- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఆంక్షలు.. వారికి నో ఎంట్రీ
తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో ఆంక్షలు విధించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణం(Telangana Assembly)లో ఆంక్షలు విధించారు. పార్టీ పిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై రేపటి నుంచి వచ్చే నెల 1 వ తేదీ వరకు (Speaker Gaddam Prasad) స్పీకర్ గడ్డం ప్రసాద్‌తో ముఖాముఖి విచారణ జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో ఆంక్షలు విధిస్తూ అధికారులు ఇవాళ ఒక బులెటిన్ విడుదల చేశారు. బులెటిన్ ప్రకారం.. అనుమతి లేనిదే అసెంబ్లీలోకి నో ఎంట్రీ.. విజిటర్లు, మీడియాతో పాటు మాజీ ప్రజా ప్రతినిధులకు ఆంక్షలు విధించారు. ముందస్తు అనుమతి ఉంటేనే అసెంబ్లీ బిల్డింగ్‌లోకి ఎంట్రీ ఉంటుంది. అలాగే మీడియా పాయింట్ వద్ద ఎవరూ మాట్లాడొద్దని నిబంధనలు విధించారు.
ట్రిబ్యునల్ ముందు హాజరయ్యే సభ్యులు (పిటిషనర్లు, రిస్పాండెంట్లు), వారి న్యాయవాదులు కోర్టు హాల్లో మొబైల్ ఫోన్లు తీసుకురావద్దని ఆదేశించారు. ఎవరు మొబైల్‌తో రికార్డింగ్ లేదా ఫోటోలు/వీడియోలు తీస్తే, ఆ ఫోన్ స్వాధీనం చేసుకొని, ఆ న్యాయవాది కోర్ట్‌లో వాదన వినిపించే అవకాశం కోల్పోతారని రాష్ట్ర శాసనసభ సెక్రటరీ నరసింహ చార్యులు బులెటిన్ విడుదల చేశారు. ఈ మేరకు రేపటి నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు ఆంక్షలు (Restrictions) అమలులో ఉండనున్నాయి.
కాగా, తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విచారణకు షెడ్యూల్ రిలీజ్ అయిన సంగతి విదితమే. రేపు ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే టి. ప్రకాశ్ గౌడ్ పార్టీ మార్పుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ దాఖలు చేసిన పిటిషన్ పై, మధ్యాహ్నం 12 గంటలకు ఎమ్మెల్యే కాలే యాదయ్యపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరపనున్నారు. మధ్యాహ్నం 1 గంటలకు గూడెం మహిపాల్ రెడ్డిపై చింత ప్రభాకర్ రెడ్డి, మధ్యాహ్నం 3 గంటలకు బండ్ల కృష్ణమోహన్ రెడ్డిపై పల్లా రాజేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరపనున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అడ్వకేట్లతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఫిర్యాదు దారుల అడ్వకేట్ల మధ్య వాదనలు జరగనున్నాయి. పార్టీ ఫిరాయింపుల పిటిషన్ల విషయంలో స్పీకర్ కు సుప్రీంకోర్టు విధించిన గడువు వచ్చే నెల 30తో ముగియనుంది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలకు పార్టీ ఫిరాయింపు నోటీసులు స్పీకర్ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యేలు ఇప్పటికే అసెంబ్లీ కార్యదర్శికి తమ వివరణలను అఫిడవిట్ రూపంలో అందజేశారు.






