- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లంచం తీసుకుని నిందితులవుతున్న ఖాకీలు
లంచానికి ఆశపడి కొంతమంది పోలీసు అధికారులు నిందితులుగా అడ్డంగా దొరికిపోతున్నారు.

దిశ, సిటీ క్రైం: లంచానికి ఆశపడి కొంతమంది పోలీసు అధికారులు నిందితులుగా అడ్డంగా దొరికిపోతున్నారు. వారు నమోదు చేసిన కేసుల్లోనే సాయం చేస్తామంటూ నిందితుల నుంచి డబ్బులు డిమాండ్ చేస్తూ ఏసీబీ అధికారులకు చిక్కుతున్నారు. పోలీసులు అక్యూజ్డ్‌గా నమోదైన కేసుల్లో నిందితులే బాధితులుగా ఉండడం గమనార్హం. మొత్తానికి లంచం పోలీసులకు జైలు మంచాన్ని పరిచయం చేస్తున్నది. ఎన్నో కలలు కని, పోటీ పరీక్షల్లో నెగ్గి ఉద్యోగం సాధించాక లంచం మాయలో పడి నిందితులుగా నమోదై పరువు తీసుకుంటున్నారు. నేరం చేసిన నిందితుడే దర్యాప్తు చేస్తున్న అధికారులను లంచం కోసం సతాయిస్తున్నాడని ఏసీబీని ఆశ్రయించి ఆ అధికారి ధన దాహాన్ని బయటపెట్టడంతో పాటు వారిని కటకటాల వెనక్కి నెట్టుతున్న విచిత్ర పరిస్థితి నెలకొంది. ఈ విధంగా లంచం డిమాండ్ చేస్తూ పలువురు అధికారులు పోలీసు డిపార్ట్‌మెంట్ ప్రతిష్టను దిగజార్చుతున్నారు. లంచం డిమాండ్ చేసి నిందితులుగా మారిన పోలీసు అధికారుల సంఖ్య ఈ 6 నెలల్లోనే 10 వరకు ఉన్నట్లు ఏసీబీ అధికారుల రికార్డుల్లో స్పష్టమవుతోంది. నిందితుల నుంచి లంచాలను డిమాండ్ చేసి నిందితులుగా మారిన పోలీసు అధికారుల ఘటనల వివరాలు ఇలా ఉన్నాయి.
రూ.9 లక్షలు డిమాండ్.. 5 లక్షలు ముట్టినా..
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు చెందిన ఇన్‌స్పెక్టర్ బత్తుల మహేందర్ తాను దర్యాప్తు చేసిన ఓ సైబర్ ఫ్రాడ్ కేసులో నిందితుడి కుటుంబ సభ్యులు, అతని స్నేహితుల పేర్లను నమోదు చేస్తానని బెదిరించాడు. అలా జరగొద్దంటే రూ.9 లక్షలు లంచం డిమాండ్ చేశాడు. రూ.5 లక్షలు తీసుకున్నాడు. ఇంకా రూ.4 లక్షల కోసం వేధిస్తుండగా బాధితుడు(ఫ్రాడ్ కేసులో నిందితుడు) ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు ఇన్‌స్పెక్టర్ బత్తుల మహేందర్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని రిమాండ్‌కు పంపించారు. దీంతో సదరు ఇన్‌స్పెక్టర్ ఏసీబీ కేసులో నిందితుడయ్యాడు.
రూ.30వేల కోసం సతాయింపులు..
బోయిన్‌పల్లి పీఎస్‌కు చెందిన సబ్ ఇన్‌స్పెక్టర్ కిరణ్ నందిత, కానిస్టేబుల్ విజయ్ కుమార్ ఓ కేసులో నిందితుడికి సంబంధించిన బెయిల్ కండీషన్స్‌లో వెసులుబాటు కలిగించేందుకు రూ.30వేల లంచం డిమాండ్ చేశారు. లంచం డబ్బు ఇవ్వడంలో ఆలస్యమవుతున్న సందర్భంలో ఈ ఇద్దరి వేధింపులు పెరిగాయి. దీంతో బాధితుడు(నిందితుడు) ఏసీబీ అధికారులకు ఈ ఇద్దరు పోలీసులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టించి వారిని నిందితులుగా బుక్కయ్యేలా చేశాడు.
రూ.5 లక్షలు డిమాండ్.. ఆఖరికి
శంషాబాద్ ఆర్‌జీఐ పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సంపతి కనకయ్య, ఎస్ఐ సిద్ధేశ్వర్ ఓ కేసులో నిందితుడికి మద్దతుగా చార్జిషీటును దాఖలు చేసేందుకు రూ.5 లక్షలు డిమాండ్ చేశారు. ఆ చార్జిషీటులో వారి కుటుంబ సభ్యుల పాత్ర లేకుండా కేసును నీరుగార్చే విధంగా ఉండేలా చూసుకుంటామని ఒప్పందం చేసుకున్నారు. రూ.5 లక్షల లంచం డబ్బు కోసం ఈ ఇద్దరు వేధిస్తుండగా బాధితుడు(నిందితుడు) ఏసీబీ అధికారులను ఆశ్రయించి రూ.2 లక్షలు లంచాన్ని ఇస్తూ ఇద్దరు పోలీసు ఆఫీసర్‌లను పట్టించాడు. దీంతో ఇద్దరు పోలీసులు జైలు పాలయ్యారు.
రోడ్డు మీద లంచం తీసుకుంటూ..
మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ సైబర్ క్రైం పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఆర్ఎస్ఐలు ప్రమోద్ గౌడ్, జతావత్ బాబు నాయక్‌లు వారు దర్యాప్తు చేస్తున్న సైబర్ మోసం కేసులో నిందితుడిని అరెస్టు చేయకుండా నోటీసు ఇచ్చేలా చేయాలంటే రూ.లక్ష డిమాండ్ చేశారు. ఇలా లంచం కోసం పోలీసు ఆఫీసర్‌లు పదేపదే ఫోన్ చేయడంతో బాధితుడు(నిందితుడు) ఏసీబీ అధికారులకు సమాచారం ఇచ్చి ఎల్బీనగర్ చౌరస్తాలో లంచం ఇవ్వడంతో ఇద్దరు పోలీసులు అడ్డంగా దొరికిపోయి జైలు పాలయ్యారు.
రూ.40 వేల లంచం తీసుకుంటూ..
బీఎన్ఎస్ 35 కింద నోటీసు జారీకి సంబంధించిన వ్యవహారంలో వికారాబాద్ జిల్లా ఉమెన్ పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ బి.సరోజ, ఎస్ఐ హెచ్.రాణి నిందితుడి నుంచి రూ.60 వేల లంచాన్ని డిమాండ్ చేశారు. నిందితుడు రూ.40 వేలకు డీల్ కుదుర్చుకున్నాడు. దీనికి కూడా సమయం ఇవ్వకుండా వేధిస్తుండడంతో ఇద్దరు ఆఫీసర్‌లపై అతను ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసి లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టించాడు. ఈ ఘటనతో ఇద్దరు ఆఫీసర్‌లు జైలు పాలయ్యారు. గత రెండు, మూడు సంవత్ససరాల ఏసీబీ కేసుల రికార్డులను పరిశీలిస్తే 20 మందికిపైగా పోలీసులు నిందితులుగా విచారణను ఎదుర్కొంటున్నారని స్పష్టమవుతున్నది.






