- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతులకు యాప్ సోపాలు
గత సీజన్ ప్రారంభంలో జిల్లా యూనిట్ గా ప్రారంభించిన యూరియా పంపిణీ ప్రక్రియను ప్రస్తుతం మండలాల వారీగా అందజేస్తున్నారు.

రైతులకు యాప్ సోపాలు..
నిమిషాల్లో ఖాళీ.. నిలువరించే వారేరి?!
ఫోన్ బుకింగ్ యాప్ తో రైతుల ఇక్కట్లు
రోజుల తరబడి యూరియా కోసం అగచాట్లు
నిబంధనలు సడలించాలని రైతుల డిమాండ్
దిశ, నందిపేట : రైతన్నను యూరియా కష్టం వెంటాడుతున్నది. పంటల సాగు విధానంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎంత వరకు అందిపుచ్చుకుంటున్నామో తెలియదు కానీ, రైతులకు చేరవలసిన యూరియా మాత్రం కొత్త టెక్నాలజీతో ముందుకు వచ్చి అన్నదాతలను ఆగం చేస్తోంది. గత సీజన్ నుంచి రైతులకు యూరియా కావాలంటే మొబైల్ యాప్ లోనే బుక్ చేసుకోవాలనే పద్ధతిని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. మొబైల్ యాప్ లో బుక్ చేసుకుంటేనే ఎరువు దొరుకుతుంది. అయితే, ఎరువుల స్టాక్ ఎప్పుడు వస్తుందో ఎన్ని నిమిషాల్లో ఖాళీ అవుతుందో తెలియక రైతులు తలలు పట్టుకుంటున్నారు. పంటల సీజన్ ప్రారంభంలోనే ఇలాంటి కష్టాలెదురవుతుంటే ఉంటే మున్ముందు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నారు. ఈ తికమక, గడబిడలో రైతులు గంటల తరబడి పంపిణీ కేంద్రాల వద్ద నిరీక్షించినా ఫలితం ఉండకపోవడంతో రైతులు కన్నెర్ర చేస్తున్నారు. మొబైల్ యాప్ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారు.
గత సీజన్ ప్రారంభంలో జిల్లా యూనిట్ గా ప్రారంభించిన యూరియా పంపిణీ ప్రక్రియను ప్రస్తుతం మండలాల వారీగా అందజేస్తున్నారు. ఇందులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రోస్ సేవా కేంద్రాలు, ప్రైవేట్ దుకాణాలు ఎరువుల పంపిణీ చేపడుతున్నాయి. అయితే మొబైల్ యాప్ లో ఏ దుకాణానికి సరుకు వెళ్లిందో అధికారులు నిర్ధారించి యాప్ లో నిక్షిప్తం చేస్తారు. అయితే సరుకు యాప్ లో కనిపించిన నిమిషాల వ్యవధిలోనే లోనే ఖాళీ కనిపిస్తోంది. కొన్నిచోట్ల అయితే సెకండ్ల వ్యవధి కూడా దాటడం లేదు. ఈ పరిస్థితి ఎందుకు వస్తుందో కూడా సామాన్య రైతుకు తెలియడం లేదు. నిర్వాహకులు, విక్రయదారులు ముందస్తుగా సమాచారం తెలిసిన వారికె ప్రయోజనం దక్కుతుంది. మిగతావారు ప్రతిసారి నిరీక్షించాల్సి వస్తుంది. ఇందులో లోపాయి కారితనం ఉంటుందని, అందుకే సరుకు పెట్టిన సెకండ్లలోని ఎలా ఖాళీ అవుతుందని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అవగాహన లేక.. అందుబాటులోకి రాక..
