మార్పుకు నిదర్శనం రేవంత్ ​ప్రభుత్వం : మంత్రి తుమ్మల

by Muthe.Rajitha |

రాష్ట్రంలో మార్పుకు నిదర్శనం రేవంత్​ప్రభుత్వమని, పామాయిల్​పంటకు ఏడాదిలో రూ. 8500 పెంచిన ఘనత తమ సర్కార్​కే దక్కుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు.

మార్పుకు నిదర్శనం రేవంత్ ​ప్రభుత్వం : మంత్రి తుమ్మల
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో మార్పుకు నిదర్శనం రేవంత్​ ప్రభుత్వమని, పామాయిల్​ పంటకు ఏడాదిలో రూ. 8500 పెంచిన ఘనత తమ సర్కార్​కే దక్కుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పేర్కొన్నారు. గతం కంటే సాగు విస్తీర్ణం పెరిగిందని, అంచనాలకు మించిన దిగుబడులు, అన్ని పంటలనను మద్ధతు ధరతో కొనుగోలు చేశామన్నారు. బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ సన్నాలు వేస్తే ఉరి అన్న పరిస్థితుల నుండి సన్నాలకు బోనస్ ఇచ్చి, అవి పేద కుటుంబాలకు రేషన్​ ద్వారా పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. సంవత్సర కాలంలోనే రైతు అకౌంట్లలో నేరుగా ఇప్పటికే రూ. 34,667 కోట్లు జమ చేయడం ఒక సువర్ణ అధ్యాయం లిఖించుకున్నామన్నారు.

ఈ ప్రజా ప్రభుత్వంపై అధికారం కోల్పోయిన కల్వకుంట్ల కుటుంబ సభ్యులు వారి అక్కసును మింగలేక, కక్కలేక రైతాంగం పేరుతో చేస్తున్న అసత్య ప్రచారం రైతులు నమ్మే స్థితిలో లేరని తెలుసుకుంటే మంచిదని సూచించారు. రైతుబంధు చెల్లిస్తున్నామనే పేరుతో రైతులకు మిగిలిన పథకాలైన యంత్ర లక్ష్మి, ఇన్ ఫుట్ సబ్సిడీ, విత్తన సబ్సిడీ, ప్రకృతి విపత్తుల సమయంలో పరిహారం, పంటల భీమా లాంటి అనేక రైతు పథకాలను కాలగర్భంలో కలిపేశారని మండిపడ్డారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరిగి ఆ పథకాలన్నింటినీ పునరుద్ధరిస్తున్నామని తెలిపారు. రైతుబంధు పేరుతో రూ.5వేలు ఇచ్చి, వివిధ సబ్సిడీ పథకాల కింద రైతులకు దక్కాల్సిన రూ.15వేల లబ్ధి బీఆర్​ఎస్​పాలనలో ఎగనామం పెట్టారని, తాము రైతు భరోసా రూ.12 వేలు ఇవ్వడంతో పాటు, ఈ పథకాలన్నింటిని పునరుద్ధరించి రైతును రాజును చేసే ప్రయత్నం చేస్తుండటంతో వారికి ఏడుపుగా ఉందన్నారు.

వారి హయాంలో పామాయిల్ సాగును పట్టించుకున్న పాపాన పోలేదు. ఇష్టారీతిన అనేక కంపెనీలకు అనుమతులు ఇచ్చి పామాయిల్ సాగును కుంటుపడేశారని మండిపడ్డారు. మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు భీమా కొనసాగిస్తూ, వారు చెల్లించాల్సిన ప్రీమియం కూడా చెల్లించి ఉచిత కరెంట్ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. బీఆర్​ఎస్​నేతలు విమర్శిస్తే రైతులు నిజానిజాలు తెలుసుకుంటారని మేలు చేసింది ఎవరు, కీడు చేసింది అనేది వారికి తెలుసుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఓడించి బయట తిరగకుండా చేశారని, ఇప్పటికైనా ఇలాంటి కళ్లబొళ్లి కబుర్లు చెప్పడం మానేసి, అనవసరమైన విమర్శలు చేయడం మానుకుంటే మంచిదని హితువు పలికారు.

Next Story