ఖరీఫ్‌కు ముందు రైతుల‌కు షాక్‌.. రాష్ట్రంలో అడుగంటుతున్న జలాశయాలు

by velandi.Saikiran |   (  Updated:2026-06-08 22:45:55  IST  )

మరికొద్ది రోజుల్లోనే ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుండగా రైతులు సన్నద్ధం అవుతున్నారు.

ఖరీఫ్‌కు ముందు రైతుల‌కు షాక్‌.. రాష్ట్రంలో అడుగంటుతున్న జలాశయాలు
X

డేంజర్ జోన్‌లో ప్రాజెక్టులు

- రాష్ట్రంలో అడుగంటుతున్న జలాశయాలు

- కృష్ణా, గోదావరి బేసిన్‌ల్లో నిల్వలు తక్కువే

- గతేడాదితో పోలిస్తే భారీగా తగ్గిన నీటి మట్టాలు

- ఖరీఫ్‌కు ముందు ఆందోళన చెందుతున్న రైతాంగం

దిశ, తెలంగాణ బ్యూరో: మరికొద్ది రోజుల్లోనే ఖరీఫ్ సీజన్ ప్రారంభం కానుండగా రైతులు సన్నద్ధం అవుతున్నారు. అయితే రాష్ట్రంలోని జలాశయాలు మాత్రం అన్నదాతలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సాధారణంగా జూన్ మొదటి వారానికే నైరుతి రుతుపవనాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి, వర్షాలు కురవడంతో ప్రాజెక్టుల్లోకి కొత్త నీటి ప్రవాహాలు మొదలవుతుంటాయి. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. ఇంకా వర్షాలు ప్రారంభం కాలేదు. కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రధాన ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీ నిల్వలతో కొనసాగుతున్నాయి. గతేడాదితో పోలిస్తే అనేక జలాశయాల్లో నీటి మట్టాలు తగ్గడం రైతన్నకు సవాల్‌గా మారింది.

283 టీఎంసీలే

రాష్ట్రానికి గోదావరి, కృష్ణాలే ప్రధాన నీటి వనరులు. మరీ ముఖ్యంగా రాష్ట్ర సాగునీటి వ్యవస్థకు కీలకమైన కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల్లో నిల్వలు ప్రస్తుతం ఆశించిన స్థాయిలో లేవు. నీటిపారుదల శాఖ తాజా గణాంకాల ప్రకారం తెలంగాణ పరిధిలోని ప్రధాన జలాశయాల మొత్తం నిల్వ సామర్థ్యం 793.94 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం కేవలం 283.56 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. అంటే మొత్తం సామర్థ్యంలో 35.72 శాతం మాత్రమే నిల్వలు ఉన్నాయి. ఖరీఫ్ సీజన్‌కు ముందు ఈ స్థాయిలో నిల్వలు ఉండటం ఆందోళనకర పరిస్థితిగా అధికారులు, నిపుణులు అభివర్ణిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం కేవలం 39.67 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. నాగార్జునసాగర్‌లో 312.05 టీఎంసీల సామర్థ్యానికి 148.73 టీఎంసీల నీరు ఉంది. గతేడాదితో పోలిస్తే ఈ ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు గణనీయంగా తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి.

మరోవైపు కృష్ణా ఎగువ ప్రాంతాల్లోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లోనూ పూర్తిస్థాయిలో నిల్వలు లేకపోవడం దిగువ ప్రాంతాలకు వచ్చే ప్రవాహాలపై ప్రభావం చూపుతున్నది. దీనికితోడు శ్రీశైలం, నాగార్జునసాగర్‌లోకి కొత్త నీటి ప్రవాహాలు ఆశించినంతగా రావడం లేదు. గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది. శ్రీరాంసాగర్‌లో 80.50 టీఎంసీల సామర్థ్యానికి కేవలం 15.99 టీఎంసీలు మాత్రమే ఉంది. నిజాంసాగర్‌లో 7.26 టీఎంసీలు, మిడ్ మానేరులో 7.52 టీఎంసీలు, లోయర్ మానేరు డ్యాంలో 6.28 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంది. కడెం ప్రాజెక్టులో అయితే పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. 4.70 టీఎంసీల సామర్థ్యానికి కేవలం 0.40 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని సాగు అవసరాలకు ఈ ప్రాజెక్టులే ప్రధాన ఆధారం కాగా నిల్వలు తగ్గిపోవడంతో రైతులు వర్షాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.

ఎల్‌నినో ప్రభావం?

ఈసారి ఎల్‌నినో ప్రభావం ఉంటుందని నిపు ణులు హెచ్చరిస్తున్నారు. దాంతో వర్షాలు సైతం ఆశించిన స్థాయిలో ఉండకపోవచ్చనే ప్రచారాలు జరుగుతున్నాయి. అంతేకాదు.. తాజాగా అంతర్జాతీయ వాతావరణ సంస్థ అదే అంశాన్ని ప్రకటించింది. ఎల్‌నినో ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ప్రభావం ఎదుర్కోబోతున్నామని, రాబోయే కొన్ని నెలలు గడ్డు పరిస్థితి తప్పేలా లేదని హెచ్చరించింది. ఇక రాష్ట్రంలో ఏటా కోటి ఎకరాలకు పైగా ఖరీఫ్ సాగు జరుగుతుంటుంది. జూన్ రెండో వారం నుంచి రైతులు విత్తనాలు వేసే పనుల్లో నిమగ్నమవుతారు. ఈసారి ప్రాజెక్టుల్లో తగినంత నీటి నిల్వలు లేకపోవడం, వర్షాలు ఆలస్యమవడం కారణంగా ఆందోళన పెంచుతున్నా.. ప్రస్తుతం సాగునీటి అవసరం పెద్దగా లేకపోయినా జూలై, ఆగస్టు నెలల్లో పరిస్థితి ప్రమాదం లేకపోలేదు.

అప్పటికీ వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోతే నీటి విడుదలపై ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చని నిపుణులు భావిస్తున్నారు. సాగు అవసరాలతో పాటు తాగునీటి సరఫరా కూడా ప్రభుత్వానికి పెద్ద సవాల్‌గా మారే అవకాశం కనిపిస్తున్నది. హైదరాబాద్‌తోపాటు అనేక పట్టణాలు, గ్రామాలు ప్రాజెక్టులపైనే ఆధారపడి ఉన్నాయి. వేసవి చివరి దశలో ఉండటంతో నీటి వినియోగం పెరిగింది. కొత్తగా వర్షాలు లేకపోతే నిల్వలపై మరింత ఒత్తిడి పెరగనుంది. ప్రస్తుతం సింగూర్‌లో సైతం పరిమిత స్థాయిలోనే నీటి నిల్వలు ఉన్నాయి. హైదరాబాద్‌ దాహార్తి తీర్చడంలో సింగూర్ కీలక పాత్ర పోషిస్తుండటంతో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. తెలంగాణ ఏర్ప డిన తర్వాత కాళేశ్వరం, పాలమూరు, సీతారామ వంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మించినప్పటికీ వాటి నిర్వహణకు కూడా నదుల్లో నీటి లభ్యతే కీలకమైన విషయం తెలిసిందే. కృష్ణా, గోదావరి నదుల్లో సరిపడా ప్రవాహాలు లేకపోతే ఎత్తిపోతల పథకాల సామర్థ్యం కూడా పరిమితం కానుంది.

Next Story