‘2034 వరకు సీఎంగా రేవంత్..? పగటి కలలే’ : డీకే అరుణ సెటైర్లు

by Ramesh Naini |

రాష్ట్రంలో తానే 2034 వరకు ముఖ్యమంత్రిగా ఉంటానని, తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ప్రజా సమస్యలపై కంటే పగటి కలలపై ఎక్కువ దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తోందని ఎంపీ డి.కె. అరుణ ఎద్దేవా చేశారు.

‘2034 వరకు సీఎంగా రేవంత్..? పగటి కలలే’ : డీకే అరుణ సెటైర్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో తానే 2034 వరకు ముఖ్యమంత్రిగా ఉంటానని, తర్వాత జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ప్రజా సమస్యలపై కంటే పగటి కలలపై ఎక్కువ దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తోందని ఎంపీ డి.కె. అరుణ ఎద్దేవా చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు, గ్యారంటీలు, వాగ్ధానాలు ఏం అమలు చేశారో చెప్పాలని డిమాండ్​ చేశారు. ఆరు గ్యారంటీలు అంటూ అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఆ హామీల అమలులో పూర్తిగా విఫలమై ప్రజలను రేవంత్​ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. ఈ ప్రభుత్వం మీద రైతులు, నిరుద్యోగులు, మహిళలు, ఉద్యోగులు వంటి ప్రతి వర్గం అసంతృప్తితో ఉందన్నారు. శనివారం ఒక ప్రకటనలో పేర్కొంటూ అసమర్థ పాలన, ప్రజా సమస్యలను పట్టించుకోని తీరు చూసి ప్రజలు తీవ్రంగా విసిగిపోయారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కొంత అనుకూల ఫలితాలు వచ్చాయని వాపును చూసి బలుపు అనుకుంటున్నారు.. ప్రజల అసలు తీర్పు వచ్చే రోజులు ముందున్నాయని అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో తెలుస్తుందన్నారు.

రేవంత్ రెడ్డి మర్చిపోవద్దు..

రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, వరుసగా మూడు సార్లు దేశ ప్రజలు ఎన్డీయే ప్రభుత్వానికే భారీ మెజారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని దేశ ప్రజలు పదేపదే తిరస్కరిస్తున్నారు. ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి చవి చూస్తున్న వాస్తవాన్ని రేవంత్ రెడ్డి మర్చిపోవద్దని గుర్తు చేశారు. అసలు 2034 వరకు కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉంటుందా లేక పూర్తిగా పతనమవుతుందా అన్నదే ప్రశ్నగా మారింది. అలాంటి పరిస్థితిలో రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని, తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తానని చెప్పడం ప్రజలకు నవ్వు తెప్పించే వ్యాఖ్యలేనన్నారు. ముఖ్యమంత్రి ముందు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోని తర్వాత భవిష్యత్ రాజకీయాల గురించి మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుంది.. ఇప్పుడు మాత్రం మీ మాటలు ‘ముంగేరీలాల్ కే హసీన్ సప్నే’లను గుర్తు చేస్తున్నాయని పేర్కొన్నారు.

Next Story