- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేసీఆర్ స్కెచ్ కు రేవంత్ చెక్!.. కోదండరాంకు మళ్లీ ఎమ్మెల్సీ కామెంట్స్ వెనుక వ్యూహం ఇదేనా?
రేవంత్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తానొకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది అనే సామెత రాజకీయాల్లో నిత్యం వర్తిస్తుంది. నాయకులు, పార్టీలు ఒక ఆలోచనతో ఉంటే క్షేత్రస్థాయిలో పరిస్థితులు మరోలా ఎదురవుతుంటాయి. ఇటీవల టీజేఎస్ చీఫ్ కోదండరాం ఎమ్మెల్సీ రద్దు విషయంలో అచ్చం ఇదే జరుగుతోందా అనే టాక్ వినిపిస్తోంది. కోదండరాం ఎమ్మెల్సీ పదవి రద్దు కావడం పట్ల బీఆర్ఎస్ హర్షం వ్యక్తం చేస్తోంది. ఇది కాంగ్రెస్ కు చెంపపెట్టులాంటి తీర్పు అని కామెంట్ చేస్తోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాత్రం కోదండరాంను మళ్లీ ఎమ్మెల్సీగా చేయబోతున్నామని స్పష్టం చేశారు. ఇవాళ ఓయూలో పర్యటించిన సందర్భంగా తిరిగి 15 రోజుల్లో ఎమ్మెల్సీగా కోదండరాంను (Prof. Kodandaram) పంపిస్తామని, ఈ సారి ఎవడు అడ్డు వస్తారో చూద్దాం అంటూ హాట్ కామెంట్స్ చేశారు. కుట్ర చేసి కోట్లాది రూపాయలు పెట్టి పెద్ద పెద్ద న్యాయవాదులను రంగంలోకి దింపి కోదండరాం పదవిని సుప్రీంకోర్టులో కొట్టివేయించారని ఇదేం శునకానందం అంటూ సీఎం మండిపడ్డారు. అయితే సీఎం తాజాగా వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ వయా కోదండరాం మధ్య 'రాజకీయం' అనే చర్చ ఆసక్తిని రేపుతోంది.
కేసీఆర్ వ్యూహాలకు చెక్:
గతేడాది ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేసిన కోదండరాంతో పాటు అమీర్ అలీఖాన్ నియామకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. కానీ బీఆర్ఎస్ మాత్రం కోదండరాం నే టార్గెట్ చేసింది. కేసీఆర్ ను (KCR) విభేదించినందుకు తగిన శాస్తి జరిగిందంటూ ఆ పార్టీ మద్దతు దారులు సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు. అయితే కోదండరాం విషయంలో సక్సెస్ అయ్యామని ఇక పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల విషయంలోనూ తమకు అనుకూలమైన తీర్పు వస్తుందనే ధీమాతో బీఆర్ఎస్ వ్యహరిస్తోందనే టాక్ వినిపిస్తోంది. కోదండరాం పదవి రద్దు తమ విజయంగా బీఆర్ఎస్ చెప్పుకుంటున్న పరిస్థితుల్లో తిరిగి ఆయన్ను ఎమ్మెల్సీగా పంపిస్తామని ప్రకటించడం వెనుక బీఆర్ఎస్ జోష్ కు రేవంత్ రెడ్డి బ్రేకులు వేసే వ్యూహంలో భాగమే అన్న టాక్ వినిపిస్తోంది. అలాగే పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ చూపిస్తున్న ఉత్సాహానికి సీఎం వైపు నుంచి ఆన్సర్ ఇదేనా అనే చర్చ కూడా వినిపిస్తోంది.
ఉప ఎన్నికపై సవాల్:
రాష్ట్రంలో పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల విషయంలో రాజకీయం రంజుగా మారింది. పార్టీ ఫిరాయించిన 10 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సాధ్యమైనంత త్వరగా లేదా మూడు నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో త్వరలో రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరగబోతున్నాయని అక్కడ మన సత్తా ఏంటో చూపిద్దామని కేటీఆర్ పదే పదే చెప్పడం పొలిటికల్ హీట్ ను పెంచుతోంది. సుప్రీం ఆదేశాల నేపథ్యంలో ఇప్పటికే ఐదుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారని తెలుస్తోంది. దీంతో ఉప ఎన్నికలు అనివార్యం అనే ప్రచారం మరింత బలపడుతోంది. ఈ క్రమంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా తమకు ప్రత్యర్థులకు పై చేయి ఉండకుండా చేయడమే తన లక్ష్యం అనే సంకేతాలు ఇచ్చేందుకే సీఎం కోదండరాం అంశం రూపంలో హింట్ ఇచ్చారనే టాక్ కాంగ్రెస్ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. మొత్తంగా సీఎం వ్యాఖ్యల వ్యవహారం ఎలా ఉన్నా కోదండరాం, మీర్ అలీఖాన్ ఎమ్మెల్సీల పదవికి సంబంధించిన కేసు వచ్చే నెల 17న సుప్రీంకోర్టులో విచారణకు రాబోతున్నది. అప్పుడు సర్వోన్నత న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నది అనేది ఉత్కంఠగా మారింది.






