కేరళం సీఎంగా ఎంపికైన వీడీ సతీశన్‌కు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ శుభాకాంక్షలు

by Naga Rani Yarlagadda |

కేరళం ముఖ్యమంత్రిగా ఎంపికైన వీడీ సతీశన్‌కు తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.

కేరళం సీఎంగా ఎంపికైన వీడీ సతీశన్‌కు సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ శుభాకాంక్షలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేరళం ముఖ్యమంత్రిగా ఎంపికైన వీడీ సతీశన్‌కు తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేర‌కు గురువారం ఆయ‌న మీడియాకు ఒక ప్రక‌ట‌న విడుద‌ల చేశారు. కేరళం ప్రజ‌ల‌కు దశాబ్దాలుగా సేవ చేస్తూ, విలువలతో కూడిన‌ రాజకీయాలు చేసే సతీశన్‌కు ఈ పదవి రావడం సముచిత గుర్తింపు అని సీఎం రేవంత్ అభిప్రాయ‌ప‌డ్డారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధికి మద్దతుగా విస్తృతంగా ప్రచారం చేసిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు అధికార బాధ్యతలు అప్పగించారని అన్నారు. విద్య, వైద్యం, అక్షరాస్యతలో కేరళం దేశానికి ఆదర్శంగా నిలిచిందని రేవంత్ రెడ్డి అన్నారు. సతీశన్ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి సాధిస్తుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి, పర్యాటకం, పరస్పర సహకారం వంటి రంగాల్లో కేరళం ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేరళం మరింత ప్రగతి, సుసంపన్నత దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తున్నట్లుగా ఆయన తెలిపారు.

ప్రజా స్వరంగా నిలిచిన నాయకుడు సతీశన్ : టీపీసీసీ చీఫ్

కేరళ రాష్ట్ర సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న వీడి సతీశన్‌కు టీపీసీసీ చీఫ్​మహేష్ కుమార్ గౌడ్ హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు ఆయన గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజా స్వరంగా నిలిచిన నాయకుడు సతీశన్ అని మహేష్ కుమార్ గౌడ్ కొనియాడారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన నేతలకు ఎప్పటికప్పుడు గుర్తింపు లభిస్తుందనే విషయాన్ని కేరళ ముఖ్యమంత్రి ఎంపిక మరోసారి స్పష్టం చేసిందన్నారు.

Next Story