- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఖర్గే సీటుపైనే రేవంత్ కన్నేశాడు: ఏలేటి మహేశ్వర్ రెడ్డి హాట్ కామెంట్స్
నియోజకవర్గాల పునర్విభజన చట్టాలు చేసింది కాంగ్రెస్ పార్టీనే అని బీజేేపీ శానససభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన అంశంపై బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఇవాళ హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డీలిమిటేషన్ చట్టాలను గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే చేసిందని, ఇప్పుడు ఆ పార్టీ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. 1972లో కాంగ్రెస్ పార్టీ చేసిన డీలిమిటేషన్ వల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒక లోక్‌సభ సీటు తగ్గిందని మహేశ్వర్ రెడ్డి గుర్తు చేశారు. జనాభా ప్రాతిపదికన ప్రాతినిధ్యం ఉండాలని రాజ్యాంగమే చెబుతోందని, ఆనాడు కాంగ్రెస్ చేసిన పొరపాట్ల వల్లే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం లోక్‌సభలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం కేవలం 24 శాతానికే పరిమితమైందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
మహిళా రిజర్వేషన్లపై క్లారిటీ..
మహిళా రిజర్వేషన్ల అమలుపై స్పందిస్తూ.. ప్రస్తుతం ఉన్న సీట్ల సంఖ్యతో రిజర్వేషన్లు అమలు చేస్తే మహిళలకు కేవలం 170 సీట్లు మాత్రమే వస్తాయని, అదే సీట్లు పెంచిన తర్వాత అమలు చేస్తే ఆ సంఖ్య 270 దాటుతుందని ఆయన లెక్కలతో వివరించారు. మహిళలకు చట్టసభల్లో సరైన గౌరవం దక్కాలంటే సీట్ల పెంపు అనివార్యమని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచిస్తున్న విధానాలపై మహేశ్వర్ రెడ్డి తీవ్ర స్థాయిలో సెటైర్లు వేశారు. ప్రపంచంలో ఎక్కడా లేని ‘హైబ్రిడ్ పాలసీని’ రేవంత్ రెడ్డి కనిపెట్టారని, దీన్ని తాను ‘గాంధీ డీలిమిటేషన్ ప్రాసెస్ (GDP)’ అని పిలుస్తానని ఎద్దేవా చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా అన్ని రాష్ట్రాల్లో 50 శాతం పెంపు విధానం గురించి రేవంత్ మాట్లాడుతుండటం హాస్యాస్పదమని పేర్కొన్నారు.
ఖర్గే సీటుపై రేవంత్ కన్ను..
రాజకీయంగా రేవంత్ రెడ్డి లక్ష్యాలపై మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టి ఇప్పుడు తెలంగాణపై కంటే మల్లికార్జున ఖర్గే సీటుపైనే ఎక్కువగా ఉందని విమర్శించారు. ఖర్గే తర్వాత ఎలాగైనా ఏఐసీసీ (AICC) అధ్యక్ష పదవిని దక్కించుకోవాలనే ప్లాన్‌తోనే రేవంత్ రెడ్డి ఇలాంటి వింతైన ప్రతిపాదనలు తెరపైకి తెస్తున్నారని ఆయన ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాల హక్కుల కోసం బీజేపీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని మహేశ్వర్ రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు.






