Revanth Reddy: కేసీఆర్ పై డోస్ పెంచిన రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ ఆయువుపట్టు పై దెబ్బకొట్టేలా ప్లాన్

by Prasad Jukanti |   (  Updated:2025-07-10 08:08:42  IST  )

Revanth Reddy: కేసీఆర్ పై డోస్ పెంచిన రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ ఆయువుపట్టు పై దెబ్బకొట్టేలా ప్లాన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇరిగేషన్ ప్రాజెక్టులపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య పొలిటికల్ వార్ ముదురుతోంది. సవాళ్ల పర్వంతో మొదలైన రాజకీయం కాస్త ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ (PPT) వార్ కు చేరింది. గోదావరి, కృష్ణా నదులపై ప్రాజెక్టులు, వాటాల విషయంలో కాంగ్రెస్- బీఆర్ఎస్ మధ్య పోటాపోటీగా పీపీటీలు సాగుతున్నాయి. ఈ క్రమంలో అనూహ్యంగా బీఆర్ఎస్ పై మాజీ సీఎం కేసీఆర్ పై (KCR) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) డోస్ పెంచడం స్టేట్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అవుతున్నది. తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటాల విషయంలో అవసరం అయితే దేవుడిని సైతం ఎదిరిస్తామన్న రేవంత్ రెడ్డి.. తలా తోక లేకుండా మాట్లాడితే తోక కత్తిరిస్తానంటూ ప్రతిపక్ష పార్టీని హెచ్చరించారు. దీంతో తెలంగాణలో జల జగడం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట్లో మరింత రక్తి కట్టిస్తోంది.

బీఆర్ఎస్ పై బిగ్ ప్లాన్:

నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో ఏర్పడిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర రాజకీయం ఇప్పుడు నీళ్ల పంచాయితీ చుట్టూ తిరుగుతోంది. నీళ్ల విషయంలో బీఆర్ఎస్ వాదనను తొలుత నోటి మాటగా ఖండించిన అధికార పక్షం క్రమంగా డోస్ పెంచుతోంది. ఈ విషయంలో ఇప్పటికే రెండు సార్లు పీపీటీ నిర్వహించిన ప్రభుత్వం తాజాగా నిన్న మరోసారి ప్రజెంటేషన్ నిర్వహించింది. దీంతో ప్రభుత్వం వరుసగా పీపీటీలను నిర్వహించడం వెనకు మతలబు ఏంటి అనే టాక్ పొలిటికల్ వర్గాల్లో ఆసక్తిగా మారింది. అయితే నీటి విషయంలో తమకున్న అవగాహన కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదని బీఆర్ఎస్ పదే పదే విమర్శలు గుప్పిస్తోంది. కేసీఆర్ అధికారం కోల్పోయాక రేవంత్ రెడ్డి సర్కార్ పై చేసిన తొలి పోరాటం కూడా నీటి విషయంపైనే. కృష్ణాజలాల్లో తెలంగాణ హక్కుల పరిరక్షణ పేరుతో బహిరంగ సభను నిర్వహించింది. అయితే బీఆర్ఎస్ పార్టీ ఏ నీటి విషయం తమకు ఆయువు పట్టు అని భావిస్తున్నదో దానిపైనే దెబ్బకొట్టేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారని అందులో భాగంగానే ప్రభుత్వం వ్యూహాత్మకంగా వరుస పీపీటీలను నిర్వహిస్తాందనే చర్చ జరుగుతోంది. తెలంగాణ నీటి హక్కుల విషయంలో తన హయాంలో కేసీఆర్ నిర్లక్ష్యాన్ని, అధికారిక చర్చలను రోజు రోజుకు బహిర్గతం చేస్తూ వస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.

కేసీఆర్ టార్గెట్ గా వ్యూహం:

కాళేశ్వరం పేరుతో ఉమ్మడి రాష్ట్రంలో మొదలైన ప్రాజెక్టులను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని దాంతో కృష్ణా జలాల్లో తెలంగాణ తన పూర్తి వాటా ఉపయోగించుకోలేని పరిస్థికి తెచ్చారని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అంతే కాకుండా తెలంగాణకు కృష్ణాజల్లాల్లో 34 శాతం వాటా సరిపోతుందంటూ కేసీఆర్, హరీశ్ రావు లిఖితపూర్వకంగా రాసిచ్చారని అందుకు సంబంధించిన సమావేశాలు వాటి వివరాలు తేదీలతో సహా బహిర్గతం చేస్తోంది. ఇదే విషయాన్ని అసెంబ్లీలో చర్చకు వస్తే చర్చించి నిరూపిస్తామని వాదిస్తోంది. కానీ బీఆర్ఎస్ వైపు నుంచి కేసీఆర్ కాకుండా కేటీఆర్, హరీశ్ రావు మీడియా ముందుకు వస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లగా కేటీఆర్ ప్రెస్ క్లబ్ లో చర్చ పేరుతో హడావిడి చేయడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యమంత్రి రాలేడని తెలిసే కేటీఆర్ ఈ డ్రామా ఆడుతున్నారంటూ కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తోంది. అయితే ఢిల్లీ నుంచి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి వెంటనే పీపీటీలో హాజరై స్ట్రాంగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి రావాలని లేదంటే మేమే ఫామ్ హౌస్ కు వచ్చి మాక్ అసెంబ్లీ నిర్వహింస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదనేది ఇప్పటికే ప్రజల్లో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నీటి విషయంలో ఇంత రచ్చ జరుగుతుంటే కేసీఆర్ కనీసం మీడియా ముందుకు రాకపోవడం పట్ల సొంత పార్టీలోనే అసంతృప్తి ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన సందర్భంలోనూ మీడియాతో మాట్లాడకుండానే కేసీఆర్ వెళ్లిపోయారు. అసలేం జరిగిందో వివరిస్తూ తనకున్న అనుభవంతో రేవంత్ రెడ్డి సర్కార్ ను ఇరుకున పెడతారని భావించిన గులాబీ నేతలకు కేసీఆర్ మౌనం మరింత నిరాశకు గురిచేస్తోందట. నీటి హక్కుల విషయంలో కాంగ్రెస్ చేస్తున్న వాదన అబద్ధమే అయితే కేసీఆర్ అసెంబ్లీకి వెళ్లి వాస్తవాలు వివరించవచ్చుకదా అనే వాదన క్రమంగా ప్రజల్లో బలపడే అవకాశాలు లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఓ వైపు కేసీఆర్ మౌనం మరో వైపు రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వరుస పీపీటీలతో దూకుడు ప్రదర్శిస్తున్నారనే చర్చ జరుగుతోంది. మరి ఈ తాజా పరిణామాలు రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో ఎవరిపై ఎలాంటి ఇంపాక్ట్ చూపనున్నది అనేది వేచి చూడాలి.

Next Story