రేవంత్‌కు రచ్చ చేయడం తెలుసు.. చర్చ చేయడం రాదు: కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-08 06:36:59  IST  )

రాష్ట్రంలో రైతు సంక్షేమంపై చర్చకు రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాలు విసిరిని విషయం తెలిసిందే.

రేవంత్‌కు రచ్చ చేయడం తెలుసు.. చర్చ చేయడం రాదు: కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రైతు సంక్షేమంపై చర్చకు రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి విసిరిన సవాలు విసిరిని విషయం తెలిసిందే. అయితే, ఆ సవాలును స్వీకరించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ చెప్పినట్లుగానే ఇవాళ ఉదయం సరిగ్గా 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌నకు చేరుకున్నారు. సీఎం రాక కోసం కాసేపు వేచి చూసి కేటీఆర్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కాంగ్రెస్ నోటికొచ్చినట్లుగా హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని అన్నారు. ఆరు గ్యారంటీలు అన్నారని.. బాండ్ పేపర్లు రాసిచ్చారని ఎద్దేవా చేశారు. బూతులు మాట్లాడరే తప్ప.. 18 నెలలుగా చేసిందేమి లేదని ఫైర్ అయ్యారు. దేశానికి అన్నం పెట్టే రైతులను కూడా మోసం చేశారని ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలను నెరవేర్చుకుండా పదే పదే రంకెలు వేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఇదే రేవంత్ రెడ్డి సవాళ్లు విసిరి మాట తప్పారని తెలిసినా.. రైతు సంక్షేమంపై చర్చకు సవాలును స్వీకరించామని అన్నారు. చర్చకు సీఎం రాకపోయినా.. మంత్రులైనా వస్తారని అనుకున్నామని కామెంట్ చేశారు. రేవంత్‌కు రచ్చ చేయడం తెలుసు చర్చ చేయడం రాదని సెటైర్లు వేశారు.

చంద్రబాబు కొవర్టు పాలన నడుస్తోంది..

తెలంగాణలో నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ ఉద్యమం జరిగిందని, కానీ ఈ రేవంత్ పాలనలో నీళ్లు కూడా ఆంధ్రాకు తరలిపోతున్నాయని కేటీఆర్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో చంద్రబాబు కోవర్టు పాలన నడుస్తుందని అన్నారు. తెలంగాణ రైతులను మోసం చేస్తూ నీళ్లు ఏమో గురువు చంద్రబాబుకు, నిధులు ఢిల్లీకి, నియామకాలు రేవంత్ రెడ్డి తొత్తులకి పోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి యూరియా బస్తాల కోసం ఢిల్లీ వెళ్లారని చెబుతున్నారని.. ఢిల్లీ పెద్దల కోసం రేవంత్ ఏం బస్తాలు తీసుకెళ్లారో అందరికీ తెలుసని అన్నారు. బనచర్ల కడుతుంతే పచ్చజెండా ఊపుతున్నారని తెలిపారు. ఎప్పటికప్పుడు పేమెంట్లు ఇస్తూనే తన పదవిని రేవంత్ కాపాడుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఎమర్జెన్సని తలపించేలా తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం కొనసాగుతోందని, రేవంత్‌కు వాత పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ అన్నారు.

ఇంకోసారి పనికిమాలిన డైలాగులు, సవాళ్లు వద్దు..

రైతు సంక్షేమంపై చర్చకు సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి రమ్మన్నా సరేనని కేటీఆర్ మరోసారి సవాల్ విసిరారు. రేవంత్ స్థాయికి కేసీఆర్ అవసరం లేదని.. తాము చాలని అన్నారు. దమ్ము, నిజాయితీ ఉంటే చర్చకు రావాలని.. లేదంటే ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అసెంబ్లీలో మైకులు కట్ చేయకుండా ఉంటే అసెంబ్లీలోనూ డిబేట్‌కు సిద్ధమని అన్నారు. ఇలా చర్చకు వచ్చే సత్తా లేకపోతే.. ఇంకోసారి పనికిమాలిన డైలాగులు, సవాళ్లు విసరొద్దని కేటీఆర్ హితవు పలికారు.

Next Story