబ్బాక శాసనసభ్యులు కూతురు పెళ్లి ఫంక్షన్ కోసం అబుదాబి వెళితే దాన్ని వివాదం చేయడానికి ప్రయత్నించడం అతని నీచత్వానికి పరాకాష్ట. ప్రభుత్వాన్ని నడుపుతున్నది రేవంత్.. ప్రమాద స్థలానికి వెంటనే వెళ్ళవలసింది రేవంత్. కానీ సీఎం బాధ్యత మరచి ఎలక్షన్ ప్రచారానికి ప్రాధాన్యత ఇచ్చి ఇప్పుడు ప్రతిపక్షం మీద నా మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాడు. నేను అబుదాబి కి వెళ్ళింది క్రికెట్ మ్యాచ్లు చూడడానికో, విహారయాత్రలకు, విలాసాలకో కాదు. నా సన్నిహిత మిత్రుడైన కొత్త ప్రభాకర్ రెడ్డి బిడ్డ పెండ్లి ఫంక్షన్ కి హాజరవ్వడానికి వెళ్లాను.

హెలికాప్టర్ తీసుకొని ప్రమాద స్థలానికి రాకుండా ఎన్నికల ప్రచారానికి పోయింది ఎవరు? ప్రమాద స్థలానికి చేరుకోవడానికి హెలికాప్టర్ లేదని నీటిపారుదల శాఖ మంత్రి పోకుండా హైదరాబాదులో ఉన్నాడు. ప్రభుత్వంలో ఉండి కూడా బాధ్యత మరచి ప్రవర్తించిన వాళ్ళు, కనీస మానవ విలువలు పాటించకుండా ప్రవర్తించిన వాళ్లు, ప్రతిపక్ష శాసనసభ్యున్నయినా నన్ను ఆడిపోసుకుంటున్నారు. నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడితే చెల్లదు. నువ్వేంటో నేనేంటో ప్రజలు గమనిస్తున్నారు. ముఖ్యమంత్రిగా శాంతి భద్రతల మీద దృష్టి సారించకుండా ప్రతిపక్ష నాయకుల కదలికలను తెలుసుకోవడానికి ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారని" ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్ అవుతూ ట్వీట్ చేశారు.

Next Story