ఈ మొబైల్ యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోవాలంటే తప్పనిసరిగా రైతుకు మొబైల్ ఫోన్ కలిగి ఉండాలి. అందులోనూ అది కూడా ఇంటర్నెట్ సౌకర్యం కలిగి ఉన్న స్మార్ట్ ఫోన్ అయి ఉండాలి. కనీసం మొబైల్ ఫోను ఆపరేటింగ్ చేసేలా పరిజ్ఞానం తెలిసి ఉండాలి. అంతేకాకుండా సెకన్లలో ఖాళీ అయ్యే యూరియాసరుకును దక్కించుకునేంత వేగం కలిగి ఉండాలి. అప్పుడే యూరియా బస్తా దొరుకుతుంది. లేదంటే రోజుల తరబడి ఎదురుచూపుల్లోనే గడపాలి. సీజన్ ముగిసిపోతే ఎరువులపై ఆశలు వదులుకోవాల్సి వస్తుంది.
82 వేల మెట్రిక్ టన్నులు తెచ్చిన సరిపోవట్లే..
జిల్లాలో ఈ వానకాలం సీజన్లో 5.40 లక్షల ఎకరాల్లో పంటలు పండిస్తున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. గత సీజన్ తో పోలిస్తే కాస్త అటు ఇటుగా ఉంటుంది. ఇందులో వరి పంట ఒక్కటే 4. 40 లక్షల ఎకరాలతో సాగులో ముందు వరుసలో ఉంటుంది. దీనికి అత్యధిక వినియోగం ఉండడంతో రైతులకు తప్పనిసరిగా వినియోగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే సీజన్ లో బుకింగ్ యాప్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత అమ్మకాలు మరింత పెరిగాయి. రోజుకు సగటున 430 మెట్రిక్ టన్నులు (9555 బస్తాలు) అమ్ముడయ్యాయి. అప్పుడు మొత్తంగా 82 వేల మెట్రిక్ టన్నులు యూరియాను రైతులు వినియోగించారు. వాస్తవానికి ఇది గత పదేళ్ళలో గత ఖరీఫ్ లోనే అత్యధికం కావడం గమనార్హం. వాస్తవానికి మొబైల్ యాప్ వచ్చిన తర్వాత కట్టుదిట్టంగా పంపిణీ జరుగుతుందని అధికారులు భావించారు. కానీ పెద్ద రైతులు మొబైల్ యాప్ పై అవగాహన ఉన్నవారే ఎక్కువగా వినియోగించుకుంటుండగా.. చిన్న, సన్న కారు రైతులకు అందకుండా పోతోంది. వరి పంటకు ఎకరానికి 3 నుంచి 4 బస్తాల యూరియా వాడాల్సి ఉండగా, 5 నుంచి 6 బస్తాలు, కొన్ని మండలాల్లో 8 బస్తాల వరకు కూడా వినియోగిస్తున్నట్లు అధికారులు చెపుతున్నారు. యూరియా కొరతకు ఇది కూడా ప్రధాన కారణంగా మారింది. ఈ పరిస్థితిని ఎలా మార్చాలో, యూరియా విచ్చలవిడి వాడకాన్ని ఎలా కట్టడి చేయాలనే విషయాన్ని పక్కనపెట్టి యాప్ ద్వారా పంపిణీ చేయడం విమర్శలకు తావిస్తోంది.
గత 10 ఏళ్లలో విక్రయాలు ఇలా.. ( మెట్రిక్ టన్నులలో)
2015: 54,470
2016: 42,270
2017: 26,836
2018: 36,720
2019: 59,149
2020: 50,221
2021: 60,703
2022: 70,813
2023: 74,977
2024: 79,615
2025: 82,000
విడతలవారీగా వినియోగించుకుంటారని..వీరస్వామి, జిల్లా వ్యవసాయ అధికారి
అవసరం మేరకే రైతులు యూరియాను వినియోగించుకుంటారనే ఉద్దేశంతో ఫర్టిలైజర్ యాప్ విధానాన్ని అమల్లోకి తెచ్చాం. ఒకేసారి తీసుకోకుండా విడతల వారీగా పొందేందుకు ఈ యాప్ దోహదపడుతుంది. గత సీజన్ లో ప్రయోగాత్మకంగా విజయవంతంగా పరిశీలించడం జరిగింది. కొంతమంది రైతులకు ఇబ్బంది జరుగుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. దానికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటాం.






