ప్రతి దళిత కుటుంబానికి గౌరవం.. ప్రతి యువకుడికి అవకాశం: మంత్రి లక్ష్మణ్ కుమార్

by Ramesh Naini |

బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలు కేవలం స్మరణకే పరిమితం కాకుండా, దళిత ఆత్మగౌరవ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే సంకల్ప దినంగా మార్చాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు.

ప్రతి దళిత కుటుంబానికి గౌరవం.. ప్రతి యువకుడికి అవకాశం: మంత్రి లక్ష్మణ్ కుమార్
X

దిశ, తెలంగాణ బ్యూరో : భారతదేశ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలు కేవలం స్మరణకే పరిమితం కాకుండా, దళిత ఆత్మగౌరవ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే సంకల్ప దినంగా మార్చాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపునిచ్చారు. సమానత్వం, న్యాయం, స్వాభిమానం అనే మహనీయుడు చూపిన మార్గంలో తెలంగాణ ప్రభుత్వం నడుస్తోందని ఆయన స్పష్టం చేశారు. జగ్జీవన్ రామ్ 119 వ జయంతి వేడుకల సందర్భంగా ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, అధికారంలో ఉన్నప్పటికీ అణగారిన వర్గాల పక్షాన నిలబడిన అరుదైన నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ అని ఆయన కొనియాడారు. దళితులు, పేద, అణగారిన వర్గాలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ నిలుస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించడం దళితుల పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనమని అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ పరిసరాల్లో రూ.100 కోట్లతో 10 అంతస్తుల అంబేద్కర్ టవర్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. కాచిగూడలోని నింబోలిఅడ్డలో రూ. 30 కోట్లతో బాబు జగ్జీవన్ రామ్ భవన్ ను నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు.

దళిత విద్యార్థులకు మద్దతు

దళిత విద్యార్థులకు ఉన్నత విద్యలో బలమైన మద్దతు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్-1, 2, 3, 4 వంటి పోటీ పరీక్షల కోసం ప్రత్యేక శిక్షణ కేంద్రాలను త్వరలో ప్రారంభించనున్నట్లుగా మంత్రి లక్ష్మణ్ కుమార్ ప్రకటించారు. యువతకు ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాల కల్పన పై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. గ్రామ స్థాయిలో దళితుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తూ, మహిళల సాధికారతకు ప్రాధాన్యం ఇస్తున్నామని, ప్రతి దళిత కుటుంబానికి గౌరవం, ప్రతి యువకుడికి అవకాశం కల్పించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జగ్జీవన్ రామ్ కలల భారతాన్ని తెలంగాణలో సాకారం చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ దత్తాత్రేయ, మంత్రులు వివేక్ వెంకటస్వామి, దామోదర రాజనర్సింహ, ఎంపీలు మల్లు రవి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, కౌన్సిల్ ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మందుల సామెల్, నాగరాజు, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ప్రొ. కాసీం, జేబీ రాజు, మేడి పాపయ్య, ఉత్సవ కమిటీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు బాబు జగ్జీవన్ రామ్ కు ఘనంగా నివాళులర్పించారు.

Next Story