High Court: రిజర్వేషన్ల వివాదం.. పంచాయతీ ఎన్నికపై స్టే విధించిన హైకోర్టు

by Prasad Jukanti |   (  Updated:2025-11-27 12:40:27  IST  )

రిజర్వేషన్ల వివాదంతో సర్పంచ్ ఎన్నికల విషయంలో హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది.

High Court: రిజర్వేషన్ల వివాదం..  పంచాయతీ ఎన్నికపై స్టే విధించిన హైకోర్టు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల (Panchayat Election) హడావుడి మొదలైంది. ఫస్ట్ పేజ్ పోలింగ్‍కు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ కాగా ఇవాళ్టి నుంచి నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే కొన్ని చోట్ల బీసీ రిజర్వేషన్ల తో పాటు స్థానిక పరిస్థితులకు భిన్నంగా అసంబద్ధంగా రిజర్వేషన్ల కేటాయింపులు ఉన్నాయనే ఆరోపణలు ఆయా జిల్లాల్లో వినిపిస్తోంది. ఈ క్రమంలో మహబూబాబాద్‌ జిల్లా (Mahabubabad) మహమూద్‍పట్నం పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు (High Court Stay on panchayat Election) స్టే విధించింది. పంచాయతీ పరిధిలో 300 బీసీ, 248 ఎస్సీ, 20 ఓసీ, ఆరుగురు ఎస్టీ ఓటర్లు ఉన్నారు. అయితే ఇటీవల ప్రకటించిన పంచాయతీ రిజర్వేషన్లలో సర్పంచ్ పదవి ఎస్టీ జనరల్‍కు కేటాయించారు. మూడు వార్డు స్థానాలు కూడా అదే సామాజిక వర్గానికి కేటాయించారు. దీంతో కేవలం ఆరుగురు ఓటర్లు ఉన్న ఎస్టీ సామాజిక వర్గానికి నాలుగు పదవులు దక్కడంపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అంశంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‍పై ఇవాళ విచారణ జరిపిన హైకోర్టు.. కేవలం ఆరుగురు ఓటర్లు ఉన్న ఎస్టీలకు.. ఒక సర్పంచ్‌, మూడు వార్డులు ఎలా రిజర్వ్ చేశారని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. ఒకే వార్డులో ఆరుగురు ఎస్టీ ఓటర్లు ఉంటే.. మిగతా రెండు వార్డు సభ్యులను ఎలా ఎంపిక చేస్తారన్న హైకోర్టు ప్రశ్నిస్తూ ఇక్కడ ఎలక్షన్ పై స్టే విధించింది.

Next Story