మెట్రో సెకండ్ ఫేజ్‌ను అడ్డుకుంటోంది కిషన్ రెడ్డే : సీఎం రేవంత్

by Naga Rani Yarlagadda |

మెట్రో సెకండ్ ఫేజ్‌ను అడ్డుకుంటోంది కిషన్ రెడ్డే : సీఎం రేవంత్
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్ విస్తరణ ప్రారంభం కావాలంటే.. ఎల్అండ్ టీ నుంచి ఫస్ట్ ఫేజ్ మెట్రోను ప్రభుత్వం టేకోవర్ చేసుకోవాల్సిందేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఇందుకోసం ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ను రుణం కోరామని.. తీరా అది మంజూరయ్యేసరికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అడ్డు తగిలారని ఆరోపించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. కిషన్ రెడ్డి తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సెకండ్ ఫేజ్ విస్తరణకు ఎల్ అండ్ టీ ససేమిరా ఒప్పుకోవడం లేదని, ఫస్ట్ ఫేజ్ మెట్రోతోనే ఏటా రూ.400 కోట్ల నష్టాలు వస్తున్నట్లు చెప్పిందని తెలిపారు. సంస్థకు ఎన్నివిధాలుగా చెప్పినా భాగస్వామ్యం కాబోమని తెలిపిందన్నారు.

ఎల్ అండ్ టీ నుంచి మెట్రో కొంటేనే సమస్య తీరుతుందని కేంద్రం చెప్పిందన్న సీఎం.. కొనుగోలులో యూపీ మెట్రో ఎండీ సుశీల్ కుమార్ ను కూడా సభ్యుడిగా చేసిందన్నారు. రూ.30 వేల కోట్ల ఎల్ అండ్ టీ ఆస్తుల్ని రూ.15 వేల కోట్లకు కొనుగోలు చేశామని పేర్కొన్నారు. ప్రస్తుతం మెట్రోకు కిలోమీటర్ కు రూ.350 కోట్ల నిర్మాణ ఖర్చు అవుతుందని అంచనాలు ఉన్నాయని తెలిపారు. మెట్రో రైల్ నిర్మాణంలో కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని సీఎం రేవంత్ ఆరోపించారు. మెట్రోను మూడేళ్లు డిలే చేయడంతో అంచనాలు రూ.7 వేలకోట్లకు పెరిగాయని, ప్రజా అవసరాలకు తగ్గట్లు మెట్రో నిర్మాణం జరగలేదని దుయ్యబట్టారు. సెకండ్ ఫేజ్ మెట్రో విస్తరణకు అనుమతిపై కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చినా.. అడుగడుగునా ఆటంకాలే వస్తున్నాయన్నారు.

గత ప్రభుత్వం చాలా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించింది. మెట్రో కూడా రైల్వే కిందికి వస్తుందని కేంద్రాన్ని అప్పు అడిగామని, IRFC రుణం కోసం అంతా రెడీ చేశామని, తీరా అకౌంట్లోకి వచ్చే సమయానికి కిషన్ రెడ్డి అడ్డుపడ్డారని ఆరోపించారు. మే 30 నాటికి కేంద్రం నుంచి డబ్బు రావలసి ఉంది కానీ కేంద్రం నుంచి రావలసిన రూ.13,600 కోట్లకు కిషన్ రెడ్డి అడ్డుపడ్డారని దుయ్యబట్టారు. కేవలం 4 శాతం వడ్డీకి రుణం తెచ్చుకుంటే.. దానిని రాకుండా చేశారన్నారు. రూ.84 కోట్లు పేపర్ ఫీజు చెల్లించామని, రూ.1400 కోట్లు ఈక్విటీ కూడా చెల్లించామని సీఎం రేవంత్ తెలిపారు. గత నెల 21న కిషన్ రెడ్డి అశ్వినీ వైష్ణవ్ ను కలిసి తెలంగాణలో బీజేపీ ఉండాలా వద్దా అని నిలదీసి.. అప్పు ఇవ్వకుండా ఆపేశారని వాపోయారు. సమస్యలపై మాట్లాడుదామంటే కిషన్ రెడ్డి టైమ్ ఇవ్వరన్నారు. కిషన్ రెడ్డి వెనుక కేటీఆర్ ఉన్నారని, కేటీఆర్ చెప్పిందే ఆయన గుడ్డిగా చేస్తున్నాడని ఆరోపించారు. జపాన్ నుంచి నిధులొచ్చినా కేంద్రం వాటిని మనకి ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రంపై ఎంతటి వివక్ష ఉందో ఇక్కడే అర్థమవుతోందన్న సీఎం.. ఇప్పటికైనా మెట్రోకు నిధులు ఇప్పించి, NOC ఇస్తే శాలువా కప్పి సన్మానం చేస్తామన్నారు. కేంద్రం భాగస్వామ్యం లేకుండా రూ.40 వేల కోట్లతో మెట్రో విస్తరణ తామే చేసుకుంటామని NOC కోరినా ఇవ్వలేదని వాపోయారు. నిధులు ఇప్పించకపోయినా.. NOC అయినా ఇప్పిస్తే చాలని కోరారు. మెట్రో విస్తరణపై ఇప్పటికైనా కిషన్ రెడ్డి బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Next Story