- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘గత ప్రభుత్వం పట్టించుకోలేదు’.. కాంగ్రెస్ ప్రభుత్వమైనా స్పందించాలని అధికారుల విజ్ఞప్తి
పురపాలక శాఖలో ప్రమోషన్లు, కేడర్ మార్పుల కోసం అధికారులు కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. అనేకమంది ప్రమోషన్స్ రాకుండానే రిటైర్మెంట్ అవుతున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: పురపాలక శాఖలో ప్రమోషన్లు, కేడర్ మార్పుల కోసం అధికారులు కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. అనేకమంది ప్రమోషన్స్ రాకుండానే రిటైర్మెంట్ అవుతున్నారు. సెలెక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ నుంచి అడిషనల్ డైరెక్టర్ వరకు వెళ్లాలంటే.. రీజినల్ డైరెక్టర్ పోస్టులు అడ్డంకిగా మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రీజినల్ డైరెక్టర్ కేడర్‌ను అడిషనల్ డైరెక్టర్‌గా మార్చాలని గత ప్రభుత్వానికి పురపాలకశాఖ కమిషనరేట్ లేఖ రాసింది. అయినా ఎలాంటి ప్రకటన రాకపోవడంతో అధికారులు నిరాశతో ఉన్నారు.
రెండు పోస్టులు మాత్రమే ఉండడంతో..
పురపాలకశాఖ కమిషనరేట్ లో చాలా మంది అధికారులు సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ వరకు వెళ్లి ప్రమోషన్ రాకుండానే పదవీ విరమణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అందుకు రీజినల్ డైరెక్టర్ పోస్టు అడ్డంకిగా మారిందని అధికారులు చెబుతున్నారు. సెలెక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ 39 పోస్టులు, రీజినల్ డైరెక్టర్ పోస్టులు రెండు, అడిషనల్ డైరెక్టర్ పోస్టులు 10 ఉన్నాయి. ప్రస్తుతం ఆరు అడిషనల్ డైరెక్టర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుకు సంబంధించిన ప్రమోషన్ రావాలంటే ముందుగా రీజినల్ డైరెక్టర్ గా పనిచేయాలి. కానీ రీజినల్ డైరెక్టర్ పోస్టులు రెండు మాత్రమే ఉన్నాయి. ముగ్గురు సెలక్షన్ గ్రేడ్ మున్సిపల్ కమిషననర్లకు ప్రమోషన్ అర్హత ఉన్నా.. ఇద్దరికి మాత్రమే ఇవ్వగలుగుతాం. మూడో వ్యక్తికి అర్హత ఉన్నా అక్కడికే పరిమితం కావాల్సి వస్తున్నది. వీటన్నింటి పరిగణనలోకి తీసుకుని రీజినల్ డైరెక్టర్ పోస్టులనైనా పెంచాలని, లేకుంటే రీజినల్ డైరెక్టర్ పోస్టులను ఎత్తేసి, వాటిని అడిషనల్ డైరెక్టర్ జాబితాలో కలపాలని అధికారులు కోరుతున్నారు. ఈ మేరకు గత ప్రభుత్వానికి పురపాలకశాఖ లేఖ సైతం రాసింది. అయితే గత ప్రభుత్వం దీనిపై స్పందించకపోగా.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా స్పందించి చర్యలు తీసుకోవాలని, సమస్యను పరిష్కరించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
మొత్తం 98 పోస్టులు ఖాళీ
పురపాలక శాఖ కమిషనరేట్‌లో 371 పోస్టుల మంజూరు చేయగా.. ప్రస్తుతం 273 మంది పనిచేస్తున్నారు. 98 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో అడిషనల్ డైరెక్టర్ పోస్టులు ఆరు ఖాళీగా ఉన్నాయి. స్పెషల్ గ్రేడ్ మున్సిపల్ కమిషనర్ పోస్టులు 18, గ్రేడ్-2 మున్సిపల్ కమిషనర్ పోస్టులు 43, గ్రేడ్ -3 మున్సిపల్ కమిషనర్ పోస్టులు 27 ఖాళీగా ఉన్నాయి.






